ఏపీ హైకోర్టుకు 30 మంది..
తెలంగాణకు 19 మంది న్యాయమూర్తుల కేటాయింపు
టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కు కేంద్ర న్యాయశాఖ మంత్రి లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా హైకోర్టు ఏర్పాటు చేయాల్సి ఉందని కేంద్ర న్యాయశాఖ పేర్కొంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు తెలంగాణకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ 377వ నిబంధన కింద ప్రస్తావించిన ఈ అంశంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి డి.వి.సదానందగౌడ ఆయనకు లేఖ రాశారు. ‘ఏపీలో కొత్త హైకోర్టు ఏర్పాటయ్యేవరకు ప్రస్తుత హైకోర్టు 2 రాష్ట్రాలకు సేవలు అందిస్తుంది. కొత్త హైకోర్టు ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం, ప్రస్తుత ఉమ్మడి హైకోర్టు సంప్రదింపులు జరిపి ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి. అందులో భాగంగా కొత్త హైకోర్టు ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాన్ని గుర్తించాలి. కోర్టు భవనాలు, న్యాయమూర్తులు, సిబ్బంది నివాసాలు, ఇతర మౌలిక వసతుల ఏర్పాటుపై కసరత్తు చేయాలి.
ఇదంతా ఏపీ ప్రభుత్వం ఉమ్మడి హైకోర్టుతో సంప్రదింపుల ద్వారా ఖరారు చేయాలి. ఈ ప్రక్రియ ప్రారంభం విషయంలో ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఏపీ అభిప్రాయాలు తెలపాలని కోరాం. వారి నుంచి ఇంకా అభిప్రాయాలు అందలేదు. ఇరు రాష్ట్రాలు ఉమ్మడి హైకోర్టుతో సంప్రదింపు లు జరిపి ఓ నిర్ణయానికి వచ్చిన తరువాతే కేంద్రం చర్యలు తీసుకుంటుంది. భారత ప్రధాన న్యాయమూర్తి సమ్మతితో ఏపీ, తెలంగాణ హైకోర్టులకు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ధారిం చాం. ఏపీకి 30 మంది, తెలంగాణకు 19 మంది న్యాయమూర్తులను కేటాయించాలని నిర్ణయిం చాం. ఈ విషయాన్ని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు, ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తెలిపాం’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.