ఆరోగ్యంతోనే అభ్యుదయ సమాజం
సమష్టి ప్రజా ఉద్యమంతోనే అది సాధ్యం
‘దోమలపై దండయాత్ర’లో మంత్రి దేవినేని
కాకినాడ :
ప్రాణాంతక వ్యాధులకు కారణమౌతున్న దోమల నిర్మూలనకు ప్రజలంతా సమష్టిగా ఉద్యమించి ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనలో భాగస్వాములు కావాలని జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక రేచర్లపేటలో కాకినాడ నగరపాలక సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘దోమలపై దండయాత్ర–పరిసరాల పరిశుభ్రత’ కార్యక్రమాల్లో మంత్రి దేవినేని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేచర్లపేట నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యవంతులైన ప్రజలతో విలసిల్లే సమాజమే అన్ని రంగాల్లో పురోగమిస్తుందని అన్నారు. దోమకాటు వల్ల డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా, ఫైలేరియా, మెదడువాపు వంటి వ్యాధులు ప్రబలి ప్రజలను శారీరకంగా, ఆర్థికంగా కుంగదీస్తున్నాయన్నారు. దోమల నిర్మూలనకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ద్వారా ప్రభుత్వపరంగా చేపడుతున్న చర్యలను వివరించారు. శనివారం జిల్లాలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఇంటింటి ప్రదర్శన ద్వారా 15 లక్షల కుటుంబాలను కలిసి దోమల నిర్మూలనకు చేపట్టవలసిన చర్యలపై అవగాహన కల్పించారన్నారు. దోమలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై ముద్రించిన కరపత్రాలను ఉపాధ్యాయులు, విద్యార్థులకు పంపిణీ చేసి వారి ద్వారా ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ, కాకినాడ నగరపాలక సంస్థ ప్రచురించిన ‘దోమలపై దండయాత్ర–పరిసరాల పరిశుభ్రత’ స్టిక్కర్లు, కరపత్రాలు, బుక్లెట్లు, పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు అందించిన దోమకాటు వల్ల కలిగే రోగాల నివారణకు హోమియో మందును ఆయన పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులు, ఉద్యోగులు దోమలపై దండయాత్ర నినాదాలతో నగరవీధుల నుంచి నిర్వహించిన భారీ ర్యాలీని మంత్రి దేవినేని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం డేగల శేషువెంకయ్యమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ చైర్మన్ డేగల చంద్రశేఖర్ ఉచితంగా పంపిణీ చేయనున్న హోమియోపతి మందు పంపిణీని ప్రారంభించి మరిన్ని సేవాకార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, కలెక్టర్ అరుణ్‌కుమార్, నగర కమిషనర్ ఆలీమ్‌బాషా, అదనపు కమిషనర్ గోవిందస్వామి, ఉప కమిషనర్ సన్యాసిరావు, ఈఈ విజయకుమార్, ఆర్డీవో బీఆర్ అంబేద్కర్, తహసీల్దార్ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.