ఏఎంఆర్పీని సందర్శించిన ప్యారిస్ రైతుబృందం
పెద్ద అడిశర్లపల్లి, న్యూస్‌లైన్: ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్‌కు చెందిన 56మందితో కూడిన రైతు బృందం సభ్యులు గురువారం పెద్ద అడిశర్లపల్లి మండలంలోని ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి ప్రాజెక్టు వివరాలు వారికి తెలియజేశారు. ఈ లిఫ్ట్ ఆసియా ఖండంలోకెల్లా ఎత్తై సింగిల్ ఫేజ్ లిఫ్ట్ అని చెప్పారు. నాగార్జునసాగర్ జలాశయం వెనుక జలాల నుంచి పైపుల ద్వారా లిఫ్ట్‌చేసి 3లక్షల ఎకరాలకు సాగునీరు, వెయ్యి గ్రామాలతో పాటు హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరందిస్తుందని వివరించారు.
ప్రాజెక్టును సందర్శించిన రైతు ప్రతినిధులు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు అద్భుతంగా ఉందని కొనియాడారు. సాగునీటి సామర్థ్యం పెంపు, భారతదేశ రైతుల ఆదాయ వనరులు, వ్యవసాయ రంగంలో చిన్న కమతాల సాగు, తాగునీటి వినియోగం తదితర అంశాలపై అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. ఈ బృందం హైదరబాద్‌కు చెందిన ఎన్జీఓ సంస్థ ప్రతినిధి పద్మ ఆధ్వర్యంలో పరిశీలన జరిపింది. వారివెంట ప్రాజెక్టు డీఈఈ నర్సింగరాజు ఉన్నారు.