దేనికైనా ఉంది ...ఓ యాప్!
దేశంలో రూ.1,964 కోట్లకు చేరిన యాప్ పరిశ్రమ
{పస్తుతం 900 కోట్లకు పైగా యాప్ డౌన్లోడ్స్; ఏటా 75% వృద్ధి
నకిలీ యాప్స్‌తో తంటాలు; వీటి వాటా కూడా ఎక్కువే
ఈ రంగంలో ప్రస్తుతం 3 లక్షల మందికి ఉపాధి
మూడేళ్లలో 10 లక్షలకు చేర్చాలని చూస్తున్న గూగుల్
తినడానికి ఫుడ్ యాప్..
తిన్నది అరిగించుకోవటానికి జిమ్ యాప్స్!
దుస్తులకు ఫ్యాషన్ యాప్..
అవే దుస్తుల్ని ఉతికేందుకు లాండ్రీ యాప్స్!!
ఇంటికి ప్రాపర్టీ యాప్స్..
ఆ ఇంటి నిర్వహణకు మేనేజ్మెంట్ యాప్స్!!!
నిత్యావసరాలైన ‘‘తిండి.. బట్ట.. ఇల్లు’’ అన్నీ ఇప్పుడు యాప్స్ చుట్టూనే తిరుగుతున్నాయి. గేమ్స్ నుంచి మూవీస్ వరకూ యాప్స్ మొబైల్లో రెడీగా ఉన్నాయి. కావాల్సిన వస్తువుల్ని కొనటానికి ఈ-కామర్స్ సైట్లు ఎటూ ఉన్నాయి. ఒక్కమాటలో ఏది కావాల్సినా ‘యాప్’తో పొందొచ్చన్న మాట!
రూ.1,964 కోట్లకు పరిశ్రమ..
‘‘ప్రస్తుతం దేశంలోని స్మార్ట్ఫోన్లలో 900 కోట్లకు పైగా యాప్స్ డౌన్లోడ్ అయి ఉన్నాయనేది ఒక అంచనా. 2012లో వీటి సంఖ్య 156 కోట్లు. దేశంలో యాప్స్ డౌన్లోడ్లు గత మూడేళ్లుగా 75 శాతం వృద్ధిని సాధిస్తున్నాయి. ఈ ఏడాది ముగిసే నాటికి యాప్ పరిశ్రమ రూ.1,964 కోట్లకు చేరుకుంటుంది’’ అని ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్ (ఐసీఆర్ఐఈఆర్) తేల్చింది. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) కూడా ఇవే లెక్కలు చెబుతోంది. - హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
10 లక్షలకు యాప్ డెవలపర్లు!!
ప్రస్తుతం దేశంలో యాప్ డెవలప్మెంట్ పరిశ్రమలో 3 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ఐటీ నగరాల్లోనే వీరి సంఖ్య ఎక్కువ. వీరిలో ప్రత్యక్షంగా 1,51,230 నుంచి 1,59,010 మంది, పరోక్షంగా 76,230-84,010 మంది ఉపాధి పొందుతున్నారు. 2012లో ఆరంభమైన గూగుల్ ప్లే స్టోర్‌లో ఇపుడైతే 22,00,000 ఆండ్రాయిడ్ యాప్స్ ఉన్నాయి. వీటిలో 1,600,000 యాప్స్ ఉచితం కాగా.. మిగిలినవి పెయిడ్ యాప్స్. అలాగే 2008లో 500 యాప్స్‌తో ప్రారంభమైన యాపిల్ స్టోర్‌లో.. 2016 జూన్ నాటికి 20 లక్షల యాప్స్ ఉన్నాయి. అయితే గూగుల్ సంస్థ దేశంలో ఆండ్రాయిడ్ డెవలపర్లను పెంచటానికి 20 లక్షల మందికి శిక్షణనిచ్చేందుకు ప్రణాళికలు వేస్తోంది. 2018 నాటికి అమెరికాను దాటేసి.. 10 లక్షల మంది యాప్ డెవలపర్లను తయారు చేయాలనేది దీని లక్ష్యం. ఇందుకోసం ఎడ్యురేకా, కోయింగ్, మనిపాల్ గ్లోబల్, సింప్లిలెర్న్, ఉడాసిటీ, అప్‌గ్రేడ్ వంటి సంస్థల ద్వారా ఏటా 2.50 లక్షల మందికి శిక్షణ ఇవ్వనుంది. మరోవంక ప్లేస్టోర్ విసృ్తతిని పెంచటానికి నిబంధనలనూ మార్చింది. రూ.10కే గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను కొనుగోలు చేసే వీలు కూడా కల్పించింది.
నకిలీల దెబ్బ తక్కువేమీ కాదు...
యాప్స్ వినియోగంలో మన దేశం 3వ స్థానంలో ఉంటే... క్లిక్-ఫ్రాడ్ ఇండెక్స్‌లో మాత్రం 2వ స్థానంలో ఉంది. దేశంలో యాప్ డౌన్‌లోడ్‌లో ఒక వాస్తవ క్లిక్ ఉంటే.. 2.57 మోసపూరిత క్లిక్స్ ఉంటున్నాయని ఆన్లైన్ అడ్వర్టైజింగ్లో ఫ్రాడ్ డెటెక్షన్ సేవలందిస్తున్న ఫారెన్సిక్యూ సంస్థ వెల్లడించింది. ఫ్రాండ్ ఇండెక్స్ సూచీలో మన దేశం 282 స్కోర్‌ను సాధిస్తే.. 318తో హాంగ్‌కాంగ్ ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 12 మిలియన్ల నకిలీ యాప్స్ ఉన్నాయని.. వీటిలో 2-3 శాతం ఆసియా, యూరప్ దేశాల్లో ఉన్నాయని ఫారెన్సిక్యూ నివేదిక పేర్కొంది. ఈ యాప్స్ వల్ల ఆన్లైన్ మీడియా సంస్థలు గతేడాది 850 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయాయి. ఇందులో ఆండ్రాయిడ్ యాప్స్ 480 మిలియన్ డాలర్లు, ఐఓఎస్ 363 మిలియన్ డాలర్లు, విండోస్ మొబైల్ యాప్స్ 14 మిలియన్ డాలర్లు వాటా ఉందని నివేదిక వెల్లడించింది.
నకిలీ యాప్స్‌ను నివారించాలంటే...
⇒యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకునే ముందు వాటి డెవలపర్, సేవల గురించి తెలుసుకోవాలి. యాప్‌కు కుడివైపున డెవలపర్ పేరు, సంస్థ గురించి ఉంటుంది. నిజమైన డెవలపర్‌కు వెబ్సైట్ కూడా ఉంటుంది. ఈ-మెయిల్ ఐడీ, ట్వీటర్ హ్యాండిల్ కూడా ఉంటాయి.
⇒ఆయా యాప్స్ రివ్యూ, రేటింగ్లను పరిశీలించాలి. రేటింగ్ బాగున్నంత మాత్రాన అది నిజమైన యాప్ అనుకుంటే పొరపాటే. ఈ మధ్య కాలంలో నకిలీ రివ్యూ, రేటింగ్ ఇచ్చి మరీ యాప్స్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.
⇒గూగుల్‌లో యాప్ పేరు టైప్ చేసి సేఫ్ టు ఇన్స్టాల్ అని కొడితే చాలు. ఒకవేళ నకిలీ యాప్స్ ఏమైనా ఉంటే మనకు సెర్చ్‌లో కనిపిస్తుంటాయి.
⇒రాయితీలు, ఆకర్షితులై నకిలీ వెబ్సైట్ల నుంచి యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవద్దు. అధికారిక వెబ్‌సైట్స్, యాప్ స్టోర్ల నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి.
⇒యాప్‌ను డౌన్లోడ్ చేసుకునే ముందు ఆయా యాప్ స్పెల్లింగ్ కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోవాలి. స్పెల్లింగ్ తప్పులు, స్క్రీన్ డల్‌గా కనిపించడం, లోగో సరిగా లేకపోవటం వంటివి ఉంటే నకిలీ యాప్ అన్నమాటే.
డౌన్లోడ్ చేసుకుంటే ఏమవుతుంది?
నకిలీ యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకుంటే మొబైల్‌లోకి రకరకాల వైరస్లు వచ్చే అవకాశముంది. మన ఫోన్‌కు ముందుగా ట్రోజన్స్, మాల్వేర్, ఫిషింగ్ మెయిల్స్ పంపిస్తారు. యూజర్ వాటిని గమనించకుండా క్లిక్ చేస్తే చాలు అవి ఫోన్లోకి చొరబడతాయి. అవి బ్యాంకు లావాదేవీలు, వ్యక్తిగత వివరాలను సేకరించి సర్వర్లకు పంపిస్తాయి. ఫోన్లోని డేటా బదిలీ అవుతుంది.ఉదాహరణకు ఫ్లిప్‌కార్ట్ యాప్‌ను తీసుకుందాం. ఒక ఫ్లిప్‌కార్ట్ తన సొంత నెట్వర్క్ ప్రచారం చేసుకుంటూనే.. మరోవైపు ఇతర నెట్‌వర్క్‌లకు ప్రచురణకర్తలుగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ప్రచురణకర్తలు ఏం చేస్తారంటే.. నకిలీ రాయితీలు, ఓచర్లు పెట్టి యూజర్లను ఆకర్షిస్తుంటారు. ఫ్లిప్‌కార్ట్ యాప్‌ను డౌన్లోడ్ చేస్తే... ఈ ఆఫర్‌ను పొందుతారని ప్రకటిస్తుంటారు. ఇలా ఫ్లిప్‌కార్ట్‌ను పోలిన నకిలీ యాప్స్ మన సెల్ఫోన్లో డౌన్లోడ్ అవుతాయి.
ఖరీదైన యాప్‌లివి...
వీఐపీ బ్లాక్
దీన్ని ‘ది మిలియనీర్ యాప్’ అంటారు. ఇదొక ఎక్స్‌క్లూజివ్ లైఫ్‌స్టయిల్ యాప్.
దీన్ని ఐవీఐపీ లిమిటెడ్ 2011లో అభివృద్ధి చేసింది.
586 ఎంబీ ఉండే ఈ యాప్.. ఐఓఎస్ 4.3 వెర్షన్ ఆపైన వాటిలోనే డౌన్లోడ్ అవుతుంది.
ఈ యాప్ ధర 999.99 డాలర్లు
వీఐపీ బ్లాక్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలంటే హైనెట్వర్త్ ఇండివిడ్యువల్స్ అని నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. లేక వారి ఆదాయం మిలియన్ డాలర్లైన అయి ఉండాలండోయ్.
బార్మ్యాక్స్ సీఏ
⇒దీన్ని హార్వర్డ్ లా స్కూల్ పూర్వ విద్యార్థులు రూపొం దించారు.
⇒ఇది సమగ్రమైన న్యాయ పరీక్షల రివ్యూలను అందిస్తుంది. ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఎవరైనా ఈ యాప్ ద్వారా న్యాయ విద్య రివ్యూలను అభ్యసించవచ్చు. హా ధర 999.99 డాలర్లు
మోబీగేజ్ ఎన్డీఐ
⇒ టైటాన్సన్ ఇంజినీరింగ్ 2010లో అభివృద్ధి చేసింది.
⇒ధర 999.99 డాలర్లు
⇒ఇది ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్ స్పానిష్ భాషల్లోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
⇒ఈ అప్లికేషన్‌ను తయారీ ఉత్పత్తులు, అసెంబుల్ భాగాలను తనిఖీకి వినియోగిస్తారు.
ప్రీబ్స్
⇒{పీబ్స్ సంస్థ 2012లో డెవలప్ చేసింది.
⇒దీని ధర 799.99 డాలర్లు. ఇది కూపన్లు, గేమ్స్ అందించే యాప్
⇒ఐఓఎస్ 5.0 ఆపైన వెర్షన్లో మాత్రమే డౌన్లోడ్ అవుతుంది.
మరికొన్ని
బార్సిలోనా వర్సెస్ మాడ్రిడ్, మొబైల్ క్యామ్ వ్యూవర్, పీడీఆర్ కోట్, సేఫ్ సీజన్ వాయిస్ ఎన్క్రిప్షన్, బిజెట్ మొబైల్ వంటి యాప్స్ కూడా ఖరీదైనవే. వాటి ధరలు 349.99 డాలర్ల నుంచి 129.99 డాలర్ల మధ్య ఉన్నాయి.