ఔను అందరూ ఇష్టపడ్డారు!
వరుస ఫ్లాపులు. వంశీకేమైంది? ‘సితార’, ‘అన్వేషణ’, ‘లేడీస్ టైలర్’, ‘ఏప్రిల్ 1 విడుదల’... ఈ సినిమాలు డెరైక్ట్ చేసిన వంశీయేనా ‘ప్రేమ అండ్ కో’, ‘నీకు 16 - నాకు 18’, ‘వైఫాఫ్ వి.వరప్రసాద్’ లాంటి వీక్ సినిమాలు తీసింది! వంశీ పని అయిపోయిందా?
ఇక్కడ వంశీకి కూడా ఏమీ అర్థం కావడం లేదు. మనసంతా చిందర వందరగా ఉంది. ఏదో నిర్వేదం, నిరాశ, నిస్పృహ. ఈ మనుషులకీ, ఈ సినిమాలకీ, ఈ ఇండస్ట్రీకీ దూరంగా వెళ్లిపోవాలి. అప్పుడుగాని మనశ్శాంతి దొరకదు. అప్పుడుగాని రీచార్జ్ కాలేడు. సామాన్లన్నీ ప్యాక్ చేసేశాడు. ఇల్లు ఖాళీ చేసేశాడు. జేబులో ఐదు వందలే ఉన్నాయి. భార్యా బిడ్డల్ని తీసుకుని యానాం వెళ్లిపోయాడు.
అక్కడెవరికీ వంశీ తెలీదు. వంశీ క్కూడా ఎవరితోనూ పనిలేదు. పుస్తకాలు, నాటకాలు, సినిమాలు, గోదావరి తీరం... ఇవే టైమ్‌పాస్. వంశీ ఇక్కడున్న విషయం కొద్దిమందికే తెలుసు. రైటర్ వేమూరి సత్య నారాయణ, ‘స్వాతి’ ఎడిటర్ వేమూరి బలరామ్, హీరో జేడీ చక్రవర్తి. ఈ ముగ్గురే ఫోన్లు చేసి కుశలమడిగేవారు.
సినిమాల్లోనే కాదు, లైఫ్‌లో కూడా చాలా ట్విస్టులుంటాయి. వంశీ లైఫ్‌లో కూడా! ఆరోజు వంశీకి ఫుల్ ఫీవర్. మలేరియా. ఆ వెంటే తోడుగా కామెర్లు. కాకినాడలోని సాలిపేట చంద్రారెడ్డిగారి హాస్పిటల్లో జాయిన్ చేశారు. స్పృహ లేదు. కోమాలాంటి స్థితి. ఎప్పటికో తేరుకున్నాడు. నిజంగానే చచ్చి బతికినంత పనయ్యింది. అంత నీరసంలో కూడా ఆయనలోని రైటర్ హుషారెత్తిపోయాడు. హాస్పిటల్ బెడ్‌మీదే కూర్చుని ‘రవ్వలకొండ’ అనే శృంగార నవల రాసి పారేశాడు. మళ్లీ యానాం జీవితం. నాలుగు సినిమాలు... పది పుస్తకాలు... గోదావరి తీరంలో వాకింగ్.
వంశీ ఇంట్లో ల్యాండ్‌ఫోన్ మోగింది. చాలా రేర్‌గా మోగుతుందా ఫోన్. చేసే వాళ్లు చాలా తక్కువ కదా. ఫోన్ చేసింది వేమూరి సత్యనారాయణ.‘‘ఏమోయ్ వంశీ... ఎన్నాళ్లుంటా వక్కడ? హైదరాబాద్ వచ్చెయ్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కూడా మద్రాసు నుంచి ఇక్కడకు షిఫ్ట్ అయిపోయింది. అమెరికాలో స్థిరపడ్డ మావూరోడు వేమూరి రమేశ్ నీతో సినిమా తీస్తానంటున్నాడు.’’ వంశీ గోడ గడియారం వైపు చూశాడు. మళ్లీ తన టైమ్ స్టార్టయ్యిందా?!
హైదరాబాద్... అమీర్‌పేటలోని దివ్య శక్తి అపార్ట్మెంట్స్. వంశీ వచ్చాడని తెలిసి హైదరాబాద్‌లోని రైటర్స్ అంతా బిలబిలా వచ్చేశారు. వాళ్లతో ఎన్నెన్నో అచ్చట్లూ ముచ్చట్లూ. వంశీకి మళ్లీ పాతరోజులు గుర్తొస్తున్నాయి. ఈ సందళ్ల మధ్య స్క్రిప్టు రాస్తున్నాడు. తీరా చూస్తే వేమూరి రమేశ్ సినిమా తీయకుండానే అమెరికా వెళ్లిపోయాడు. వంశీ
పరిస్థితి క్రాస్‌రోడ్స్‌లో ఉంది. ఇప్పుడేం చేయాలి?
