‘పసిడి డిపాజిట్’కు స్పందన కరువు
ఇప్పటిదాకా వచ్చిన డిపాజిట్లు 400 గ్రాములే
బాండ్ల పథకంలో రూ. 145 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: కేంద్రం ఇటీవల అట్టహాసంగా ప్రారంభించిన బంగారం డిపాజిట్ పథకానికి అంతంత మాత్రం స్పందనే కనిపిస్తోంది. దీని కింద ఇప్పటిదాకా 400 గ్రాముల మేర మాత్రమే పసిడి డిపాజిట్లు వచ్చాయి. వజ్రాభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి జీజేఈపీసీ ఉత్తరాది రీజియన్ చైర్మన్ అనిల్ శంఖ్వాల్ ఈ విషయం తెలిపారు. ప్రస్తుతమున్న 13,000 మంది బీఐఎస్ సర్టిఫైడ్ జ్యుయలర్లందరూ కూడా పసిడి కలెక్షన్ ఏజెంట్లుగా వ్యవహరించేందుకు అనుమతులిస్తే ఈ ప్రయోగం విజయవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పసిడి డిపాజిట్లు మరింత పెరిగేందుకు తీసుకోతగిన మరిన్ని చర్యల గురించి పరిశ్రమ ప్రతినిధులు గురువారం ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌తో సమావేశమయ్యారు. రిజర్వ్ బ్యాంక్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్), ఎంఎంటీసీ, ఇతర ప్రైవేట్ బ్యాంకుల ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొన్నారు. బంగారం టెస్టింగ్ సెంటర్లను మరింతగా పెంచడంపై చర్చించారు.
బీఐఎస్‌లో నమోదు చేసుకున్న జ్యుయలర్లను పసిడి కలెక్షన్ ఏజెంట్లుగా వ్యవహరించేందుకు అనుమతించాలని ఈ సందర్భంగా తాము కోరినట్లు పీపీ జ్యుయలర్స్ సీఈవో రాహుల్ గుప్తా చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3.5 లక్షల మంది ఆభరణాల వర్తకులు ఉండగా, వీరిలో 13,000 మందికి బీఐఎస్ సర్టిఫికేషన్ ఉందని ఆయన వివరించారు. ఈ సంస్థలకు టెస్టింగ్ అనుమతులు ఇచ్చేందుకు ఆర్థిక శాఖ సూత్రప్రాయంగా అంగీకరించిందని పేర్కొన్నారు.
పసిడి డిపాజిట్ పథకమిదీ..
దేశీయంగా ప్రజల వద్ద దాదాపు రూ. 52 లక్షల కోట్ల విలువ చేసే 20,000 టన్నుల మేర పసిడి నిరుపయోగంగా ఉంటోందని అంచనా. ఈ బంగారాన్ని మార్కెట్లోకి రప్పించడం ద్వారా పసిడి దిగుమతుల భారాన్ని తగ్గించే దిశగా కేంద్రం ఈ నెల 5న పసిడి డిపాజిట్ పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని కింద తమ వద్ద ఉన్న పసిడిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసేవారికి వార్షికంగా 2.50 శాతం మేర వడ్డీ లభిస్తుంది.
గోల్డ్ బాండ్స్ పథకం నేటితో ఆఖరు..
ఈ నెల 5న ప్రవేశపెట్టిన పసిడి బాండ్ల పథకం నేటితో(శుక్రవారం) ముగియనుంది. ఇప్పటిదాకా ఈ స్కీము కింద రూ. 145 కోట్ల మేర బాండ్ల కొనుగోళ్లు జరిగాయని, అంతిమంగా రూ. 150 కోట్ల లెక్క తేలవచ్చని ప్రభుత్వ రంగ బ్యాంకు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. నవంబరు 5న గోల్డ్ బాండ్స్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కనిష్టంగా 2 గ్రాముల నుంచి గరిష్టంగా 500 గ్రాముల దాకా పసిడి విలువను ప్రతిబింబించే బాండ్లను కొనుగోలుదారులు తీసుకోవచ్చు. గోల్డ్ బాండ్స్‌పై 2.75 శాతం వార్షిక వడ్డీ రేటు ఉంటుంది.