అవుకు వాసి ‘అనంత’లో ఆత్మహత్య
తాడిపత్రి రూరల్ : కర్నూలు జిల్లా అవుకుకు చెందిన అప్పుస్వామి(42) అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గదరగుట్టపల్లి సమీపంలో ఆత్మహత్య చేసుకున్నట్లు కనుగొన్నారు. వెదురు బొంగుల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే అప్పుస్వామికి ఏడాది కింద పిచ్చికుక్క కరవడంతో అప్పటి నుంచి మతిస్థిమితం కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తాడిపత్రి మండలం భోగసముద్రానికి వెళ్లొస్తానంటూ గురువారం ఇంటి నుంచి బయలుదేరిన అతను మార్గమధ్యంలో గదరగుట్టపల్లి వద్ద విషపు గుళికలు మింగి మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
శుక్రవారం ఉదయమే గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతుడు అవుకుకు చెందిన అప్పుస్వామిగా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఇక్కడికి చేరుకున్నారు. మృతుని భార్య రామాంజనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు.