సభ వాయిదా... అబ్బే లేదు!
న్యూఢిల్లీ: లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తత్తరపాటుకు గురయ్యారు. సభలో గందరగోళం సృష్టించే సభ్యులను కళ్లెం వేసే సభాధ్యక్షురాలే కంగారులో చిన్నపొరపాటు చేశారు. షెడ్యూల్ ప్రకారం బుధవారం అప్రాప్రియేషన్ బిల్లు ఆమోదం పొందాల్సివుండగానే సభను వాయిదా వేసినట్టు స్పీకర్ ప్రకటించారు. బయటకు వెళ్లేందుకు సభ్యులంతా లేచి నిలబడ్డారు. మరోవైపు బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పీకర్ ప్రకటనతో ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.
ఇంతలో సహాయకుడు అప్రమత్తం చేయడంతో మహాజన్ పొరపాటు గ్రహించారు. సభ వాయిదా పడలేదని, సభ్యులంతా కూర్చోవాలని కోరారు. తర్వాత సభకు క్షమాపణ చెప్పారు. గందరగోళంలో చిన్నచిన్న పొరపాట్లు సహజమని సర్దిచెప్పుకున్నారు. తర్వాత అప్రాప్రియేషన్ బిల్లును మూజువాణి ఓటుతో లోక్ సభ ఆమోదించింది.