అబ్బురం.. అరవ దాసు సాహస విన్యాసాలు
నెల్లూరు(బృందావనం) : ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాలన్న ఆశయంతో నెల్లూరుకు చెందిన అరవ దాసు ప్రదర్శించిన సాహస విన్యాసాలు వీక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్సు, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సు ప్రతినిధుల ఎదుట ప్రదర్శించిన సాహసాలు అబ్బురపరిచాయి. స్థానిక సుబేదారుపేట సెయింట్ జాన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో బుధవారం జరిగిన ‘రికార్డుల నమోదు’ కార్యక్రమం విస్మయానికి గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే... స్థానిక కపాడిపాళేనికి చెందిన అరవ దాసు గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించాలన్న సంకల్పంతో తొమ్మిది కేజీల బరువు ఉన్న సిమెంట్ దిమ్మెను బొటనవేలి గోరుకు ఇనుప తీగ కట్టి ఐదు అడుగులకుపైగా ఎత్తి 74 సెకన్ల పాటు రెండు పర్యాయాలు ప్రదర్శించారు.
అనంతరం 4.800 కేజీల బరువు ఉన్న రెండు కాలుతున్న గడ్డపారల(మొత్తం 9.600 కేజీలు)ను రెండు చేతులతో పట్టుకుని కర్రసాములో కర్రలను తిప్పినట్లు నిమిషం 16 సెకన్ల పాటు ప్రదర్శించి హర్షధ్వానాలు అందుకున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించి, రికార్డు నమోదు చేసేందుకు హైదరాబాద్ నుంచి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్సు సౌత్ ఇండియా చీఫ్ కో-ఆర్డినేటర్ బింగి నరేంద్రగౌడ్, వండర్బుక్ ఆఫ్ రికార్డ్సు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల చీఫ్ కో-ఆర్డినేటర్ గుర్రం స్వర్ణశ్రీ హాజరయ్యారు.
అద్భుత ప్రదర్శన
నెల్లూరులో అరవ దాసు ప్రదర్శించిన విన్యాసాలు అద్భుతం. ఎంతో క్లిష్టతరమైనవి. ఆయన 57 ఏళ్ల వయస్సులో గోటితో బరువును ఎత్తడం ప్రపంచ రికార్డుగా భావిస్తున్నాం. ఈ విషయాన్ని గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నమోదు చేసే వారికి దృష్టికి తీసుకెళ్తాం. పేదరికంతో బాధపడుతున్న అరవ దాసును జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రోత్సహించి, జీవనభృతికి కల్పించాలని కోరుతున్నాం.
- -బింగినరేంద్రగౌడ్, గుర్రం స్వర్ణశ్రీ, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్సు, వండర్బుక్ ఆఫ్ రికార్డ్సు ప్రతినిధులు
ప్రోత్సాహం కావాలి
మంచాలు అల్లుకుని జీవనం సాగిస్తున్నాను. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించాలని ఉంది. ఇందు కోసం 1991 సంవత్సరం నుంచి పలు విన్యాసాలు చేశాను. సాహస క్రీడలు ప్రదర్శిస్తున్నాను. ప్రోత్సాహం కావాలి. కుమార్తెలు అరవ అశ్విని పీజీ, షీబారాణి డిగ్రీ చదువుతున్నారు. గతంలో గడ్డంతో ఇటుకలు, గొంతుకు ఇనుప కడ్డీతో ట్రాక్టర్ను నెట్టడం, జట్టుతో లాగడం తదితర విన్యాసాలు నెల్లూరులో ప్రదర్శించాను.
- అరవ దాసు