Aqua farm
-
ఎవరికి వారు పెంచుకునేలా..వెటరన్ ఇంటిగ్రేటెడ్ ఫామ్!
ఉద్యోగ విరమణ అనంతరం విశ్రాంత జీవితంలో తనకు నైపుణ్యం ఉన్న రంగంలో కృషిని కొనసాగించడం ఇటు తనకు, అటు సమాజానికి మేలు జరుగుతుందని నమ్మే వ్యక్తి వెస్లీ రొసారియో. తన నమ్మకాన్ని ఆచరణలో పెట్టి వాహ్ అనిపించుకుంటున్నారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన వెస్లీ చేపలు, రొయ్యల పెంపకంలో నిపుణుడు. బ్యూరో ఆఫ్ ఫిషరీస్ అండ్ ఆక్వాటిక్ రిసోర్సెస్ రీసెర్చ్ సెంటర్ అధ్యక్షుడిగా ఉన్నత స్థాయిలో సేవలందించి దగుపన్ నగరంలో మూడేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. ఉద్యోగ బాధ్యతల రీత్యా బదిలీల వల్ల టపుయాక్ జిల్లాలోని తమ పూర్వీకుల ఇంటిని ఖాళీగా ఉంచాల్సి వచ్చింది. అక్కడ ఎవరూ లేకపోయేసరికి ఆ ఇంటితో పాటు వెయ్యి చదరపు మీటర్ల పెరడు కూడా నిరుపయోగంగా పాడు పడింది. రిటైరైన తర్వాత ఆయన ఇంటికి చేరుకొని కొద్ది నెలల్లోనే ఫిష్‌టెక్ అర్బన్ ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఫార్మింగ్ శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పటంతో ఇంటికే కాదు పెరటికి కూడా కళ వచ్చింది. ఇంటిపట్టునే కూరగాయలు, ఆకుకూరలు, కోళ్లతో పాటు చేపలను కూడా నిశ్చింతగా ఎవరికివారు పెంచుకొని ఇంటిల్లపాదీ పౌష్టికాహారాన్ని ఆస్వాదించవచ్చని వెస్లీ రొసారియో తన అర్బన్ ఇంటిగ్రేటెడ్ ఫామ్‌లో ఆచరించి చూపుతున్నారు. యూత్, సెకండ్ యూత్ అన్న తేడా లేకుండా బ్యాచ్‌ల వారీగా అందరికీ శిక్షణ ఇస్తున్నారాయన. ట్యాంకు నుంచి అజోలాను వెలికితీస్తున్న రొసారియో వెస్లీ రొసారియో పెరటి తోటలో మొత్తం ఎనిమిది (మీటరు వెడల్పు, మూడు మీటర్ల పొడవైన) చిన్న చెరువులు ఉన్నాయి. నేలపై తవ్విన చెరువుతో పాటు సిల్పాలిన్ షీట్, ఫైబర్‌తో చేసిన కృత్రిమ చెరువులు కూడా ఉన్నాయి. రీసర్కులేటరీ ఆక్వా చెరువు కూడా అందులో ఒకటి. కూరగాయలు, ఆకుకూరలు సాగయ్యే మడులతో పాటు కంటెయినర్లు ఉన్నాయి. హైడ్రోపోనిక్స్ వ్యవస్థలో ఆకుకూరలు, ఔషధ మొక్కలు పెంచుతున్నారు. ఆక్వాపోనిక్స్ వ్యవస్థ అదేవిధంగా ఆక్వాపోనిక్స్ వ్యవస్థ ఉంది. చేపల విసర్జితాలు, వాటికి వేసే మేత వ్యర్థాలతో కూడిన ఆ నీరు పోషకవంతమై ఆకుకూరలకు ఉపయోగపడుతోందని వెస్లీ రొసారియో తెలిపారు. నేలపై ఉన్న చెరువులో జెయింట్ గౌరామి, తిలాపియా, ఫంగాసియస్, క్యాట్‌ఫిష్‌లు పెరుగుతున్నాయి. నాటు కోళ్లు, బాతులకు ఆయన ప్రధానంగా అజోలాని పండించి మేతగా వేస్తున్నారు. అజోలాను నీటిలో వేస్తే చాలు, పెరుగుతుంది. ప్రాసెసింగ్ అవసరం లేదు. నేరుగా చేపలు, జంతువులకు, పక్షులకు మేతగా వేయొచ్చని ఆయన అన్నారు. అజోలా పెరిగే చెరువుల్లో