పంట ఎండిందని ప్రాణం తీసుకున్నాడు..
దోమ: ఆరుగాలం కష్డపడి సాగు చేసిన వరిపంట కళ్ల ముందే ఎండిపోవడంతో అప్పులు తీరేమార్గం లేదని మనోవేదనకు గురైన ఓ అన్నదాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా దోమ మండల పరిధిలోని బొంపల్లి చిన్నతండాలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన ఆంగోతు రాములు నాయక్(35) బొంపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద 6 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని గత మూడేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు.
ఈ ఏడాది ఖరీఫ్‌లో వరిపంట వేశాడు. పెట్టుబడికి, కుటుంబ అవసరాల కోసం దోమ ఎస్బీహెచ్లో రూ.30 వేలు, ప్రైవేట్‌గా మరో రూ.1.70 లక్షల వరకు అప్పు చేశాడు. ఇటీవల విద్యుత్ కోతల కారణంగా పంటకు నీరందక పూర్తిగా ఎండిపోయింది. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదోనని రాములునాయక్ మానసిక వేదనకు గురయ్యాడు.
అప్పులు తీరేమార్గం లేదని మనస్తాపం చెందిన ఆయన మంగళవారం మధ్యాహ్నం పొలంలో తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత పొలానికి వెళ్లిన చిన్న కుమారుడు సేవ్యా తండ్రి మృతదేహాన్ని గమనించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మృతుడికి భార్య లక్ష్మీబాయితో పాటు కుమారులు శంకర్, సేవ్యా, కుమార్తె సావిత్రి ఉన్నారు. రైతు మృతితో కుటుంబీకులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతుడి తండ్రి రూప్సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.