స్పోర్ట్స్ యాంకర్‌గా రాణిస్తున్న అంజలి
►స్పోర్ట్స్ యూంకర్‌గా రాణిస్తున్న భీమవరం యువతి
► సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్న వైనం
క్రీడా పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ, క్రీడాభిమానులను ఉత్సాహపర్చడంతో పాటు ఆట తీరు, క్రీడాకారుల నైపుణ్యాలను వర్ణిస్తుంటారు స్పోర్ట్స్ యూంకర్లు. ఐపీఎల్, వరల్డ్ కప్, ఐబీఎల్ వంటి టోర్నమెంట్‌ల్లో మహిళా స్పోర్ట్స్ యాంకర్లు వీక్షకులను కట్టిపడేస్తుంటారు. వీరిని చూసి స్ఫూర్తి పొందిన ఓ యువతి స్పోర్ట్స్ యూంకర్‌గా రాణిస్తోంది. జిల్లాలో జరుగుతున్న ఫుట్‌బాల్ లీగ్ ఆఫ్ వెస్ట్ గోదావరి (ఫ్లో) టోర్నమెంట్లో క్రీడాభిమానులను అలరిస్తోంది. యూంకరింగ్లో దూసుకుపోవడంతో పాటు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటోంది
భీమవరానికి చెందిన అంజలి షెహన.
అనుభవం లేకపోయినా అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్నారు నేటితరం యువత. భీమవ రానికి చెందిన అంజలి షెహన ఈ కోవకు చెందిన అమ్మాయే. కొద్దిరోజులుగా జిల్లాలో జరుగుతున్న ఫ్లో టోర్నమెంట్లో యూంకరింగ్ చేస్తూ మన్ననలు పొందుతోంది. అభిమానులను ఉత్సాహపరుస్తూ, క్రీడాకారుల నైపుణ్యాన్ని వర్ణిస్తూ పోటీలకు కొత్త ఊపు తె స్తోంది. ఈ నెల 2వ తేదీ నుంచి జరుగుతున్న ‘ఫ్లో’ పోటీల్లో అంజలి స్పోర్ట్స్ యాంకర్‌గా ఆకట్టుకుంటోంది. మైక్ పట్టుకుని పోటీలు చూసేందుకు వస్తున్న అభిమానుల్లో జోష్ పెంచుతోంది. తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, ఏలూరు, జంగారెడ్డిగూడెం, భీమవరం జట్ల అభిమానుల మధ్య యూంకరింగ్తో రసవత్తరమైన పోటీను సృష్టిస్తోంది. ఫుట్‌బాల్‌పై ఆసక్తిని పెంచుతూ పోటీల విజయవంతానికి కృషిచేస్తోంది.
సినీ నటిగా రాణిస్తూ..
ఐపీఎల్, ఐబీఎల్, వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌ల్లో లేడీ యాంకరింగ్‌ను చూసిన ఫ్లో అభిమానులు అంజలి యూంకరింగ్ను చూసి ముగ్ధులవుతున్నారు. యూంకరింగ్లో రాణించాలనే ఆసక్తి ఉన్న యువకులలో ఆమె స్ఫూర్తి నింపుతోంది. బీకాం చదివిన అంజలి సినీ నటిగానూ అవకాశాలు దక్కించుకుంటోంది. ఆ ఇద్దరు, అలా సరదాగా, అన్నౌన్ సినిమాల్లో నటించింది. ‘ నీకై పడిపోయా’ అనే కొత్త సినిమాలో హీరో హేమంత్‌రెడ్డి సరసన నటించేందుకు అవకాశం దక్కించుకుంది. ఐదేళ్లుగా సాంస్కృతిక, అందాల పోటీల్లో పాల్గొంటూ అవార్డులు అందుకుంటోంది.
ఆత్మ విశ్వాసంతో రాణించాలి
క్రీడారంగంలో పలు అవకాశాలు వస్తున్నాయి. ఆటలపై అవగాహన పెంచుకోవాలి. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆత్మవిశ్వాసంతో రాణించాలి. భయాన్ని వీడి ఇష్టపడి పనిచేస్తే ఏ రంగంలోనైన రాణించవచ్చు అనేది నా నమ్మకం.
- అంజలి షెహన