అలాంటి టైమ్‌లో వచ్చారు ప్రొడ్యూ సర్ జయకృష్ణ. ఒకప్పుడు ఫేమస్ మేకప్ మేన్. కమల్‌హాసన్‌తో ‘అభయ్’, శ్రీహరితో ‘దాసు’, సుమంత్‌తో ‘శభాష్’ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. వంశీకో ఆఫర్. మలయాళం సినిమా ‘సమ్మర్ ఇన్ బెత్లెహామ్’ని వేణు హీరోగా రీమేక్ చేయాలి. వంశీ రెడీ. ‘లవ్ ఇన్ రామోజీ ఫిలిం సిటీ’ పేరుతో ప్రీ-ప్రొడక్షన్ స్టార్ట్.
పాపం జయకృష్ణ... ఒకేసారి ఎక్కువ ప్రాజెక్టులు పెట్టేసుకోవడంతో ఫైనాన్షి యల్ డిస్ట్రబెన్సెస్. వంశీ సినిమా స్టార్ట్ కాకముందే స్టాప్ అయిపోయింది. వంశీ ఇలాంటివెన్నో చూశారు కాబట్టి నో టెన్షన్.
వంశీ కోసం ప్రొడ్యూసర్లు వస్తూనే ఉన్నారు. రవితేజతో ‘శివలింగపురం చెక్ పోస్ట్’ చేద్దామన్నాడు తాటి సతీశ్. ఇంకో నిర్మాత ఇంకో ప్రపోజల్. ఏదీ వర్కవుట్ కావడం లేదు. ఇలా వాళ్లనీ వీళ్లనీ నమ్ము కునేకన్నా పార్టనర్‌షిప్‌లో తనే సినిమా చేస్తే?
వంశీ కసిమీదున్నాడు. తలుపులు మూసేసుకున్నాడు. రెండు మూడు నెలలు ఎవరికీ కనబడలేదు. రచయిత ‘గంగోత్రి’ విశ్వనాథ్ అప్పుడెప్పుడో చెప్పిన ఓ కథను బేస్ చేసుకుని బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసేశారు. అప్పుడు గానీ బయటకు రాలేదు. రాగానే బడ్జెట్ ప్లాన్ రెడీ చేయించారు. టెక్నీషి యన్స్‌ను కూడా మాట్లాడి పెట్టుకున్నారు. శివాజీని హీరోగా అడుగుదామనుకున్నారు. ఇంకో పక్క పార్టనర్షిప్ ప్రొడ్యూసర్ కోసం సెర్చింగ్. ‘భవ్య’ ఆనంద్ప్రసాద్నీ, కడపకు చెందిన ట్రావెల్స్ వాళ్లనీ కలిశారు. వర్కవుట్ కాలేదు. అలాంటి టైమ్‌లో ఎంటరయ్యాడు వల్లూరిపల్లి రమేశ్. సీనియర్ ప్రొడక్షన్ మేనేజర్. వంశీ దగ్గర ‘మహర్షి’ లాంటి సినిమాలకు పనిచేశాడు. వేమూరి సత్యనారాయణకు దగ్గరి బంధువు. ప్రొడ్యూసరయ్యే ట్రయల్స్‌లో ఉన్నాడు. ఇప్పుడు వంశీతోనే సినిమా చేయడానికి రెడీ. ‘జెమినీ’ కిరణ్ ఫుల్ సపోర్ట్. వంశీకి పార్టనర్షిప్ కాకుండా రెమ్యునరేషన్ ఇచ్చేందుకు అగ్రిమెంట్.
పూరీ జగన్నాథ్ డెరైక్షన్‌లో ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’లో హీరోగా చేశాడు రవితేజ. ఇప్పుడు పూరీతోనే ‘ఇడియట్’ చేస్తున్నాడు. టిపికల్ బాడీ లాంగ్వేజ్... వెటకారపు డైలాగ్ డెలివరీ... వంశీకి ఇంతకన్నా బెటర్ ఆప్షన్ ఎవరుంటారు? రవితేజ కూడా వంశీ అనగానే ఎగిరి గంతేసినంత పనిచేశాడు.