దోమలు గుడ్లుపెట్టే అవకాశం ఉండబోదన్నారు. చెరువు నీటిలో చేపలు పెంచుతూనే, ఆ చెరువు నీటిపై తేలాడే మడు(ఫ్లోటింగ్ బెడ్)లను ఏర్పాటు చేసి అజోలాను పెంచుతుండటం విశేషం. సందర్శకులకు హైడ్రోపోనిక్స్ గురించి వివరిస్తున్న వెస్లీ రొసారియో చేపల తలలు, తోకలు, రెక్కలు, పొలుసులు, లోపలి భాగాలు వంటి వ్యర్థాలను సేకరించి మీనామృతం తయారు చేసి, పంటలపై పిచికారీ చేస్తే బలంగా పెరుగుతాయని రోసారియో తెలిపారు. వంకాయలు, మిరపకాయలు, బెండకాయకాయలు తదితర కూరగాయలను పండిస్తాం. బాతులు, నాటు కోళ్లు గుడ్లు పెడుతున్నాయి. పట్టణ ప్రజలు పెరట్లో చేపలు, కూరగాయలు పెంచుకోవడానికి శ్రద్ధ కావాలే గానీ పెద్దగా పెట్టుబడి అవసరం లేదు అంటున్నారు రొసారియో. అనుభవాలను పంచుకోవడం చాలా రిలాక్సింగ్‌గా ఉంది నేను పదవీ విరమణ తర్వాత జీవితం ఉండేలా చూడాలనుకున్నాను. నన్ను బిజీగా ఉంచుకోవడానికి ఏమి చేయాలో ముందుగానే ప్లాన్ చేసాను. నా వృత్తిపరమైన జీవితమంతా ఫిషరీస్‌లో పనిచేశాను కాబట్టి ఫిష్‌టెక్ ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఫామ్‌ని ఏర్పాటు చేశాను. నా అనుభవాలను పంచుకోవడం చాలా రిలాక్సింగ్‌గా ఉంది. అలాగే, వచ్చి సలహాలు అడిగే మాజీ సహోద్యోగులతో సంబంధాలు కొనసాగటం సంతోషంగా ఉంది. – వెస్లీ రొసారియో, దగుపన్ నగరం, ఫిలిప్పీన్స్ (చదవండి: పెద్ద విస్తీర్ణంలో ప్రకృతి సేద్యం ఎలా చేయాలంటే..!) -
ఆక్వాకు 'జెల్ల'.. దెయ్యం చేపతో నష్టం
పశ్చిమగోదావరి,పాలకోడేరు: సక్కర్ చేప.. వినడానికి వింతగా ఉన్న జెల్ల జాతికి చెందిన ఈ చేప ఆక్వా రైతులను బెంబేలెత్తిస్తోంది. నార్త్ అమెరికాలో ఈ చేపను అక్వేరియంలలో పెంచడానికి ఉత్పత్తి చేశారు. ఇది మన ప్రాంతంలోని జలాల్లోకి ఎలా వచ్చిందో ఏమోగానీ పంట కాలువల్లో విపరీతంగా పెరుగుతోంది. ఆక్వా చెరువులను తుడిచిపెట్టేస్తోంది. దీంతో ఈ చేపను ఆక్వా రైతులు దెయ్యం చేపగాపిలుస్తున్నారు. ఒంటి నిండా మచ్చలతో నెత్తిమీద కళ్లు ఉండే ఈ చేప పంట కాలువల్లో నుంచి ఆక్వా చెరువుల్లోకి వెళ్లి మత్స్య సంపదకు వేసిన మేతను తినేస్తోంది. ఫలితంగా చెరువుల్లో రొయ్యలు, చేపలకు మేత చాలక ఎదుగుదల లోపిస్తోంది. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. ఈ చేప తినేందుకు అనువైనదైనా దీని ఆకారం చూసి ఎవరూ తినడం లేదని అధికారులు చెబుతున్నారు. ఆక్వా రంగానికి నష్టం సక్కర్ చేప హోమ్నివారస్ జాతికి చెందింది. దీని శాస్త్రీయ నామం హైపోస్తోమస్ క్లిపికోస్తోమస్. ఇవి కొండ ప్రాంతాల్లో ఉంటాయి. రూప్ చంద్ తదితర చేపలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేటప్పుడు మనదేశానికి వచ్చి ఉంటుందని చెబుతున్నారు. ఇది