సిలికానాంధ్ర వర్సిటీలో అన్నమయ్య జయంతి
- రెండు రోజులపాటు ఘనంగా వేడుకలు
కాలిఫోర్నియా: తొలి వాగ్గేయకారుడు, పదకవితా పితమహుడు తాళ్లపాక అన్నమాచార్య 609వ జయంతిని అమెరికాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఘనంగా నిర్వహించింది. శని, ఆదివారాల్లో డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో అత్యంత వైభవంగా నిర్వహించిన వేడుకలకు పలువురు ప్రముఖులు, రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కళాకారులు హాజరయ్యారు. అన్నమయ్య జయంతి సందర్భంగా సిలికానాంధ్ర ఆధ్వర్యంలో గడిచిన రెండు నెలలుగా న్యూజెర్సీ, డాలస్, చికాగో, మిల్పీటస్ తదితర నగరాల్లో సంగీత, నృత్య పోటీలు నిర్వహించారు. ప్రాంతీయంగా విజేతలుగా నిలిచినవారు కాలిఫోర్నియాలో తుది విడత పోటీల్లో ప్రదర్శనలు ఇచ్చారు. పోటీల మధ్యలో గీతాంజలి మ్యూజిక్ స్కూల్, కచపి స్వరధార అకాడెమి విద్యార్థులు నృత్య గాన ప్రదర్శనలు ఇచ్చారు.
శనివారం సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి నృత్య కళాప్రవీణ సుమతీ కౌశల్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. ‘బాలక్క’గా ఖ్యాతిపొందిన బాల కొండలరావు తన కుమారుడైన ఆదిత్య బుల్లిబ్రహ్మంతో కలిసి పలు అన్నమయ్య కీర్తనలకు కూచిపూడీ నృత్యం చేశారు. ఈ ఏడాది సంగీత నాటక అకాడమీ అవార్డుకు ఎంపికైన బాలక్కతోపాటు అమెరికాలో కూచిపూడికి సేవ చేస్తున్న సుమతీ కౌశల్‌ను లకిరెడ్డి హనిమిరెడ్డి సత్కరించారు. అటుపై, గరిమెళ్ళ అనిల్ కుమార్ అనూరాధ శ్రీధర్ (వయోలిన్), రవీద్రభారతి శ్రీధరన్ (మృదంగం) వాద్య సహకారంతో అన్నమయ్య కీర్తనల కచేరి నిర్వహించారు. ఆ తరువాత మృత్యుంజయుడు తాటిపామల సంపాదకత్వంలో తయారైన సుజనరంజని ప్రత్యేక సంచికను ఆనంద్ కూచిభొట్ల, దిలీప్ కొండిపర్తి, రాజు చమర్తి, దీనబాబు కొండుభట్ల, ప్రభ మాలేంపాటి సమక్షంలో విడుదల చేశారు. ఈ పత్రికకు ఉప సంపాదకులు గా ఫణిమాధవ్ కస్తూరి వ్యవహరిస్తున్నారు.
అన్నమయ్య జయంతి ఉత్సవాల రెండోరోజు(ఆదివారం) నగర సంకీర్తనతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అన్నమయ్య కీర్తనలు పాడుతూ స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను మిల్పీటస్ నగర పురవీధుల గుండా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి తీసుకువచ్చారు. సాయంత్రం పెరవలి జయభాస్కర్ గారి మృదంగ లయ విన్యాసం ఆకట్టుకుంది. దీనికి అనూరాధ శ్రీధర్ వయోలిన్ సహకారం అందించారు. ఆ తర్వాత కర్ణాటక సంగీత విద్వాంసులు శశికిరణ్, చిత్రవీణ గణేశ్ అన్నమయ్య కీర్తనలు ఆలాపించగా కృపాలక్ష్మి దానికి తదనుగుణంగా నృత్యం చేశారు. జాతీయ పొటీలలో గెలుపొందిన సంగీత, నృత్య పోటీదార్లకు బహుమతుల ప్రదానంతో కార్యక్రమం ముగిసింది.
అమెరికా వ్యాప్తంగా జరిగిన అన్నమయ్య జయంతి ఉత్సవాలను అత్యంత వైభవం గా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ సిలికానాంధ్ర వాగ్గేయకార బృంద ఉపాద్యక్షులు సంజీవ్ తనుగుల, బృంద సభ్యులు షీలా సర్వ, వంశీ నాదెళ్ల, వాణి గుండ్లపల్లి, సదా మల్లాది, ప్రవీణ్, శరత్ వేట(న్యూజెర్సీ), భాస్కర్ రాయవరం(డాలస్), సుజాత అప్పలనేని(చికాగో)లు ధన్యవాదాలు తెలిపారు.