'అమ్మ'ను కాపీ కొడుతున్న 'అన్న'
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన వారిలో ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడి రూటే సపరేటూ.. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో వివిధ పథకాలు ప్రవేశపెట్టారు. అవన్నీ ఇతర దేశాలలో చూసి అక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమాలను నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టారు. ఉదాహరణకు జన్మభూమి ... దక్షిణ కొరియాలో అమలవుతున్న ఓ కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించారు.
ఆయన తన గత తొమ్మిదేళ్ల పాలనలో ఇలాంటి తరహా పథకాల ఎన్నో ఎన్నెన్నో. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక... తమిళనాడులో జయలలిత ప్రభుత్వం అమ్మ పేరిట ప్రారంభించిన పథకాలు దిగ్విజయంగా కొనసాగుతుండటంతో అవే పథకాలు అన్న పేరుతో రాష్ట్రంలో ప్రారంభించాలని బాబు తలుస్తున్నట్టుంది.
అంతే అనుకున్నదే తడువుగా ఆయన మంత్రివర్గంలో కొంతమంది మంత్రుల బృందం ఇప్పటికే రెండు సార్లు అమ్మ పథకాల అధ్యయనం పేరిట తమిళనాడులో రెండు సార్లు పర్యటించి వచ్చారు. ముచ్చటగా మూడోసారి ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే తమిళనాడులో మరోసారి అధ్యాయనానికి వెళ్లేందుకు మంత్రుల బృందం ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంది. కాపీ కొట్టిన పథకాలను అమలు చేస్తూ ప్రచారం పొందటం బాబుకి అలవాటే.