కుక్కను వేధించినందుకు జరిమానా!
పాశ్చాత్యదేశాల్లో జంతువులను హింసిస్తే కేసులవుతాయి. మన దగ్గరా జంతు ప్రేమికులు క్రియాశీలమవుతున్నారనేందుకు ఇదో ఉదాహరణ. నవీ ముంబైలోని ఖార్గార్ ప్రాంతంలో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) విద్యార్థులు ముగ్గురు లాబ్రాడర్ జాతికి చెందిన ఓ కుక్కపిల్లను హింసించారు. సిగరెట్లు తాగుతూ పొగను దాని నోట్లోకి బలవంతంగా ఊదారు. ఈ వీడియో ఎవరిద్వారానో జంతుహక్కుల సంస్థకు అందింది. వారు వెంటనే... క్యాంపస్‌లో తెలిసిన వ్యక్తి ద్వారా ఆ ముగ్గురెవరో గుర్తించారు.
వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరేంద్ర సింగ్ అనే విద్యార్థి దీన్ని పెంచుకుంటున్నాడు. స్నేహితులు రోహిత్ పంచపాల్, సుర్యాంశు రాజ్‌లతో కలిసి ఈ చర్యకు పాల్పడ్డారు. పోలీసులు వెంటనే ఈ ముగ్గురిని పోలీసుస్టేషన్‌కు పిలిపించి రూ. 2,500 జరిమానా విధించారు. అలాగే కుక్కపిల్లను వారి నుంచి స్వాధీనం చేసుకొని సంరక్షణాలయానికి తరలించారు.