కో-ఆపరేటివ్ బ్యాంకు ఎన్నికల్లో రమేష్ గోపాల్ గ్రూప్ విజయం
మళ్లీ అధ్యక్ష పదవి రమేష్ గోపాల్కే దక్కే అవకాశం
బళ్లారి: బళ్లారి అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు డెరైక్టర్ల ఎన్నికల్లో డాక్టర్ రమేష్ గోపాల్, ముండ్లూరు అనూప్ గ్రూప్ ఘన విజయం సాధించింది. ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి జరిగే అర్బన్ కో-ఆపరేటివ్ సహకార బ్యాంకు ఎన్నికల్లో మాజీ మంత్రి, పలువురు కార్పొరేటర్ల వర్గీయులు గెలుపొందేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఎన్నికల్లో 1328 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం రాత్రి పొద్దుపోయాక ఓట్ల లెక్కింపు కార్యక్రమం ముగించగా ఇందులో రమేష్ గోపాల్ 855 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలాగే ముండ్లూరు అనూప్ కుమార్ ఘన విజయం సాధించారు.
డెరైక్టర్ల స్థానాలకు తొలిసారి ఎన్నికలు జరగగా, మళ్లీ రమేష్గోపాల్ ప్యానల్ ఘన విజయం సాధించడం విశేషం. ప్రస్తుతం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు అధ్యక్షుడిగా ఉన్న రమేష్ గోపాల్కే మళ్లీ అధ్యక్ష పదవి లభించే అవకాశం ఉందని గెలుపొందిన డెరైక్టర్లు పేర్కొంటున్నారు. మంచికి మారు పేరుగా, బ్యాంకు అభివృద్ధికి తీవ్రంగా కృషి చేయడంతో రమేష్ గోపాల్ ప్యానల్ ఘన విజయం సాధించిందని ఓటర్లు పేర్కొంటున్నారు. ముండ్లూరు అనూప్ కుమార్ అందరికంటే ఎక్కువగా 888 ఓట్లు, రమేష్ గోపాల్ 855, మహంతేష్ 851, వెంకటేష్ 803, రాజశేఖర్ 748, వరలక్ష్మి 726, మల్లికార్జునగౌడ 791, కవిత 747, షేక్సాబ్ 700, సత్యనారాయణ 681 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడంతో రమేష్ గోపాల్ ప్యానల్ సంబరాలు చేసుకున్నారు.