అలరించిన అంకరాజు అలేఖ్య అరంగేట్రం
గతవారం ఇండియానా పొలిస్ లో చి.సౌ అంకరాజు అలేఖ్య కర్ణాటక శాస్త్రీయసంగీత రంగప్రవేశం దిగ్విజయంగా జరిగింది. దీనికి గాను మృదంగ విద్వాన్ త్రివేండ్రం బాలాజీ, వాయులీన విదూషి కుమారి రంజనీ రామకృష్ణలు వాయిద్య సహకారమందించారు. ఎనిమిదవ తరగతి చదువుతున్న అలేఖ్య, నాలుగుసంవత్సరాల చిరుప్రాయంలొనే తన తల్లిగారివద్ద శాస్త్రీయసంగీతంలో తొలిపాఠాలు నేర్చుకుంది. శ్రీమతి వసంత శ్రీనివాసన్, శ్రీమతి లక్ష్మివారణాసిల వద్ద శిష్యరికంచేసి, గతనాలుగుసంవత్సరాలుగా కళారత్న శ్రీ డి శేషాచారి(హైదరాబాద్ బ్రదర్స్) గారి వద్ద స్కైప్ (అంతర్జాల దృశ్యశ్రవణ) మాధ్యమం ద్వారా శిక్షణ తీసుకుంటోంది. గాత్రంలోనే కాక, కర్నాటక మరియు పశ్చిమ శాస్త్రీయ సాంప్రదాయపద్ధతుల్లో వాయులీనవాద్యమందుకూడా సుశిక్షితురాలు. కచేరినందు, శృతి శుద్ధమైన గాత్రం, సాధికారికమైన ఉఛ్చారణ, భావగాంభీర్యత తనప్రత్యేకతలని వివిధ రాగమాలికాలాపనలద్వారా ప్రకటితముచేయడములో సఫలీకృతురాలయ్యింది శ్రీమతి లలిత, శ్రీ కృష్ణ అంకరాజుల జ్యేష్ట పుత్రికయైన అలేఖ్య. రాగతాళరీతులందు తన ప్రావీణ్యత, మనోధర్మానుసార రాగవిస్తారణాకౌశలము, జతిగతిగమన నియంత్రణాపటిమలను సభాసదులు సదృశముగా తిలకించి, సకర్ణముగా ఆలకించారు.
సంగీత సాధనతోపాటూ, విద్యాభ్యాసన, సేవా సంబంధిత వ్యాసంగములందేగాక, జాతీయస్థాయి స్పెల్లింగ్ బీ పోటీలందుకూడా జయకేతనమెగురవేస్తున్న చిన్నారిని ఆహుతులందరూ ప్రశంసించారు. తన సాధన వెనుక వెన్నుదన్నుగానిల్చిన తల్లిదండ్రులను, గురువులను, శ్రేయొభిలాషులను వినమ్రశీలియైన అలేఖ్య సభాముఖముగా ప్రస్తుతించడం, రసజ్ఞుల హృదయాలను ఆర్ద్రపరచింది. విద్వాన్ కచేరి అనంతరం కమ్మని విందుభోజనముతో సంపూర్ణనందభరితులైన అతిధులందరూ చిన్నారిని మరెన్నో ఉన్నత శిఖరాలనధిరోహించాలని ఆశీర్వదించడముతో రంగప్రవేశమహోత్సవము పరిసమాప్తియైనది.