మంచినీటితోపాట కలుషిత జలాలు, ఆక్సిజన్ తక్కువ శాతం ఉన్న నీటిలోనూ బతికేస్తుంది. చేపలు, రొయ్యల చెరువుల్లోకి వెళితే వాటికి వేసే మేతను తినేయడం వల్ల ఆక్వా రైతుకు అపారనష్టం కలుగుతోంది. ఇది అరకేజి సైజు వరకూ పెరుగుతుంది. అక్వేరియంలో ఫిష్‌గా వాడతారు. నాచు, చిన్న చేపలను ఆహారంగా తీసుకుంటుంది. దీంతో అక్వేరియంలో అద్దాలకు పట్టిన నాచును శుభ్రం చేయడానికి దీనిని పెంచుతారు. – ఎల్ఎల్ఎన్రాజు, ఎఫ్డీఓ, వీరవాసరం బాగా పెరుగుతున్నాయి ఇటీవల కాలంలో ఈ సక్కర్ చేపలు పంటకాలువలు, బోదెల్లోనూ కనపడుతున్నాయి. ఈ చేపలు ఆక్వా చెరువుల్లోకి వచ్చి నష్టం చేస్తున్నాయని అధికారులు తేల్చిచెప్పారు. ఇలాంటి చేపలు చెరువుల్లోకి రాకుండా ముందుగానే చర్యలు తీసుకుని ఆక్వా రంగాన్ని కాపాడాలి. – కేవీ అప్పారావు, మోగల్లు, ఆక్వా రైతు -
అన్నదాత.. ఆక్వా జిల్లాకు రెండు కళ్లు
ఆకివీడు: వ్యవసాయం, ఆక్వా రంగాలు జిల్లాకు రెండు కళ్లులాంటివని, వాటి అభివృద్ధికి తగిన ప్రణాళికలు రూపొందిస్తామని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. మండలంలోని చినకాపవరం, రామయ్యగూడెం ప్రాంతాల్లోని ఆక్వా చెరువులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన వనరులుగా ఉన్న వ్యవసాయం, ఆక్వా రంగాన్ని అభివద్ధి చేసినప్పుడే జిల్లా ప్రగతి పథంలో ముందుకు వెళుతోందని అన్నారు. పారిశ్రామికంగా జిల్లా అంతగా అభివృద్ధి చెందలేదన్నారు. వరి రైతులు పడుతున్న ఇబ్బందుల్ని పరిశీలించి పరిష్కరిస్తున్నామన్నారు. ధాన్యానికి మద్దతు ధర లభించేందుకు, ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఆక్వా సాగులోని ఇబ్బందులను రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు తనదృíష్టికి తీసుకువచ్చారని తులిపారు. జిల్లాలో 67,518 హెక్టార్లలో ఆక్వా చెరువులున్నాయని, దీనిలో 21 వేల హెక్టార్లలో రొయ్యల సాగు చేస్తున్నారన్నారు. చేపల సాగులో మేత, ఇతరత్రా వినియోగంలో అధిక వ్యయం తగ్గించుకునేందుకు రైతులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. రొయ్యల సాగు తీవ్ర ఒడిదుడుకుల్లో ఉందని రైతులు చెబుతున్నారన్నారు. నష్టం అపారంగా ఉంటుందని, లాభాలు వస్తే అంతంత మాత్రమేనని రొయ్య రైతులు తెలిపారన్నారు. రొయ్యల ధరను సిండికేట్‌గా ఏర్పడి వ్యాపారులు తగ్గిస్తున్నారనే వాదనను క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు. రైయ్య రైతులకు కోల్డ్ స్టోరేజ్‌లు, ప్రాసెసింగ్ యూనిట్లు తదితర సమ్యలున్నాయని చెప్పారు. వాటి పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. జిల్లాకు ప్రధాన ఆదాయం వనరుగా ఉన్న ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ధాన్యానికి «మద్దతు ధర ప్రకటించినట్లుగా రొయ్యలు, చేపల ధరలు ప్రభుత్వం ప్రకటించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెప్పారని కలెక్టర్ తెలిపారు. ఆక్వా జోన్ల ఏర్పాటుకు సన్నాహాలు జిల్లాలో ఆక్వా జోన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. ఆక్వా అభివృద్ధి జరిగితే జిల్లాలో తలసరి ఆదాయం పెరుగుతుందన్నారు. వరి రైతులకు ఇబ్బంది లేకుండా ఆక్వా రంగాన్ని ప్రోత్సహిస్తామన్నారు. కొత్తగా చెరువులు తవ్వేందుకు అనుమతులను జిల్లా స్టీరింగ్ కమిటీ సమావేశాల ద్వారా మంజూరు చేస్తామన్నారు. రొయ్య రైతుల్ని ఆదుకోవాలి రొయ్య రైతుల్ని ఆదుకోవాలని, ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని జాతీయ రొయ్య రైతుల సమాఖ్య అధ్యక్షుడు ఇందుకూరి మోహనరాజు, రొయ్య రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు వేగేశ్న సత్యనారాయణరాజు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. పంట చేతికి అందేంత వరకూ నమ్మకం లేదని, 20 నుండి 40 శాతం పంట వైరస్‌కు గురవుతుందని చెప్పారు. కౌంటింగ్ ఉన్న రొయ్యకు ధర లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఆక్వా రైతు, వైఎస్సార్ సీపీ నాయకుడు వేగేశ్న వెంకట్రాజు(యండగండి శ్రీను) మాట్లాడుతూ రొయ్యల ధర నికరంగా ఉండేలా చర్యలు తీసుకోవలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ వెంట ఆక్వా రైతులు, వైఎస్సార్ సీపీ నాయకులు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు(సూరిబాబు), అల్లూరి తమ్మిరాజు, ఇందుకూరి సూర్యనారాయణరాజు, అల్లూరి సత్యనారాయణరాజు, మత్స్యశాఖ జేడీ ఎస్.అంజలి, డీడీ తిరపతయ్య, ఏడీ చాంద్ బాషా, నరసాపురం ఆర్డీఓ సలీం ఖాన్, ఎఫ్డీఓ మంగారావు ఉన్నారు. -
ఆక్వాకు వైరస్ గండం
* నష్టాల్లో రైతులు * మెలకువలు పాటించక పోవడంతోనే ఈ పరిస్థితి * అవగాహన ఏర్పరుచుకోవాలంటున్న మత్స్యశాఖ అధికారులు నిజాంపట్నం: ఆక్వా రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి. ప్రస్తుతం రొయ్యలకు వైరస్ సోకుతుండటంతో రైతులు భారీగా నష్టాలను చవిచూస్తున్నారు. 1990 ప్రాంతంలో తీరప్రాంతంలో ఉర్రూతలూగించిన ఆక్వాసాగు క్రమేణ వైరస్ వ్యాధుల ప్రభావానికి ఉనికే కనుమరుగైంది. కొన్ని సంవత్సరాలు ఆక్వా సాగు అంటేనే రైతుల్లో వణుకు పుట్టించింది. ఇందుకోసం తవ్విన చెరువులను తిరిగి రైతులు పంట భూములుగా మలుచుకోవటం ప్రారంభించి వరిసాగువైపు పయనించారు. తిరిగి ఇటీవల ఆక్వా సాగు ఆశాజనకంగా మారటం, ప్రకృతి ఆటుపోట్ల నడుమ వరిసాగు ప్రశ్నార్థకంగా మారుతుండటంతో తీరప్రాంతంలోని రైతులు దీనిపై