హరికృష్ణ గేమ్ ‘డ్రా’
న్యూఢిల్లీ: షెన్జెన్ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ నాలుగో ‘డ్రా’ నమోదు చేశాడు. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం హరికృష్ణ, అనీశ్ గిరి (నెదర్లాండ్స్) మధ్య జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్ ‘డ్రా’ అయింది. నల్లపావులతో ఆడిన హరికృష్ణ 41 ఎత్తుల్లో అనీశ్ గిరిని నిలువరించాడు.
ఎనిమిదో రౌండ్ తర్వాత హరికృష్ణ నాలుగు పాయింట్లతో పీటర్ స్విద్లెర్ (రష్యా)తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. లిరెన్ డింగ్ (చైనా) ఐదు పాయింట్లతో అగ్రస్థానంలో, అనీశ్ గిరి 4.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. శనివారం జరిగే తొమ్మిదో రౌండ్లో యు యాంగి (చైనా)తో హరికృష్ణ ఆడతాడు.