తల్వార్లకు మళ్లీ నిరాశే
న్యూఢిల్లీ/అలహాబాద్: కూతురు ఆరుషి హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్న ఆమె తల్లిదండ్రులు రాజేశ్, నూపుర్ తల్వార్‌కు బెయిల్ ఇచ్చేందుకు అలహాబాద్ హైకోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ కేసు సీబీఐ కోర్టు గత నవంబరులో వీరికి యావజ్జీవ శిక్ష విధించడం తెలిసిందే. నేరతీవ్రత, హత్య జరిగిన విధానాన్ని పరిశీలిస్తే అపరాధులు బెయిల్‌కు అర్హులు కారని న్యాయమూర్తులు రాకేశ్ తివారీ, అనిల్ కుమార్ అగర్వాల్‌తో కూడిన డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.
అయితే దిగువకోర్టు తమకు యావజ్జీవ శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ ఈ దంపతులు దాఖలు చేసిన పిటిషన్‌పై త్వరగా విచారణ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసేందుకు అంగీకరించింది. దీనిపై ఈ నెల 28న విచారణ నిర్వహిస్తామని ప్రకటించింది. శిక్ష విధింపును సవాల్ చేస్తూ అపరాధులు జనవరిలోనే పిటిషన్ దాఖలు చేశారు ఆరుషి (14), వీళ్ల ఇంటి నౌకరు హేమరాజ్ 2008, మే 15 రాత్రి హత్యకు గురయ్యారు. కేసులో ఉన్న ఆధారాలను పరిశీలిస్తే వీరిని హత్య చేసేందుకు బయటి నుంచి ఎవరూ రాలేదని నిర్ధారణ అయిందని సీబీఐ పేర్కొంది. కాబట్టి తల్లిదండ్రులే హంతకులని స్పష్టం చేసింది. దీంతో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వీళ్లిద్దరికి యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది.