ఒకటో తరగతి బాలిక పట్ల అసభ్య ప్రవర్తన
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు ఏడేళ్ల విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మాదన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన ఒకటో తరగతి విద్యార్థిని స్థానిక మదర్సాలో రోజూ ఓ గంట అరబిక్ నేర్చుకుంటోంది. మదర్సాలో అరబిక్ బోధించే ఇమ్రాన్ అనే బోధకుడు మూడు రోజుల క్రితం బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.
భయంతో వణికిపోయిన చిన్నారి విషయాన్ని ఇంట్లో చెప్పకుండా తనలో తానే కుమిలిపోయింది. అయితే, బాలిక దిగులుగా ఉండడాన్ని స్కూల్లో టీచర్లు గమనించారు. దీంతో శుక్రవారం ఆమె తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడడంతో ఇమ్రాన్ చేసిన పనిని చిన్నారి వెల్లడించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.