హీరోయిన్గా లయను పెడదామా? లేకపోతే ఇంకెవరు బెటర్? సరిగ్గా అదే టైమ్‌లో ‘శేషు’ రిలీజైంది. హీరోయిన్ కల్యాణి. ఫ్రెష్ ఫేస్. జెమినీ టీవీ ఆఫీసుకి లైవ్ ప్రోగ్రామ్‌కి వస్తోంది. ‘‘ఓసారి మేకప్ టెస్ట్ చేసి చూస్తారా?’’ అడిగారు ‘జెమినీ’ కిరణ్. వంశీ మైండ్‌లో హీరోయిన్ గెటప్ విషయంలో ఓ పిక్చర్ ఉంది. అప్పటి కప్పుడు షాపింగ్కెళ్లి కొన్ని చీరలు కొన్నారు. కల్యాణి, రవితేజపై జెమినీ ఆఫీసులోనే ఫొటోషూట్. పెయిర్ బాగుంది. వంశీకి ఓకే.
కాకినాడకు చెందిన కృష్ణభగవాన్‌ను రైటర్‌ను చేసిందీ, ఆర్టిస్టును చేసిందీ... అంతెందుకు పాపారావు చౌదరి అనే అతని పేరును కృష్ణభగవాన్గా మార్చిందీ - వంశీనే. ‘ఏప్రిల్ 1 విడుదల’లో అతనితో విలనీ చేయించారు. ఇందులో మాత్రం మాంచి కామెడీ వేషం ఇచ్చారు.ఈ సినిమాలో ఇంకో ఇంపార్టెంట్ రోల్ ఉంది. కొత్త ఆర్టిస్టయితే బాగుం టుంది. వంశీకి ద్రాక్షారామం పరిషత్తు నాటక పోటీల్లో ‘అల్లదే మా ఊరండీ’ నాటకంలో కాంపౌండర్ వేషం వేసిన బక్కపల్చటి వ్యక్తి గుర్తొచ్చాడు. వెంటనే పిలిపించారు. అతనే కొండవలస లక్ష్మణ రావు. వైజాగ్ పోర్ట్‌ట్రస్ట్‌లో పనిచేసి, రిటైరై పోయాడు. ఈ సినిమాలో అతని పాత్రకో ఊతపదం ఉంటుంది. ‘అయితే ఓకే’. దీని కోసం చాలారోజులు ప్రాక్టీస్ చేయించారు.
‘వేమూరి స్వాతి బలరామ్ వ్రాలు’. ఇదీ టైటిల్. ‘‘బలరామ్గారికి ‘స్వాతి’ మానస పుత్రిక. లవర్స్‌కి ఆ పేరు కరెక్ట్ కాదు’’ అన్నారు స్క్రిప్టు కో-ఆర్డినేటర్ వేమూరి సత్యనారాయణ. వంశీకి అవును కదా అనిపించింది. అయినా ఆయన దగ్గర టైటిల్స్‌కు కొదవేంటి? ఈసారి టైటిల్ ‘ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’. నో అబ్జెక్షన్. బాపుగారితో టైటిల్ రాయించడం వంశీకి సెంటిమెంట్. బాపు టైటిల్ రాస్తే, కార్టూనిస్ట్ జయదేవ్ తెగ ముచ్చటపడిపోయి దానికి ఎక్స్క్లమేటరీ మార్కు యాడ్ చేశారు.
కారులో రవితేజ, వంశీ వెళ్తున్నారు. రవితేజ మ్యూజిక్ ప్లేయర్ ఆన్ చేశాడు. ‘మళ్లి కూయవే గువ్వా...’ పాట వస్తోంది. వంశీకి తెగ నచ్చేసింది. ‘‘అరె... భలే ఉందే పాట’’ అన్నారు వంశీ. ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ సినిమాలో పాట అది. ‘‘చక్రి అని కొత్త మ్యూజిక్ డెరైక్టర్’’ - చెప్పాడు రవితేజ. ‘‘అయితే మన సినిమాకీ అతణ్ణే పెట్టుకుందాం’’- ఫిక్స్ అయిపోయారు వంశీ.
ఈ కథలో హీరోది రాత్రి ఉద్యోగం. నైట్ వాచ్‌మన్. హీరోయిన్‌ది పగలు ఉద్యోగం. సాఫ్ట్వేర్. పగలూ రాత్రికి సింబాలిక్‌గా నలుపూ తెలుపూ థీమ్ అయితే బావుంటుందనుకున్నారు వంశీ. అందుకే హీరోయిన్‌తో బ్లాక్ శారీస్ కట్టించాలని, రూమ్ నిండా బ్లాక్ అండ్ వైట్ కలర్స్ వేయించాలని వంశీ ప్లానింగ్. వంశీకి పర్సనల్‌గా బ్లాక్ అండ్ వైట్ అంటే చాలా ఇష్టం. ఆయన ఇంట్లో కూడా బ్లాక్ అండ్ వైట్ థీమే ఉంటుంది.
సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ అయిపోవాలి. దాదాపుగా ఒకటే ఇంట్లో షూటింగ్. ఇళ్ల కోసం చాలా వెతికారు. ఫైనల్‌గా సారథీ స్టూడియోకెళ్లారు. అక్కడో బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ ల్యాబ్ ఉంది. ఆ ప్లేస్ వంశీకి నచ్చేసింది. ఆ ల్యాబ్పైనే రూమ్ సెట్ చేస్తే?! వంశీ తలుచుకుంటే లొకేషన్‌కి కొదవా! 35 వేలతో రూమ్ సెట్ రెడీ. వంశీ ఇంట్లో సామాన్లతోనే దాన్ని డిజైన్ చేసేశారు. 85 శాతం షూటింగ్ సారథీ స్టూడియోలోనే. సాంగ్స్‌కి మాత్రం అరకులోయ, పాపికొండలకెళ్లారు. 35 రోజుల్లో సినిమా కంప్లీట్. ఆరేళ్లు గ్యాప్ వచ్చినా వంశీలో అదే స్పీడ్. అదే క్రియేటి విటీ. అసలు వంశీ ఎంత వేగంగా తీశా డంటే... యూనిట్వాళ్లే అదిరిపోయారు. లాస్ట్ డే... వంశీ దగ్గరకొచ్చింది కల్యాణి. ‘‘ఈ సినిమాలో నేను కట్టిన చీరలన్నీ చాలా బాగున్నాయ్. అవి నాకు ఇచ్చేస్తారా?’’ అడిగింది అమాయకంగా.
‘‘అన్నీ పట్టుకుపో’’ అన్నారు వంశీ. కల్యాణి ఆ కాటన్ చీరల్ని పట్టు చీరలన్నంతగా ఫీలై పట్టుకు వెళ్లిపోయింది.
2002 ఆగస్టు 2. వంశీ, కృష్ణ భగవాన్ షిర్డీలో ఉన్నారు. ఆ రోజే సినిమా రిలీజ్. కృష్ణ భగవాన్‌కి ఫోన్. మాట్లాడి పెట్టేసి, ‘‘గురువుగారూ! మన సినిమా హిట్ అంట’’ అని సంబరపడిపోయాడు. వంశీలో ఎలాంటి ఫీలింగూ లేదు. ‘అవునా’ అన్నాడాయన చాలా క్యాజువల్‌గా.
‘ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ - చిన్న సినిమాల్లో అతి భారీ విజయం. ‘వెన్నెల్లో హాయ్ హాయ్ పాట మోగని ఇల్లు లేదు. కూనిరాగం తీయనివాళ్లు లేరు. అంతే... మళ్లీ వంశీ హవా స్టార్ట్. రవి తేజకు హ్యాట్రిక్ హిట్. కల్యాణికి క్రేజ్. కృష్ణ భగవాన్‌కి టర్నింగ్. కొండవలసకు బంపర్ ఆఫర్. చక్రి కెరీర్ స్పీడ్. అసలు టోటల్‌గా ఈ సినిమానే అందరికీ స్పెషల్. ఆడియన్స్‌కీ అంతే. ఆ జోకులు... ఆ క్యారెక్టర్లు... ఆ ఫ్రేములు... ఆ పాటలతో వెన్నెల్లో హాయ్ లాంటి ఫీలింగ్. మల్లెల్లో హాయ్ లాంటి ఫీలింగ్.
వెరీ ఇంట్రస్టింగ్...
సాయి శ్రీహర్ష అంతకు ముందు చాలా పాటలు రాశారు కానీ, ‘వెన్నెల్లో హాయ్ హాయ్’ పాటతో ఒక్కసారిగా పాపులర్ అయిపో యారు. ఇటీవలే చనిపోయిన ఆయనను ఎప్ప టికీ బతికించే పాటగా ఇది మిగిలిపోయింది. ఆ ఏడాది ఈ సినిమా కాస్ట్యూమర్ గణపతికి నంది అవార్డు వచ్చింది. ‘‘డ్రెస్సులన్నీ మీరు కొనుక్కొచ్చారు కదా, నేను అవార్డు అందుకుంటే ఏం బాగుంటుందండీ’’ అని ఇబ్బందిపడితే, వంశీ ‘‘ఏం ఫర్లేదు’’ అన్నారు.
కోటి రూపాయల్లోపే ఈ సినిమా పూర్తయ్యింది.