అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఎన్నారై మృతి
వాషింగ్టన్(యూఎస్ఏ): అమెరికాలోని కొలంబస్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయుడు చనిపోగా ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. అన్షుల్ శర్మ(30), ఆయన భార్య సమిరా భరద్వాజ్(29) ఆదివారం ఉదయం నడిచి వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు వారిపైగా దూసుకెళ్లింది.
ఈ ఘటనలో అన్షుల్ శర్మ తలకు తీవ్ర గాయాలు కావటంతో అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆయన భార్య సమిరా భరద్వాజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మద్యం మత్తులో ఉన్న మైఖేల్ డిమాయో(36) అనే వ్యక్తి ఈ ఘటనకు కారకుడని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. కొలంబస్ నగరంలోని కుమ్మిన్స్ అనే డీజిల్ ఇంజిన్ల తయారీ కర్మాగారంలో ఇంజినీర్‌గా అన్షుల్ శర్మ పనిచేస్తున్నారు. ప్రస్తుతం సమిరా భరద్వాజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అన్షుల్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అతని కుటుంబానికి తామంతా అండగా ఉంటామని ఎన్నారై బృందం తెలిపింది.