నియమబద్ధ పుష్కరస్నానమే ఫలదాయకం
మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ
రాజమహేంద్రవరం కల్చరల్ :
గోదావరి ఆది పుష్కరాల్లోనైనా, అంత్య పుష్కరాల్లోనైనా స్నానం చేయడం వలన మూడున్నర కోట్ల తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుందని మహామహోపాధ్యాయ, శాస్త్రనిధి విశ్వనాథ గోపాలకృష్ణ అన్నారు. ‘పుష్కరస్నానం వినోదానికి కాదు. తీర్థస్నానాల విషయంలో మహర్షులు కొన్ని నియమాలను, సాంప్రదాయాలను ఏర్పాటు చేశారు. వాటిని ఆచరించినప్పుడే పుష్కరస్నాన ఫలితం లభిస్తుంది’ అన్నారు. గోదావరికి అంత్యపుష్కరాలు సమీపిస్తున్నందు పుష్కర స్నానానికి సంబంధించి ఆచార వ్యవహారాలను, శాస్త్రనియమాలను వివరించమని ‘సాక్షి’ కోరినప్పుడు ఇలా వివరించారు..
‘నదీప్రవాహానికి అభిముఖంగా నిలబడి స్నానం చేయాలి. సాధారణంగా రాత్రి సమయాల్లో, భోజనానంతరం స్నానం నిషేధం. కానీ, మహానదుల విషయంలో–గ్రహణ, పుష్కరసమయాల్లో ఇటువంటి పట్టింపులు లేవు. గురు, శుక్రవారాలు, అధికమాసాలు, మూఢమి పట్టింపులు లేవు. పుష్కరదినాల్లో రాత్రివేళ ‘గౌతమీ మాహాత్మ్యము’ పారాయణ చేసి, మరుసటిరోజు పుష్కరస్నానం చేయడం ఒక సాంప్రదాయం. స్నానానికి ముందు గట్టుపై నిలబడి, మట్టిని తీసి, గోదావరి జలాల్లోకి ఈ కింది శ్లోకం చదువుతూ విసరాలి.
‘పిప్పలాదాత్సముత్పన్నే కృత్యే లోకభయంకరి
మృత్తికాం తే మయాదతా ్తమహారార్థం ప్రకల్పయా’
పై విధంగా చేయకపోతే, స్నానం చేసే వారి పుణ్యాన్ని ‘కృత్య’అనే శక్తి భక్షించి వేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక గోదావరి జలాల్లో స్నానం ప్రారంభించాలి. ముందుగా గోదావరీమాతకు నమస్కరించి, ఆచమనం చేసి, ఇలా సంకల్పం చెప్పుకోవాలి.
‘అస్యాం మహానద్యాం సమస్త పాపక్షయార్థం, సింహం గతే దేవగురౌ, సార్థ త్రికోటి తీర్థసహిత తీర్థరాజ సమాగమాఖ్య మహాపర్వణి పుణ్యకాలే అఖండ గౌతమీస్నాన మహం కరిష్యే’
సంకల్పం చెప్పాక సూర్యభగవానునికి అర్ఘ్యం ఇచ్చి, మరో సారి స్నానం చేయాలి. స్నానం పూర్తయ్యాక షోడశోపచారాలతో గోదావరి నదీమతల్లికి పూజలు చేయాలి. యథాశక్తి దానధర్మాలు చేయాలి. ఆదిపుష్కర స్నాన ఫలితమే అంత్యపుష్కర స్నానంతోనూ వస్తుందనడంలో సందేహం లేదు.