లక్నో: కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి అనురాగ్ తివారీ మృతిపై సీబీఐ విచారణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. 2007 బ్యాచ్ రాష్ట్ర కేడర్ కు చెందిన అనురాగ్ తివారి మృతదేహం ఈ నెల 17న, లక్నోలోని వీఐపీ గెస్ట్‌హౌస్ సమీపంలో లభ్యమైన విషయం తెలిసిందే. కాగా తన కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తివారీ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో తివారీ మృతి కేసును హత్యకేసుగా నమోదు చేయాలని లక్నో ఎస్పీ దీపక్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. హజ్‌రత్ జంగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. అయితే ఈ కేసులో ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసి విచారణ చేపట్టినప్పటికీ ఇప్పటివరకూ ఎలాంటి పురోగతి లేదు. అయితే తివారీ కుటుంబీకులు పీఎంవోను ఆశ్రయించడంతో ఈ కేసు విచారణను సీబీఐకి బదిలీ చేసినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు.
కాగా ఐఏఎస్ అధికారి అనురాగ్ తివారీ కుటుంబసభ్యులు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. తన కుమారుడిది ముమ్మాటికీ హత్యేనని దీనిపై సీబీఐతో విచారణ చేయించాలని వారు కోరారు. సీఎం తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తివారీ కుటుంబీకులు తెలిపారు. కాగా కర్ణాటకలోని పౌరసరఫరాల శాఖ కమిషనర్ గా పనిచేసే సమయంలో దాదాపుగా 2 వేల కోట్ల రూపాయాల కుంభకోణానికి సంబంధించిన ఆధారాలు సేకరించారని, వాటిని ప్రధాని నరేంద్రమోడీతో పాటు సీబీఐకి పంపించాలని తన సోదరుడు భావించారని, అయితే దీనిపై సీనియర్ అధికారులతో పాటు మంత్రులు ఒత్తిళ్లు తీసుకు వచ్చినట్లు అనురాగ్ తివారీ సోదరుడు మయూంక్ తివారీ ఆరోపణలు చేశారు.
తన సోదరుడి మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. కాగా తన కుమారుడు నిజాయితీపరుడని, అయితే అవినీతి అధికారులకు ఇది గిట్టేది కాదని అన్నారు. మరోవైపు అనురాగ్ తివారీ బుధవారం తెల్లవారుజామున రెండుగంటల వరకూ చాటింగ్ చేసినట్లు సమాచారం. అయితే ఆయన నాలుగు నుంచి ఆరు గంటల మధ్యలో మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.