ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
డాక్టర్ల బృందానికి ఎంపీ, కలెక్టర్ ప్రశంస
తిరువళ్లూరు: లివర్‌కు సమీపంలో చేరి న వ్యర్థపు నీటి సంచిని తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాల డాక్టర్లు సమర్థవంతంగా శస్త్రచికిత్స చేసి తొలగించి తమ సత్తాను చాటారు. తిరువళ్లూరు జిల్లా తిరుప్పాచ్చూర్ గ్రామానికి చెందిన కరుణాకరన్ భార్య వళ్లి(47).ఈమె తరచూ కడుపునొప్పి రావడంతో తిరువళ్లూరు జిల్లా వైద్యకేంద్రంలో వైద్య పరీక్షలు చేయించుకుంది. అయినా నొప్పి తగ్గకపోగా మరింత పెరగడంతో అనుమానం కలిగిన డాక్టర్లు ఆమెకు స్కానింగ్ తీశారు. స్కానింగ్‌లో లివర్‌కు సమీపంలోనే వ్యర్థపు నీరు తిత్తి ఉన్నట్టు గుర్తించి ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు.
అనంతరం తిరువళ్లూరు వైద్యశాలలోనే ఆపరేషన్ చేయాలని నిర్ణయించిన సూపరింటెండెంట్ నాగేంద్రప్రసాధ్ తన సహచర వైద్యులు ఆశోకన్, మురళి, నందకుమార్. శివకుమార్‌లతో కలిసి శస్త్రచికిత్స నిర్వహించారు. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఆపరేషన్‌లో లివర్‌కు సమీపంలో చేరిన వ్యర్థపు నీటిని, తిత్తిని తొలగించి విజయవంతంగా పూర్తి చేశారు. తిరువళ్లూరు వైద్యులు చేసిన ఆపరేషన్ సక్సెస్ కావడంతో తిరువళ్లూరు ఎంపీ వేణుగోపాల్, కలెక్టర్ ముత్తు, ఆర్డీవో దివ్యశ్రీ బాధిత మహిళను పరామర్శించారు. అనంతరం ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించిన వైద్యుల బృందాన్ని అభినందించారు.