నాణ్యతా ప్రమాణాకు తిలోదకాలు
వెంకన్న అన్నదాన సత్రం నిర్మాణంలో అవినీతి
బీటలు వారుతున్న పునాదులు
వాడపల్లి (ఆత్రేయపురం) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్మాణంలో ఉన్న అన్నదాన సత్రం పునాదులు బీటలు వారుతున్నాయి. సుమారు రూ.80 లక్షలతో చేపట్టిన భవన నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు భవన నిర్మాణం పర్యవేక్షణ చేపట్టకపోవడంతో ఽపనులు నాశిరకంగా జరిగాయని పలువురు ఆరోపిస్తున్నారు. దానికితోడు బినామీ కాంట్రాక్టర్లకు అనుభవం లేకపోవడంతోనే పనులు లోపభూయిష్టంగా జరుగుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖ 2016లో భవన నిర్మాణానికి సుమారు రూ.80 లక్షలు మంజూరు చేసింది. అయితే ఆ పనులపై కన్నెసిన గ్రామానికి చెందిన నలుగురు పచ్చచొక్క నేతలు బినామి పేరుతో పనులు సొంతం చేసుకున్నారని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. నాశిరకం మెటీరియల్ వాడకం, పునాదిలో ఇసుక ఫిలింగ్ సమయంలో చౌడు మట్టి వాడటం, క్యూరింగ్ నిబంధనలు పాటించక పోవడంతో భవనం నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనులు ప్రారంభమై ఏడాది పూర్తి కావస్తున్నా నేటికీ పూర్తికాకపోవడంపై పలువురు భక్తులు ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఆలయానికి వచ్చే భక్తులు మండుటెండల్లో స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు.