'అరంగేట్రం' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: అరంగేట్రం
నటీనటులు: శ్రీనివాస్ ప్రభన్, ముస్తఫా ఆస్కారీ, రోషన్ షేక్, పూజా బోరా, శ్రీలం శ్రీవల్లి, సాయిశ్రీ వల్లపాటి, కీర్తన, ఇందు, అనిరుధ్ తదితరులు
నిర్మాణసంస్థ: మహీ మీడియా వర్క్స్
దర్శకత్వం: శ్రీనివాస్ ప్రభన్
నిర్మాత: మహేశ్వరి
సంగీతం: గిడియన్ కట్టా
సినిమాటోగ్రఫీ: బురాన్ షేక్
ప్రొడక్షన్ డిజైనర్, కో డైరెక్టర్: రమేశ్ బాబు చిన్నం (గోపి)
అరంగేట్రం కథేంటంటే..
సిటీలో జనవరి 13న ఓ అమ్మాయిని సైకో హత్య చేస్తాడు. మళ్లీ ఫిబ్రవరి 13న ఇంకో అమ్మాయిని హత్య చేస్తాడు. ఇలా సిటీలో వరుసగా ప్రతీ నెలా పదమూడో తేదీన ఓ అమ్మాయిని సైకో చంపేస్తుంటాడు. సైకోని ఆపేందుకు పోలీసు యంత్రాంగం ఎంతగానో ప్రయత్నిస్తుంటుంది. కానీ ఆ సైకో జాడ దొరకదు. తర్వాత వైష్ణవి అనే అమ్మాయిని చంపేందుకు అతడు సిద్దపడతాడు. ఈ క్రమంలో హీరో శ్రీనివాస్ ప్రభన్ (శ్రీనివాస్ ప్రభన్) వైష్ణవి ఇంట్లోనే ప్రత్యక్షం అవుతాడు. అసలు వైష్ణవికి శ్రీనివాస్‌కు ఉన్న లింక్ ఏంటి? ఆ సైకో ఎందుకు ఇలా వరుసగా అమ్మాయిలను చంపుతూ వెళ్తున్నాడు? సైకో జీవితంలోని ఫ్లాష్ బ్యాక్ ఏంటి? సైకోకి, శ్రీనివాస్‌కు ఉన్న మధ్య ఉన్న లింక్ ఏంటి? చివరకు సైకో ఏమయ్యాడు? శ్రీనివాస్ ప్రభన్ ఏం చేశాడు? అనేది కథ.
ఎలా ఉందంటే..
సస్పెన్స్ థ్రిల్లర్లు, సైకో డ్రామాలు ఓ వర్గానికి ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే వాటిని నడిపించే ట్రాక్ మాత్రం ఒకేలా ఉంటుంది. సైకో థ్రిల్లర్ జానర్ల కథలు కొత్తగా ఏమీ ఉండవు. కానీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కథను రాసుకుంటే మాత్రం అందరినీ ఆకట్టుకోవచ్చు. ఈ అరంగేట్రం సినిమాకు దర్శకుడు కూడా అదే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో సఫలమయ్యాడు. ఇక్కడ హీరోనే దర్శకుడు అయినప్పటికీ రెండుచోట్లా రాణించాడు.
(ఇది చదవండి: ఆయన పరిస్థితిని చూస్తే భయమేసింది: మహేశ్)
ప్రథమార్థంలో వచ్చే ప్రశ్నలకు ద్వితీయార్థంలో సమాధానం ఇచ్చినట్టుగా ఉంటుంది. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మెరుగ్గా ఉంది. సైకో చేత కూడా కామెడీ చేయించే ప్రయత్నం వినూత్నంగా ఉంటుంది. చివరకు ముగింపు కాస్త భారంగా అనిపిస్తుంది. ఎమోషనల్ క్లైమాక్స్‌తో ముగించడం కూడా ఓ సాహసమే.
ఎవరెలా చేశారంటే..
అరంగేట్రం మూవీలో ప్రధానంగా కనిపించేది హీరో, విలన్ పాత్రలే. హీరోగా శ్రీనివాస్ ప్రభన్ నటన ఆకట్టుకుంటుంది. యాక్షన్ సీక్వెన్స్, ఎమోషనల్ సీన్స్ ఇలా అన్ని రకాల సీన్లలో మెప్పించాడు. కొన్ని సీన్లలో నవ్వించే ప్రయత్నం చేశాడు. విలన్‌గా సైకో పాత్రలో ముస్తఫా అస్కరి భయపెట్టించాడు. అనిరుధ్, పూజా, లయ, రోషన్ ఇలా అందరూ తమ తమ పాత్రల్లో ఓకే అనిపిస్తారు. జబర్దస్త్ సత్తిపండు కామెడీ ఆకట్టుకుంటుంది.
సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు పెద్ద అసెట్ బ్యాగ్రౌండ్ స్కోర్. గిడియన్ కట్టా నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. ఓ పాటను రొమాంటిక్‌గా తెరపై చక్కగా తెరకెక్కించారు. బురాన్ షా కెమెరాపనితనం పర్వాలేదనిపిస్తుంది. మధు తన ఎడిటింగ్‌తో ఓకే అనిపిస్తాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
(ఇది చదవండి: ఈ సినిమాలో ఆ సీన్స్ కూడా ఉంటాయి: బిచ్చగాడు హీరో)