Appropriation Bil
-
చట్టవ్యతిరేక పనులను సహించం
సాక్షి, అమరావతి: చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఎంతమాత్రం సహించవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మొట్టమొదటి కలెక్టర్లు, ఎస్పీల సదస్సుల స్పష్టం చేశారని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. అధికార పార్టీకి చెందిన వారు కూడా ఏదైనా అవకతవకలు చేసిన దాఖలాలు ఉంటే.. చర్యలు తీసుకోవాల్సిందేనని వైఎస్ జగన్ తేల్చి చెప్పారని తెలిపారు. ద్రవ్యవినిమయ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష టీడీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు బుగ్గన సమాధానమిచ్చారు. చర్చ అనంతరం ద్రవ్యవినిమయ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. జన్మభూమి కమిటీలతో అనేక గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, పెన్షన్లు మొదలు.. ప్రభుత్వ పథకాలు పొందేందుకు జన్మభూమి కమిటీలకు లంచాలు, ముడుపులు ఇవ్వాల్సి రావడంతో ప్రజలు తీవ్ర అసహనానికి లోనయ్యారని, ఈ కోపం వల్ల చిన్నాచితక ఘటనలు జరిగి ఉండవచ్చునని అన్నారు. గతంలో చంద్రబాబు తాను సీఎం అయ్యాక మొదటి కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో తమ పార్టీ కార్యకర్తలే ముఖ్యమని, మీరు ముఖ్యం కాదని అన్నారని, కానీ, సీఎం జగన్ మాత్రం శాంతిభద్రతల విషయంలో పోలీసులు, అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని తెలిపారు. వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని రెండేళ్ల కిందట వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారని, ఆ తర్వాత ఎన్నికలకు రెండు నెలల ముందు కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ. 6వేల చొప్పన ఇస్తామని ప్రకటించిందని, ఈ నిధులను కేంద్రం సహాయం కింద రాష్ట్రం తీసుకుంటుందని, రాష్ట్రంలోని పన్నుల మొత్తాన్నే కేంద్రం పథకాల రూపంలో తిరిగి రాష్ట్రానికి ఇస్తుందని బుగ్గన వివరించారు. పోలవరం ప్రాజెక్టు టీడీపీ ప్రభుత్వం కారణంగానే ఆలస్యమైందని, మొదటి రెండున్నరేళ్లు పోలవరం విషయంలో చంద్రబాబు సర్కారు జాప్యం చేసిందని, పోలవరాన్ని సత్వరమే పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని వివరించారు. ద్రవ్య వినిమయ బిల్లు కంటే కూడా కేసీఆర్ గురించి ప్రతిపక్ష సభ్యుడు వాసుపల్లి గణేశ్ ఎక్కువ మాట్లాడారని, కేసీఆర్ అంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు. కేసీఆర్, నవీన్ పట్నాయక్ తదితరులు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రమేనని, వారితో అవసరమైన మేరకు సంప్రదింపులు కొనసాగుతాయని తెలిపారు. అమ్మఒడి పథకాన్ని విద్యార్థులకు కాకుండా.. వారిని బడికి పంపించే తల్లులకు అందిస్తామని, ఇది పిల్లలను బడికి పంపి.. వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని తపించే తల్లుల కోసమేనని వివరించారు. పిల్లలను చదివించుకోవడానికి ఆరాపడే తల్లులను ప్రోత్సాహించేందుకు ఇలాంటి ఒక పథకం తీసుకురావడం దేశంలోనే ప్రప్రథమం అన్నారు. నిరుద్యోగ భృతి కోసం ఖర్చుచేసిందెంత? తమ ప్రతిష్టాత్మక పథకంగా ఎన్నికల్లో ప్రచారం చేసుకొని.. