రంగుల రాగం.. తానం.. పల్లవి!
ఆర్ట్ దేవో భవ
తల్లి డాక్టరు, కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇద్దరూ చిత్రకారిణులు.ఒకరిది భక్తి భావం, మరొకరిది మోక్షమార్గం. తల్లి ఆధ్యాత్మికతలో పరవశిస్తే, కూతురుఆధ్యాత్మిక చింతనకు కొనసాగింపైన సంగీతానికీ, కవిత్వానికీ, ప్రకృతికీ రంగులద్ది మైమరచిపోతారు.‘జగద్గురు, జగత్ ఆర్ట్ ఎగ్జిబిషన్’ పేరిట మూడు రోజుల పాటు హైదరాబాద్.. మాసబ్ ట్యాంక్లోనిఫైన్ ఆర్ట్స్ కళాశాల, నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో ఈ తల్లీకూతుళ్ల పెయింటింగ్స్ ప్రదర్శన జరిగింది.నిన్నటితో ముగిసింది. ఈ సందర్భంగా వీరిద్దరి రంగుల ప్రపంచంలోకి చిన్న ప్రయాణం.
‘నేను శాశ్వతం అనుకోవడం అజ్ఞానం. ఏదీ శాశ్వతం కాదు అనుకోవడమే జ్ఞానం’ అంటారు గాయత్రీదేవి. ఈ జీవిత సత్యం తెలుసుకునే సరికి కొందరి జీవితం ముగుస్తుంది. కానీ ఇది సత్యమని ముందుగానే తెలుసుకున్న వారి జీవితం ఆ క్షణం నుంచి మొదలవుతుంది. అప్పుడే మనస్సు అజ్ఞానాంధకారంలోంచి, చిమ్మచీకటిని పులుముకున్న చిక్కటి రంగుల్లోంచి విజ్ఞానమనే అనంతమైన వెలుతురులోనికి ప్రవహిస్తుంది. బ్రహ్మాండాన్ని చీల్చగలిగిన ఆ జ్ఞానజ్యోతి మనిషిని సున్నితంగా మారుస్తుంది. ఈ అంతర్లీనతను యోగాతో సమ్మిళితం చేస్తూ గాయత్రి గీసిన చిత్రం ‘మిస్టిక్’.
వర్ణమయ భ్రమణం
గాయత్రికి రంగులంటే ప్రాణం. ఆమె మనస్సులో అలుముకున్న రంగుల్లో భక్తిపారవశ్యం ఉంటుంది. గొప్ప తపస్సు ఉంటుంది. అన్నిటికీ మించి పసితనాన్ని ప్రేమించే సున్నితత్వం ఉంటుంది. అందుకే ఆమె వేసిన చిత్రాలు దేవకీదేవి ఒడిదాటిన చిన్నికృష్ణుడితో ప్రారంభమై, చెడుపై మంచి సాధించే విజయంగా హిందువులు భావించే నరకాసురుడి వధ వరకు పురాణాలు, ప్రబంధాల చుట్టూ పరిభ్రమిస్తాయి.
దేహాత్మల మమేకం
గాయత్రీదేవి వృత్తి, ప్రవృత్తి భిన్నమైన అంశాలుగా కనిపించినా, నిజానికి అవి రెండూ ప్రకృతితో ముడివడిన అంశాలే. దానికి తోడు యోగా గాయత్రీదేవి అభిరుచి. పై రెండింటితో పాటు యోగా సైతం ప్రకృతిలో మనిషిని, మనస్సుని నిమగ్నం చేసే ఓ కళే. అందుకే ఆమె ప్రతిచిత్రంలోని భంగిమలు ఆమెలోని మరో అభిరుచిని కూడా పట్టిస్తాయి. చెన్నైలో ఉన్నప్పుడు లక్ష్మిగారి దగ్గర ప్రత్యేకించి తంజావూరు ఆర్ట్ అలవర్చుకున్నానన్నారామె. చిత్ర కారిణి, యోగా, ఆయుర్వేదం ఇన్ని విద్యలు మీకెలా అబ్బాయన్న ప్రశ్నకు శరీరం, మనసు, ఆత్మలు మమేకం కావడమే యోగా అని ఆమె సమాధానమిచ్చారు. మొత్తం పాతిక పెయింటింగ్స్‌లో కాలీయ మర్దనం, కంస వధ, శమంతకమణి, సుధామమైత్రి, శిశుపాల వధ, నరకాసుర వధ, శ్రీకృష్ణ తులాభారం, ద్రౌపదీ వస్త్రాపహరణం, గీతోపదేశం నుంచి విశ్వరూపంతో గాయత్రీదేవి ప్రదర్శన ముగుస్తుంది.
అమ్మ కుంచె.. అపరాజిత
రెండేళ్ల వయసుకే అమ్మ కుంచెను అందిపుచ్చుకున్నారు అపరాజిత. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియాలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన అపరాజిత కాలిఫోర్నియాలోనే ఆపిల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ నుంచి కళను ఆస్తిగా పొందిన అపరాజిత ఐదేళ్ళప్పుడే చిత్రకళా ప్రదర్శనలో అవార్డుని అందుకున్నారు. ఈ ఎగ్జిబిషన్లో వసంతం మోసుకొచ్చే నిండుపున్నమిని తలపించే తెలుపు ఊదా రంగుపూల బరువుతో వొంగి, నేలను ముద్దాడినట్టున్న పూలచెట్టు చిత్రం వీక్షకులను కట్టిపడేసింది.
ప్రతి దృశ్యం ఒక చిత్రకావ్యం
సంగీతానికీ రంగులద్దగలదు అపరాజిత నీళ్ళు, నదులు, సముద్రాలు అపరాజిత చిత్రాల్లో అలలు అలలుగా మనస్సుని ఆనందంలో ఓలలాడిస్తాయి. ముంబైలోని జేజే స్కూల్ ఆఫ్ ఫైన్ఆర్ట్లో ఆమె తనను తాను చిత్రకారిణిగా తీర్చిదిద్దుకున్నారు. తను బాల్యం నుంచి గడిపిన ప్రదేశాలు, మనస్సుని హత్తుకున్న ప్రాంతాలు, ఆకట్టుకున్న పరిసరాలు ఇలా.. అపరాజిత మనస్సులో పడిన ముద్రలెన్నో ఆమె కాన్వాస్‌పై చెట్లై విస్తరించాయి, పూవులుగా పూశాయి. నదులై ప్రవహించాయి. – అత్తలూరి అరుణ