వాయు కాలుష్యంపై నేడు అవగాహన ర్యాలీ
గుర్గావ్: దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్న గాలి కాలుష్యంపై అవగాహన పెంచడానికి నగరానికి చెందిన నగర్రో ఐటీ కంపెనీ, రాహగిరీ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఆదివారం ‘యాంటీ ఎయిర్ పొల్యూషన్ రైడ్’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ఎలక్ట్రానిక్ సిటీలోని నగర్రో కార్యాలయం నుంచి ప్రారంభమై ఉద్యోగ్ విహార్ మీదుగా రాహగిరీ జోన్‌కు చేరుతుంది. ప్రస్తుత డాటా ప్రకారం గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి, ప్రమాదకర స్థాయికి చేరుకుంది. భారతీయులంతా ఈ సమస్యపై పోరాడాల్సిన అవసరముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రవాణాకు సైకిల్‌ను ఉపయోగించడం మంచి పద్ధతని అభిప్రాయపడుతున్నారు. గుర్గావ్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని హైవేలు, రోడ్డు మార్గాల్లో సైక్లింగ్ ప్రమాదకరమైనప్పటికీ దీనిని ఉపయోగించాల్సిన అవసరముందని విశ్లేషకులు అంటున్నారు.
వాయు కాలుష్యం వల్ల ప్రతి ఏడాది ఇండియాలో 6 లక్షల మంది చనిపోతున్నారు. మెట్రో నగరాల్లో కాలుష్యం పెరగడానికి 70 శాతం మోటారు వాహనాలు కారణమవుతున్నాయి. తాజాగా ఢిల్లీని ప్రపంచంలోనే కాలుష్య ప్రాంతంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తీర్మానించింది. దీనికి గుర్గావ్ కూడా చాలా దగ్గరగా ఉంది. మరో సర్వేలో ప్రతి రోజూ ఢిల్లీలో 20 మంది చనిపోతున్నట్లు తేలింది. దాదాపు ఆరు మిలియన్ల మంది ఆస్థమా బారిన పడినట్లు అంచనా వేసింది. వాయు కాలుష్యం విషయంలో ఢిల్లీ కంటే గుర్గావ్ కొద్దిగా మేలు. అంతేకాకుండా ఆర్థిక, సామాజిక, నివాసాల విషయంలో ఢిల్లీకి సమానంగా నగరంగా అభివృద్ధిని సాధించింది. వారాంతాల్లో సైక్లింగ్ చేయడం వల్ల దీనిపై అవగాహన పెరుగుతుందని ఆశిస్తున్నారు.