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. గడిచిన నాలుగేళ్లు నిరుద్యోగ భృతిని చెల్లించకుండా మోసం చేశారని, ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు నిరుద్యోగ భృతిని అమలుచేశారని, ఇందుకోసం కేవలం రూ. 273 కోట్లు మాత్రమే ఆయన ఖర్చు చేశారని, మళ్లీ ఇప్పుడు నిరుద్యోగ భృతి ఏమైందని ప్రతిపక్షం అడుగుతుందని, చంద్రబాబు మీద కోపంతోనే, ఆయన చేసిన నిర్వాకాన్ని బయటపెట్టేలా టీడీపీ సభ్యులు ఈ ప్రశ్నలు అడుగుతున్నారా? అనే సందేహం కలుగుతోందని బుగ్గన ఎద్దేవా చేశారు. వెయ్యి నుంచి రూ. 2250కి పెంచాం మద్యపాననిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని, ఇందులో భాగంగానే ప్రభుత్వ దుకాణాల ద్వారా అమ్మడం, మద్యం ధరలను పెంచడం, అక్రమ మద్యం అమ్మకాలను నిరోధించడం వంటి చర్యలను చేపడుతున్నామన్నారు. ఇక, పెన్షన్ల విషయమై స్పందిస్తూ.. తాము అధికారంలోకి వచ్చాక అవ్వా-తాతలకు ఇస్తున్న పెన్షన్‌ను రూ. 2వేలకు పెంచుతామని వైఎస్ జగన్ ఇచ్చాపురం సభలో ప్రకటించడంతో గత్యంతరంలేక హడావిడిగా చంద్రబాబు ప్రభుత్వం రూ. వెయ్యి నుంచి రెండువేలకు పెంచిందని, అది కూడా ఎన్నికలకు ముందే పెంచుతున్నట్టు ప్రకటించిందని తెలిపారు. వైఎస్ జగన్ ప్రకటన వల్లే పింఛన్ రెండువేలకు పెరిగిందని, తాము అధికారంలోకి వచ్చాక దానిని రూ. 2250కి పెంచామని, దశల వారీగా దానిని రూ. మూడువేలకు పెంచుతామని వివరించారు. పైగా పెన్షన్‌ను పెంచి.. అది జేబుల్లోంచి తీసి ఇచ్చినట్టు.. టీడీపీకే ఓటు వేయాలంటూ అవ్వా-తాతల ఆత్మాభిమానం దెబ్బతినేలా ఆ పార్టీ నేతలు ప్రమాణం చేయించారని తెలిపారు. రైతులకు రూ. 87వేల కోట్లు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి.. మోసం చేసి, లెక్కలు ఏమార్చి రూ. 24వేల కోట్లకు చంద్రబాబు సర్కారు కుదించిందని, అందులోనూ కేవలం రూ. 15,275 కోట్లు మాత్రమే రుణమాఫీకి ఖర్చు చేశారని, అంతేకాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోనూ రుణమాఫీకి రూపాయి కూడా కేటాయించలేదని, ఇప్పుడు రుణమాఫీ ఏమైందని ప్రతిపక్ష సభ్యులు అడుగుతున్నారని తప్పుబట్టారు. -
ఈ బడ్జెట్‌తో మళ్లీ రాజన్న రాజ్యం: రోజా
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తన మొదటి బడ్జెట్లోని ప్రతి రూపాయిని ప్రజలకు అందించేలా చర్యలు తీసుకుందని, ప్రజా సంక్షేమమే ప్రాధాన్యంగా రూపొందిన ఈ బడ్జెట్‌కు సంబంధించిన ద్రవ్యవినిమయ బిల్లును మనసాక్షి కలిగిన ఎవరూ వ్యతిరేకించబోరని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ శ్రీమతి ఆర్కే రోజా స్పష్టం చేశారు. ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను గుర్తించి.. ప్రజా పథకాలను ప్రవేశపెట్టిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని అభినందించారు. మళ్లీ రాజన్న రాజ్యం.. పదేళ్ల కిందట దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అకాల మృతి గురించి ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే రోజా ఉద్వేగంగా మాట్లాడారు. దేశం గర్వించే పథకాలను