వేసవిలోనూ నిరంతర విద్యుత్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జిల్లాలో వేసవిలో కూడా 24 గంటలూ విద్యుత్ సరఫరా అందించి ప్రజల అభిమానాన్ని చూరగొంటామని ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ సీహెచ్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ జలసిరి పథకం అమలులో జిల్లాను ప్రథమస్థానంలో నిలిపి రాష్ట్రస్థాయి అవార్డు పొందిన ఆయన్ని విద్యుత్ ఓసీ ఉద్యోగుల అసోసియోషన్ కంపెనీ ప్రధాన కార్యదర్శి తురగా రామకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఈ కార్యాలయంలో మంగళవారం దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ మూడేళ్ల క్రితం ఉత్పత్తికి వినియోగానికి తీవ్ర అంతరం ఉండేదని గుర్తు చేశారు. ఎన్టీఆర్ జలసిరి పథకం కింద జిల్లాలో 1,169 మంది రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను వేగవంతంగా అందించి రాష్ట్రంలో ఉత్తమ జిల్లాగా పశ్చిమను తీర్చిదిద్దడంలో విద్యుత్ ఉద్యోగుల కృషి ఎంతో ఉందన్నారు. లో ఓల్టేజీ సమస్య తలెత్తకుండా 23/11 కేవీ సబ్స్టేషన్లను అభివృద్ధి చేస్తామని, సమీకృత విద్యుత్ అభివృద్ధి పథకం కింద 6 ఇండోర్ సబ్స్టేషన్లు గత రెండున్నరేళ్లలో ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యుత్ ఓసీ ఉద్యోగుల అసోసియోషన్ జిల్లా అధ్యక్షుడు బి.వీరభద్రరావు, నాయకులు జి.గంగాధర్, ఎన్.అప్పారావు, సీహెచ్ వెంకట్రాజు, నారాయణ, కుమార్ పాల్గొన్నారు. విద్యుత్ బహుజన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రీజనల్ కార్యదర్శి పి.సాల్మన్‌రాజు, ఎస్.సురేష్, పి.సుగుణ రావు, వీఆర్ ఆంజనేయులు ఎస్ఈకి పుష్పగుచ్చం అందించారు.