దృష్టిసారించారు. అయితే సాగుపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవటం, సరైన మెలకువలు పాటించకపోవటంతో ఆదిలోనే నష్టాల బారిన పడుతున్నారు. ఆక్వాసాగు చేస్తున్న చెరువుల్లో సుమారు నెలరోజుల లోపే వైరస్ వ్యాధులు సోకి రొయ్య పిల్లలు చనిపోతున్నాయి. ప్రమాణాలు పాటించకపోవటంతోనే.. రొయ్యలను పట్టిన తరువాత చెరువులోని నీటిని పూర్తిగా ఖాళీ చేసి నెలరోజుల పాటు ఎండబెట్టాలి. ఆసమయంలో బ్లీచింగ్, బ్యాక్టీరియా నివాణకు మందులను చల్లాల్సి ఉంది. అయితే చెరువులోని రొయ్యలను పట్టిన తరువాత ఈజాగ్రత్తలు పాటించకుండానే తిరిగి రొయ్య పిల్లలను వేసి సాగుకు సిద్ధమవుతుండటంతో వైరస్ వ్యాధులు సోకుతున్నాయి. వరికి ప్రత్యామ్నాయంగా వెనామి రొయ్యపై దృష్టి.. గత రెండు మూడు సంవత్సరాలుగా సాగునీరు లేక ఖరీఫ్ ప్రశ్నార్థకంగా మారటంతో తీరప్రాంతంలోని రైతులు ప్రత్యామ్నాయంగా ఆక్వాసాగువైపు మళ్లుతున్నారు. సాగు చేయాలనే ఆదుర్దాతో, పూర్తి అవగాహన ఏర్పరుచుకోకుండా, పూర్తిస్థాయిలో నియమాలు పాటించకుండా చేస్తున్న సాగు నష్టాలనే తెచ్చిపెడుతున్నది. రైతులు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించి సాగును చేపడితే తప్పనిసరిగా ఆక్వా ఆశాజనకంగా ఉంటుందని మత్స్యశాఖ అధికారులు తెలుపుతున్నారు. తాము ఇచ్చే సూచనలు, సలహాలు పాటించి సాగును చేపట్టాలని కోరుతున్నారు. అధికారుల సూచనలు ఇవీ.. నీటి గుణాలు ఎప్పకప్పుడు పరీక్షించుకోవాలి. ప్రాణవాయువు(డి.ఒ) ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం పరిశీలించాలి. వారానికి ఒకసారి నీటి పీ.హెచ్, ఆల్సలినీటి, విషవాయువులైన అమ్మోనియా, నైట్రేట్, హైడ్రోజన్‌సలై్ఫడ్ వంటివి పరీక్షించుకోవాలి. వెనామి సాగులో నిరంతరం ఏరియేటర్లు వాడుకోవాలి. ప్రతి 300 కేజీల రొయ్యలకు ఒక హెచ్‌పీ ఏరియేటర్ అవసరం. బయో సెక్యూరిటీ.. చెరువు ప్రవేశ ద్వారం వద్ద చేతులు, కాళ్లు కడుగుకొనేందుకు వీలుగా పొటాషియం పెర్మాంగ్‌నేట్ ద్రావణం ఉంచాలి. చెరువు గట్ల వెంబడి పీతలు వంటి వైరెస్ వాహకాల ప్రవేశాన్ని నిరోధించేందుకు వీలుగా ఆరమీటరు ఎత్తులో వల (క్రాబ్‌ఫెన్సింగ్) ఏర్పాటు చేయాలి. ప్రతి చెరువుకు వేర్వేరు పనిముట్లు(వలలు,మగ్గు వంటివి) వాడుకోవాలి. శుభ్ర పరిచే వ్యవస్థ తప్పనిసరి.. సాగు తొలిదశ నుంచి ఈ జాగ్రత్తలు, సూచనలు పాటించాలి. చెరువులో రొయ్యపిల్లల్ని వదలడం, చెరువులో నీటిని పెట్టుకుని తక్కువ మోతాదులో సేంద్రియ, రసాయనిక ఎరువులు వాడుకోవాలి. రొయ్యపిల్లల నాణ్యత, ఒత్తిడి పరీక్షలు చేసుకుని పి.ఎల్ 10 నుంచి 12 రోజులు ఉన్నవాటిని చదరపు మీటరుకు 60 పిల్లలకు మించకుండా విడుదల చేయాలి. – ఎ.రాఘవరెడ్డి, ఎఫ్‌డీవో