ప్రవేశపెట్టి.. తెలుగువాడి పాలనా దక్షతను చాటిన వైఎస్సార్ కోట్లాది ప్రజల మధ్య నుంచి ఆకస్మికంగా కనుమరుగైపోయారని, తాను ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి పేదవాడికీ అందుతున్నాయో? లేదా తెలుసుకోవడానికి వెళ్లి.. అంతర్ధానమయ్యారని, ఆయన మృతితో తమ భవిష్యత్తు కూలిపోయిందని తెలుగు ప్రజలు కుమిలిపోయారని అన్నారు. అన్నం పెట్టిన రాజన్న, చదువు చెప్పిన రాజన్న, ఆరోగ్యాన్ని ఇచ్చిన రాజన్న ఇకలేరని తెలిసి తెలుగు ప్రజలు గుండెలవిసేలా ఏడ్చారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఇన్నాళ్లకు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూసి మళ్లీ రాజన్న రాజ్యం వచ్చిందని, ప్రజల రాజ్యం వచ్చిందని ప్రతి ఒక్కరూ గుండెమీద చేయి వేసుకొని ధైర్యంగా చెప్తున్నారని కొనియాడారు. చరిత్రలోనే మొదటిసారి రైతులు, విద్యార్థులు, అవ్వతాతలు, ప్రైవేటు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆటో డ్రైవర్లు, బట్టలు కుట్టే ట్రైలర్లు, మత్స్యకారులు, నాయి బ్రాహ్మణాలు ఇలా అన్ని వర్గాలు ప్రజలు.. ఐదుకోట్లమంది ఇది మా బడ్జెట్ అని సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ఇందుకుగాను సీఎం వైఎస్ జగన్‌కు, ఆయన సూచనల మేరకు బడ్జెట్ రూపొందించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. ఇప్పటివరకు హైకమాండ్ ఆడించే సీఎం, సీల్డ్‌కవర్ సీఎం, ప్రజలను ఛీటింగ్ చేసే సీఎంను చూశాం కానీ, మొట్టమొదటిసారిగా మాట మీద నిలబడే సీఎం ఇప్పుడే చూస్తున్నామని, పాదయాత్రలో ఇచ్చిన ప్రతి మాటను సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ లేరనే బాధతో చనిపోయిన కుటుంబాలకు ఇచ్చిన మాట కోసం.. వైఎస్సార్ ఆశయ సాధన కోసం తెలుగు ప్రజల పక్షాల నిలబడి.. రాజకీయ రాబంధులను, ఢిల్లీ పెద్దలను, ఇక్కడే ఉన్న కొన్ని గద్దలను ఎదురించి.. కడవరకు నిలబడి పదేళ్లు పోరాడిన ఏకైక వీరుడు వైఎస్ జగన్ అని అన్నారు. ఏ ప్రజల కోసమైతే పోరాడారో.. ఆ పోరాట ఫలితాలను ఈ బడ్జెట్ ద్వారా ప్రజలకు అందేలా చేశారని ప్రశంసించారు. ఇంతలా మాట కోసం నిలబడ్డారు కాబట్టే ఎవరికీ సాధ్యం కానిరీతిలో వైఎస్ జగన్‌కు 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు, 50శాతం ఓట్లు, 86శాతం సీట్లు.. కట్టబెట్టారని, ప్రజలు ఒక నాయకుణ్ని నమ్మితే ఇంతలా నమ్ముతారా? అనేరీతిలో వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారని అన్నారు. విశ్వసనీయతకు అర్థం తెలిపిన ఏకైక నాయకుడు ప్రధానుల కొడుకుల్ని చూశాం, ముఖ్యమంత్రుల కొడుకుల్ని చూశాం కానీ, వైఎస్సార్ కొడుకులాంటి కొడుకుని ఇక చూడం. చూడబోమని అన్నారు. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు, ఆయన కొడుకు 123 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని 23 ఎమ్మెల్యేలకు తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. చివరకు తన సొంత కొడుకునీ గెలిపించుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారని ధ్వజమెత్తారు. తన సీటును తాను గెలుచుకోలేని లోకేశ్.. అడ్డదారిలో వచ్చిన ఎమ్మెల్సీ పదవితో రాజకీయ పబ్బం గడుపుకుంటూ మళ్లీ తమకే ప్రశ్నలు వేస్తున్నాడని, అతని అమాయకత్వానికి నవ్వాలో, ఏడ్వాలో అర్థం కావడం లేదన్నారు. వైఎస్సార్ కొడుకు మాత్రమే ప్రజల విశ్వాసం పొందారని, రాజకీయాల్లో విశ్వసనీయత అనే పదానికి అర్థం తెలిపిన ఒకే ఒక నాయకుడు వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. ప్రజలకు మాట ఇచ్చి తప్పిన నాయకుడు, విశ్వసనీయత లేని నాయకుడు ఇంకా ప్రతిపక్షంగా ఉండటం అవసరమా? 