Anurag Tiwari
-
ఐఏఎస్ మృతిపై సీబీఐ విచారణ
లక్నో: కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి అనురాగ్ తివారీ మృతిపై సీబీఐ విచారణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. 2007 బ్యాచ్ రాష్ట్ర కేడర్ కు చెందిన అనురాగ్ తివారి మృతదేహం ఈ నెల 17న, లక్నోలోని వీఐపీ గెస్ట్‌హౌస్ సమీపంలో లభ్యమైన విషయం తెలిసిందే. కాగా తన కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తివారీ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తివారీ మృతి కేసును హత్యకేసుగా నమోదు చేయాలని లక్నో ఎస్పీ దీపక్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. హజ్రత్ జంగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. అయితే ఈ కేసులో ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసి విచారణ చేపట్టినప్పటికీ ఇప్పటివరకూ ఎలాంటి పురోగతి లేదు. అయితే తివారీ కుటుంబీకులు పీఎంవోను ఆశ్రయించడంతో ఈ కేసు విచారణను సీబీఐకి బదిలీ చేసినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు. కాగా ఐఏఎస్ అధికారి అనురాగ్ తివారీ కుటుంబసభ్యులు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. తన కుమారుడిది ముమ్మాటికీ హత్యేనని దీనిపై సీబీఐతో విచారణ చేయించాలని వారు కోరారు. సీఎం తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తివారీ కుటుంబీకులు తెలిపారు. కాగా కర్ణాటకలోని పౌరసరఫరాల శాఖ కమిషనర్ గా పనిచేసే సమయంలో దాదాపుగా 2 వేల కోట్ల రూపాయాల కుంభకోణానికి సంబంధించిన ఆధారాలు సేకరించారని, వాటిని ప్రధాని నరేంద్రమోడీతో పాటు సీబీఐకి పంపించాలని తన సోదరుడు భావించారని, అయితే దీనిపై సీనియర్ అధికారులతో పాటు మంత్రులు ఒత్తిళ్లు తీసుకు వచ్చినట్లు అనురాగ్ తివారీ సోదరుడు మయూంక్ తివారీ ఆరోపణలు చేశారు. తన సోదరుడి మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. కాగా తన కుమారుడు నిజాయితీపరుడని, అయితే అవినీతి అధికారులకు ఇది గిట్టేది కాదని అన్నారు. మరోవైపు అనురాగ్ తివారీ బుధవారం తెల్లవారుజామున రెండుగంటల వరకూ చాటింగ్ చేసినట్లు సమాచారం. అయితే ఆయన నాలుగు నుంచి ఆరు గంటల మధ్యలో మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
ఐఎఎస్ అధికారి అనుమానాస్పద మృతి
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో అనుమానాస్పద స్థితిలో ఐఏఎస్ అధికారి మృతిచెందారు. మార్నింగ్ వాక్కు వెళ్లిన కర్నాటక కేడర్‌కు చెందిన ఐఎఎస్ అధికారి అనురాగ్ తివారి (35) బుధవారం అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం కలకలం రేపింది. 2007 బ్యాచ్‌కు చెందిన అనురాగ్ తివారీ కర్ణాటక ఫుడ్, పౌర సరఫరా మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ కుచెందిన తివారి లక్నో యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీర్. అయితే గత రెండు రోజులుగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని మీరాబాయి మార్గంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఉన్నారు.మార్నింగ్ వాక్కు వెళ్లిన తివారీ కుప్పకూలిపోయినట్టు పోలీసులు అందించిన సమాచారం. గడ్డం మీద ఒక చిన్న కట్ తప్ప పెద్ద గాయాలు లేవని పోలీసు అధికారి ఏకే షాహి తెలిపారు. కానీ, రోడ్డు మీద కొంత రక్తం కనిపించిందన్నారు. దర్యాప్తుకొనసాగుతోందని చెప్పారు. పోస్ట్ మార్టం రిపోర్టు తరువాత మాత్రమే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని చెప్పారు. కాగా అయిన తివారి ఇటీవల విడాకులు తీసుకున్నారు. బిదార్ డిప్యూటీ కమిషనర్‌గా, మధుగిరి సహాయక కమిషనర్‌గా, కొడగు డిప్యూటీ కమీషనర్ గా, బెంగళూరు డిప్యూటీ సెక్రెటరీ (ఫైనాన్స్) పనిచేశారు. -
ఐఏఎస్ అధికారి అనుమానాస్పద మృతి
లక్నో: కర్ణాటక కేడర్‌కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హజ్రత్‌జంగ్ మీరాబాయి గెస్ట్‌హౌస్ సమీపంలోని రోడ్డు పక్కన ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఒంటిపై ఉన్న గుర్తులతో పాటు ఘటనా స్థలంలో లభించిన ఐడీ కార్డు ఆధారంగా ఐఏఎస్ అధికారి అనురాగ్ తివారీగా పోలీసులు గుర్తించారు. గత రెండు రోజులుగా ఆయన మీరాబాయి అతిథిగృహంలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అనురాగ్ తివారీ అనుకోని విధంగా శవమై తేలారు. ఈ సమాచారం అందుకున్న సీనియర్ అధికారులు హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా అనురాగ్ తివారీ అనుమానాస్పద రీతిలో మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆయన గడ్డం కింద చిన్న గాయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అనురాగ్ తివారీ స్వస్థలం బహ్రెయిచ్ కాగా, 2007లో సివిల్ సర్వీస్‌లో చేరారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.