తప్పుడు కేసుపై డీజీపీకి పేర్ని నాని ఫిర్యాదు
గుంటూరు, సాక్షి: తనపై తప్పుడు కేసు నమోదు అయిన విషయాన్ని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) డీజీపీకి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు శుక్రవారం ఫిర్యాదు చేస్తూ డీజీపీ(AP DGP) హరీష్ కుమార్ గుప్తాకు ఓ లేఖ రాశారు. గిట్టుబాటు ధర లేక ఆందోళనలో ఉన్న గుంటూరు మిర్చి రైతులను బుధవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆయన జగన్, మరికొందరు వైఎస్సార్సీపీ(YSRCP) నేతలు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ నల్లపాడు పీఎస్లో టీడీపీ నేతలు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో జగన్ సహా వైఎస్సార్సీపీ నేతలపై కేసు నమోదు అయ్యింది.అయితే ఆ పర్యటనలో పాల్గొనని పేర్ని నాని(Perni Nani)పై కూడా కేసు నమోదు కావడంతో ఆయన స్పందించారు. ఈ పర్యటనలో పాల్గొనకున్నా తన ప్రతిష్టను దెబ్బ తీసేందుకు తనపై ఫిర్యాదు చేశారని డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారాయన. ప్రజాక్షేత్రంలో ఉన్న తనపై ఇలాంటి తప్పుడు కేసు బనాయించడం.. అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని అన్నారాయన. ఈ అంశంపై విచారణ జరిపి తప్పుడు ఫిర్యాదు చేసిన వాళ్లపై, అలాగే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారాయన. ఇదీ చదవండి: సభ పెట్టలేదు.. మైక్ ముట్టలేదు.. ఇదేమీ దుర్మార్గం