కిడ్నీలు అమ్మక్కర్లేదు... డోనర్ కండి
ఆపిల్ ఐఫోన్ 6ఎస్ కోసం ఇద్దరు చైనీయులు తమ కిడ్నీలకు అమ్ముకునేందుకు సిద్ధపడిన విషయం తెలిసిందే. పత్రికల్లో ఈ వార్త ప్రచురితమవడంతో చైనాలోని హుబియ్ ప్రావిన్స్‌లోని స్పెర్మ్ బ్యాంకు (ఆరోగ్యవంతుల నుంచి వీర్యకణాలను సేకరించి... గర్భం దాల్చాలకునే మహిళలకు అందించే సంస్థ. రకరకాల కారణాలతో పిల్లలు పుట్టని దంపతులు చివరకు సంతానం కోసం స్పెర్మ్ బ్యాంకును ఆశ్రయిస్తారు. దాత వీర్యంతో గృహిణి అండాన్ని కృత్రిమంగా ఫలదీకరించి గర్భంలో ప్రవేశపెడతారు. దాతల వివరాలు గోప్యంగా ఉంచుతారు) వినూత్న ఆలోచన చేసింది. ‘ఐఫోన్ 6ఎస్‌ను పొందడానికి కొత్తమార్గాలు’ అనే శీర్షికతో ఆన్లైన్ యాడ్ ఇచ్చింది.
చైనాలో అత్యంత ప్రజాదరణ కలిగిన సోషల్నెట్వర్క్ ‘వీచాట్’లో ఈ యాడ్ ఇప్పుడు హల్చల్ చేస్తోంది. ఐఫోన్ కోసం కిడ్నీలు అమ్మక్కర్లేదు... వీర్యాన్ని ఇవ్వండి చాలు అని కోరింది. ఒకసారి వీర్యాన్ని ఇస్తే ఆరు వేల యువాన్లు (62,000 రూపాయలు) అందుతాయి... 5,288 యువాన్లకే మీకు ఐఫోన్ 6ఎస్ వస్తుంది. కాబట్టి త్వరపడండి... ఒక కుటుంబానికి సంతోషాలు పంచండి’ అని కోరింది. చైనాలో అవగాహన లేనందువల్ల వీర్యదాతలకు తీవ్ర కొరత ఉందట. అందుకని... స్పెర్మ్ బ్యాంకులు ఆన్లైన్లో దాతల కోసం ప్రకటనలు ఇస్తుంటాయి. ఈ ఆఫరేదో బాగుంది అనుకునేరు. దాతగా ఎంపిక కావాలంటే చాలా చూస్తారు. తెలివితేటలు ఉండాలి, ఒడ్డూపొడుగు ఉండాలి, మంచి కుటుంబనేపథ్యం ఉండాలి... ఇలా చాలా చూస్తారు. ఎందుకంటే ఇలాంటి వారి నుంచి వీర్యం స్వీకరిస్తే తమ పిల్లలు కూడా వారిలాగే ఉంటారని గ్రహీతలు ఆశపడతారు కాబట్టి.