ఖరారు కానున్న ‘కృష్ణా’ ముసాయిదా!
* నేడు ఢిల్లీలో కేంద్ర జలవనరులశాఖ వద్ద కీలక భేటీ
* తెలంగాణ, ఏపీ నుంచి హాజరుకానున్న ఉన్నతాధికారులు
* పోలవరం, పట్టిసీమల్లో వాటా కోరనున్న రాష్ట్రం
* కొత్త ప్రాజెక్టులు, వాటి నియంత్రణకు ఏపీ పట్టుబట్టే అవకాశం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగానికి సంబంధించి ప్రస్తుత వాటర్ ఇయర్లో విధివిధానాలతో కూడిన ముసాయిదా సిద్ధం కానుంది.
కేంద్ర జలవనరులశాఖ నేతృత్వంలో మంగళవారం ఢిల్లీలోని అనుసంధాన్ భవన్లో జరగనున్న సమావేశంలో నీటి వినియోగ పద్ధతులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంగీకారానికి రానున్నాయి. తెలంగాణ ఇప్పటికే గతేడాది ముసాయిదాను కొనసాగించాలని కోరుతుండగా బేసిన్ ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తేవడంతోపాటు కొత్త ప్రాజెక్టులపై తేల్చాలని ఏపీ గట్టిగా వాదించే అవకాశముంది. కృష్ణా జలా ల వినియోగంలో నెలకొన్న వివాదాలకు తాత్కాలిక పరిష్కారం చూపే దిశగా కేంద్ర ప్రభుత్వం గతేడాది జూన్ 18, 19 తేదీల్లో ఇరు రాష్ట్రాలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది.
ఈ భేటీలో ఇరు రాష్ట్రాల అంగీకా రం మేరకు మార్గదర్శకాల ముసాయిదా (మాన్యువల్)ను తయారు చేసి దాన్ని 2015-16 ఏడాదిలో అమలు చేసింది. అయితే ఆ ముసాయిదా గడువు జూన్ 1తో ముగియడంతో మళ్లీ ముసాయిదాను సిద్ధం చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఇరు రాష్ట్రాల మధ్య కీలక సమావేశం జరగనుంది. ఇప్పటికే పలు దఫాలుగా ప్రభుత్వ పెద్దలతో చర్చించిన రాష్ట్ర అధికారులు గతేడాది ముసాయిదానే కొద్దిపాటి మార్పులతో కొనసాగించాలని నిర్ణయిం చారు.
ముసాయిదా అంశాలకు అదనంగా నికర జలాల్లో మరింత వాటా కోరాలని రాష్ట్రం భావిస్తోంది. కృష్ణాలో ఉన్న 299 టీఎంసీల నికర జలాల వాటాకు అదనంగా మరో 103 టీఎంసీల వాటా కోరాలని నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు రాగానే ఎగువ రాష్ట్రాలకు అంతే పరిమాణంలో నీటి హక్కులు సంక్రమిస్తాయని, ఈ లెక్కన 80 టీఎంసీల కేటాయింపుల్లో 22 టీఎంసీలు కర్ణాటకకు, 13 టీఎంసీలు మహా రాష్ట్రకు, 45 టీఎంసీలు తెలంగాణకు హక్కుగా వస్తాయని రాష్ట్రం పేర్కొంటోంది.
దీన్ని ముసాయిదాలో చేర్చి 45 టీఎంసీల నీటిని అదనంగా కేటాయించాలని కోరాలని భావి స్తోంది. ఇదే బచావత్ అవార్డులో పోలవరం కాకుండా ఇంకా ఏదైనా ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణం ఎగువ రాష్ట్రాలకు వాటా ఉంటుందని, 45 టీఎంసీలతో పట్టిసీమ చేపడితే అదే స్థాయిలో నీరు తెలంగాణకు దక్కాలని కోరనుంది. మొత్తం 90 టీఎంసీల అంశాన్ని ప్రస్తావించి దీనిపై స్పష్టత కోరే అవకాశం ఉంది.
బోర్డు నియంత్రణ కోసం ఏపీ పట్టు..
ప్రాజెక్టుల నియంత్రణ అంశాన్ని ఏపీ ప్రధానంగా ప్రస్తావించే అవకాశముంది. ముఖ్యంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో ఉన్నందున నీటి విడుదలకు ప్రతిసారీ వారి వద్దకు వెళ్లాల్సి వస్తోందని, కొన్ని సందర్భాల్లో వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమైతే తమకు ఇబ్బందులు కలుగుతున్నాయని వాదించే అవకాశముంది. ఈ దృష్ట్యా బేసిన్ ప్రాజెక్టులన్నింటినీ బోర్డు నియంత్రణలోకి తేవాలని కోరనుంది. దీంతోపాటే తెలంగాణ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలు పూర్తిగా కొత్త ప్రాజెక్టులేనని, వాటిని నిలుపదల చేయాలని పట్టుబట్టే అవకాశాలున్నాయి.