వ్యభిచార కూపంలోనుంచి..
న్యూఢిల్లీ: భారత, నేపాల్ సరిహద్దు కొండప్రాంతాలు చూడటానికి ఎంతో ఆహ్లాదంగా ఉన్నా వాటిని ఆనుకొని ఉన్న గ్రామాల్లో మాత్రం ఎప్పుడూ విషాధ ఛాయలే అలుముకుని ఉండేవి. బతుకుతెరువు మాత్రం వారికి తెలిసేకాదు. ఒళ్లొచ్చి పనిచేసేందుకు వారు సిద్ధంగా ఉన్నా పని దొరికే అవకాశాలే లేకుండేవి. గుక్కెడు గంజీనేళ్లు కూడా కరువే. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో, ఎలా బతకాలో తెలియని స్థితిలో కొన్ని ముఠాలు వారిని ప్రలోభ పెట్టాయి. ఆ కుటుంబాల్లోని ముక్కుపచ్చలు ఆరని పిళ్లల్ని కొనుక్కొపోయి వృభిచార గృహాల్లో విక్రయించేవి. కొందరు ఆడపిల్లలను నయాపైసా ఇవ్వకుండానే ఎత్తుకుపోయేవి. తమ పిల్లలను తీసుకెళ్లిన వారు, వారిని ఏం చేస్తారో కూడా అక్కడి కుటుంబాలకు తెలుసు. కనీసం పిల్లల పొట్టగడుస్తుందనుకొని అలా వదిలేసేవారు.
అలా వ్యభిచార గృహాలకు చేరిన ఆడపిల్లలు. అంగడి బొమ్మలయ్యేవారు. మృగాళ్ల చేతుల్లో బలయ్యేవారు. అలా ఐదారేళ్లు గడిచేసరికి వారి ఒళ్లంత గుల్లయ్యేది. ఇక లాభసాటి వ్యాపారానికి వారు ఎంతమాత్రం పనికి రారని గ్రహించిన మరుక్షణం వారిని రోడ్డున పడేసేవారు. బయట ప్రపంచంలో ఎలా బతకాలో తెలియని అయోమయ జీవితంలోకి వారిని నెట్టివేసేవారు. అక్రమంగా కలిగిన సంతానాన్ని వారు మళ్లీ వ్యభిచార గృహాలకే అమ్మేసేవారు. కొన్నేళ్లుగా ఈ సైకిల్ ఇలా కొనసాగుతూ వచ్చింది. రుచిరా గుప్తా అనే ఓ జర్నలిస్ట్ ఓసారి నేపాల్ కొండ ప్రాంతాల గుండా వెళుతున్నప్పుడు ఛిద్రమైన ఇలాంటి జీవిత కథనాలు ఆమెకు తెలిశాయి. 22 మంది సెక్స్ బానిసలను ఆమె కలసుకున్నారు. వారి కన్నీటి గాథలకు కరిగిపోయిన గుప్తా ఆ 22 మందిని ఇంటర్వ్యూ చేసి ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. దానికోసం అనేక వ్యభిచార గృహాలను సందర్శించారు. వాటి యజమానులను, తార్పుడు గాళ్లను కూడా కలసుకుని అక్కడి పరిస్థితులను అవగాహన చేసుకున్నారు.
13 ఏళ్ల బాలికపై రోజుకు పదిమంది విటులుచేసే అఘాయిత్యాల గురించి విని కన్నీళ్లు కార్చారు. వారి జీవితాలపై తీసిన డాక్యుమెంటరీకి రుచిరా గుప్తాకు అవార్డు కూడా లభించింది. దాంతో ఆమె సంతృప్తి పడలేదు. ఎలాగైనా వ్యభిచార కూపంలో కూరుకుపోతున్న అక్కడి అమ్మాయిలను, కుటుంబాలను రక్షించాలనుకున్నారు. దానికోసం తాను చేస్తున్న జర్నలిస్ట్ ఉద్యోగాన్ని వదిలేశారు. సామాజిక కార్యకర్త అవతారమెత్తారు. బాధితులతోని ‘అప్నే ఆప్’ అనే స్వయం పోషక బృందాన్ని ఏర్పాటు చేశారు. నేతలో వచ్చే లొసుగుల కారణంగా తిరస్కరించే చీరలతోని గాజులు, కంకణాలు, చెవి రింగులు, నెక్లెస్‌లను అందంగా తయారు చేయడం ఎలాగో బాధిత మహిళలకు అమె శిక్షణ ఇప్పించారు. ఆ శిక్షణే వారి జీవితాల్లో వెలుగుబాటలు వేసింది. అలా చీరలు ఉపయోగించి అందంగా తయారుచేసిన ఆభరణాలను మార్కెటింగ్‌కు గల అవకాశాలను వెతికారు. ఇలాంటి అలంకార ఆభరణాలను పాశ్చాత్య దేశాల్లో విక్రయించే రెసెనా సమ్మీ గురించి ఆమెకు తెల్సింది. న్యూజిలాండ్‌లో పుట్టి,పెరిగి న్యూయార్క్‌లో నివసిస్తున్న సమ్మీ ఓనగల దుకాణాన్ని, ఓ బొటిక్‌ను నిర్వహిస్తున్నారు. గుప్తా ఆమె సహాయం తీసుకున్నారు. సెక్స్ బాధితులు తయారు చేస్తున్న గాజులు, నగలతోపాటు చేతి సంచులను ఆమెకు విక్రయిస్తూ వస్తున్నారు. ఇప్పుడు సమ్మీయే 30 మంది సెక్స్ బానిసలను తన ఉద్యోగులుగా చేర్చుకుంది.
ఈ ఇద్దరు మహిళల స్ఫూర్తితో ఆ గ్రామాల ప్రజల జీవనచిత్రమే మారిపోయింది. వారంతా వీరి చూపిన మార్గంలో అంకిత భావంతో పనిచేస్తూ ఆనందంగా బతుకుతున్నారు. పిల్లలను బడికి పంపిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. దుర్భర పరిస్థితుల్లో పుట్టిన ‘అప్నే ఆప్’ సంస్థ గత 20 ఏళ్లు దేదీప్యమానంగా పనిచేస్తోంది.