పరిశ్రమ స్థాపిస్తే రూ.కోటి వరకు హామీలేని రుణం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య చైర్మన్ బీవీ రామారావు
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్), న్యూస్‌లైన్ : నిరుద్యోగులు పరిశ్రమను స్థాపిస్తే రూ.ఐదు లక్షల నుంచి రూ.కోటి వరకు క్రెడిట్ గ్యారెంటీ స్కీం ద్వారా హామీ లేని రుణం పొందవచ్చని రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య చైర్మన్ బీవీ రామారావు చెప్పారు. గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగులు స్వయం ఉపాధి కోసం చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలను స్థాపించే ఆలోచనలు చేయాలన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం రూ. 4 లక్షల కోట్లు కేంద్రం గ్రాంటుగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, భూమి, విద్యుత్, నీరు, రోడ్డు, రైల్వే, ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేస్తే, విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. కృష్ణా, గోదావరి గ్యాస్ బేసిన్ నిక్షేపాలు మన రాష్ట్రంలో ఉన్న 9 గ్యాస్ పవర్ ప్లాంట్లకు తొలుతగా ఇచ్చిన అనంతరమే ఇతర రాష్ట్రాలకు గ్యాస్ నిక్షేపాలను కేటాయించాలన్నారు. వనరులను బట్టి లాభసాటి ప్రాజెక్టులను ఎంచుకోవాలన్నారు. ఆంగ్లో ఇండియన్ కాన్వెంట్ డెరైక్టర్ కొడాలి రమేష్‌బాబు పాల్గొన్నారు.