600 హామీలు ఇచ్చి ఆరు హామీలూ నెరవేర్చలేని చంద్రబాబుకు ప్రతిపక్ష నేతగా ఉండే అర్హత ఉందా? అసలు చంద్రబాబుకు రాజకీయాల్లో కొనసాగే అర్హత ఉందా అనే చర్చ జరగాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటే శాసనంగా, మ్యానిఫెస్టోనే పవిత్రగ్రంథంగా భావిస్తున్న వైఎస్ జగన్ నాయకత్వ శకం ఇక మొదలైందన్నారు. నువ్వెంతో ఉడికినా నీ కంపు పోదు ద్రవ్య వినిమయ బిల్లులో లోపాలేమీ లేకపోవడంతో ఎక్కడ పొగడాల్సి వస్తుందోననే భయంతోనే చంద్రబాబు పారిపోయారని, ఆయన తీరు చూస్తుంటే.. ఉడకవే ఉడకవే ఓ ఉల్లిగడ్డ.. నువ్వెంతో ఉడికినా నీ కంపు పోదంట అన్నట్టుగా ఉందన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో తానుచేయలేని సంచలన చట్టాలు, విప్లవాత్మక పథకాలు.. 45 ఏళ్ల యువకుడు చేస్తుంటే.. చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని ఎలా తిరుగుతారని, అందుకే ఆయన అసెంబ్లీలో పారిపోయారని ఎద్దేవా చేశారు. పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు మా లోకల్ చంటీగాళ్లకే అంటే.. ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేసిన చంద్రబాబు పారిపోక ఏం చేస్తారని నిలదీశారు. వైఎస్ జగన్ అమలుచేస్తున్న చరిత్రాత్మక పథకాలతో చంద్రబాబు శాశ్వతంగా రాజకీయాల నుంచి పారిపోక తప్పదని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ తన తొలి బడ్జెట్లో రైతులకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చారని, గత ప్రభుత్వ విధానాలతో అంపశయ్య మీద ఉన్న వ్యవసాయానికి ఆయుష్షు పోశారని కొనియాడారు. వ్యవసాయం దండగ అన్న గత పాలకుల ముందే వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారని ప్రశంసించారు. -
సభ వాయిదా... అబ్బే లేదు!
న్యూఢిల్లీ: లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తత్తరపాటుకు గురయ్యారు. సభలో గందరగోళం సృష్టించే సభ్యులను కళ్లెం వేసే సభాధ్యక్షురాలే కంగారులో చిన్నపొరపాటు చేశారు. షెడ్యూల్ ప్రకారం బుధవారం అప్రాప్రియేషన్ బిల్లు ఆమోదం పొందాల్సివుండగానే సభను వాయిదా వేసినట్టు స్పీకర్ ప్రకటించారు. బయటకు వెళ్లేందుకు సభ్యులంతా లేచి నిలబడ్డారు. మరోవైపు బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పీకర్ ప్రకటనతో ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతలో సహాయకుడు అప్రమత్తం చేయడంతో మహాజన్ పొరపాటు గ్రహించారు. సభ వాయిదా పడలేదని, సభ్యులంతా కూర్చోవాలని కోరారు. తర్వాత సభకు క్షమాపణ చెప్పారు. గందరగోళంలో చిన్నచిన్న పొరపాట్లు సహజమని సర్దిచెప్పుకున్నారు. తర్వాత అప్రాప్రియేషన్ బిల్లును మూజువాణి ఓటుతో లోక్ సభ ఆమోదించింది.