Aravelly Avanish Rao
-
World Cup Final: తెలుగులో మాట్లాడుకున్న క్రికెటర్లు.. వైరల్ వీడియో
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న అండర్ 19 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న తెలంగాణ ప్రాంత ఆటగాళ్లు అవనీశ్ రావు, అభిషేక్ మురుగన్ తెలుగులో మాట్లాడుకున్నారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ సమయంలో వికెట్‌కీపర్ అవనీశ్ రావు, స్పిన్ బౌలర్ అభిషేక్ మురుగన్‌తో హైదరాబాద్ యాసలో సంభాషించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. విదేశీ గడ్డపై వరల్డ్‌కప్ లాంటి మెగా ఈవెంట్ ఫైనల్లో ఇద్దరు తెలుగు వాళ్లు మాట్లాడుకుంటుంటే వినసొంపుగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరు క్రికెటర్లు గ్రౌండ్ లో తెలుగులో మాట్లాడుతుంటే వినడానికి హాయిగా ఉంటుంది కదూ.!! 🤩 మరి ఈరోజు U19 ఫైనల్స్ లో అదే జరిగింది 😃 మరి మీరు కూడా చూసేయండి.!! చూడండి ICC U19 World Cup Final#INDU19vAUSU19 లైవ్ మీ #StarSportsTelugu & Disney + Hotstar లో#U19WorldCupOnStar pic.twitter.com/UPX0xz7zCd — StarSportsTelugu (@StarSportsTel) February 11, 2024 ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి దిశగా పయనిస్తుంది. ఆసీస్ నిర్ధేశించిన 254 పరుగుల లక్ష్య ఛేదనలో యువ భారత్ చేతులెత్తేసింది. 36 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 136/8గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే ఇంకా 118 పరుగులు చేయాలి చేతిలో కేవలం మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఏదైన మహాద్బుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో టీమిండియా గట్టెక్కలేదు. మురుగన్ అభిషేక్ (23), నమన్ తివారి (2) క్రీజ్‌లో ఉన్నారు. భారత స్టార్ త్రయం ముషీర్ ఖాన్ (22), ఉదయ్ సహారన్ (8), సచిన్ దాస్ (9) డు ఆర్ డై మ్యాచ్‌లో చేతులెత్తేశారు. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (47) కొద్దో గొప్పో ఆడేందుకు ప్రయత్నించాడు. ఆర్శిన్ కులకర్ణి 3, ప్రియాన్షు మోలియా 9, అవనీశ్ 0, రాజ్ లింబాని 0 పరుగులకు ఔటయ్యారు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో హర్జస్ సింగ్ (55) అర్దసెంచరీతో రాణించగా.. హ్యారీ డిక్సన్ (42), హగ్ వెబ్జెన్ (48), ఒలివర్ పీక్ (46 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో రాజ్ లింబాని 3, నమన్ తివారి 2, సౌమీ పాండే, ముషీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. -
చెలరేగిన భారత బౌలర్లు.. 100 పరుగులకే ఆలౌట్.. ఘన విజయం
ICC Under 19 World Cup 2024- India U19 won by 201 runs: ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్-2024లో యువ టీమిండియా ఘన విజయం సాధించింది. ఐర్లాండ్‌ను ఏకంగా 201 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. సమిష్టి ప్రదర్శనతో ఈ మేరకు భారీ గెలుపు నమోదు చేసింది. సౌతాఫ్రికాలోని బ్లూమ్ఫౌంటేన్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ఆదర్శ్ సింగ్ 17, అర్షిన్ కులకర్ణి 32 పరుగులు చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ 106 బంతుల్లో 118 పరుగులు సాధించాడు. ఇక ముషీర్‌తో పాటు కెప్టెన్ ఉదయ్ సహారన్ 75 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ అరవెల్లి అవినాష్ రావు 22, సచిన్ ధ్యాస్ 21(నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. భారీ లక్ష్యం విధించి ముషీర్, ఉదయ్ ఇన్నింగ్స్ కారణంగా యవ భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి ఏకంగా 301 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఐరిష్ జట్టును భారత బౌలర్లు ఓ ఆటాడుకున్నారు. ఓపెనర్లలో జోర్డాన్ నీల్(11)ను స్పిన్నర్ సౌమీ పాండే పెవిలియన్‌కు పంపి శుభారంభం అందించగా.. పేసర్ నమన్ తివారి ఐరిష్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. నమన్ తివారి దెబ్బకు ఓపెనర్ రియాన్ హంటర్(13)ను అవుట్ చేసిన నమన్.. మిడిలార్డర్‌ను కకావికలం చేశాడు. అతడి దెబ్బకు ఐర్లాండ్ స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోగా.. సౌమీ పాండే సైతం మరోసారి విజృంభించాడు. ఈ నేపథ్యంలో 29.4 ఓవర్లలోనే ఐర్లాండ్ కథ ముగిసింది. బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో వంద పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ ఏకంగా 201 రన్స్ తేడాతో జయభేరి మోగించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతడే భారత బౌలర్లలో నమన్ తివారికి అత్యధికంగా నాలుగు, సౌమీ పాండేకు మూడు వికెట్లు దక్కగా.. ధనుశ్ గౌడ, మురుగన్ అభిషేక్, ఉదయ్ సహారన్ తలా ఓ వికెట్ పడగొట్టారు. ఇక భారత్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన సెంచరీ వీరుడు ముషీర్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా ఈ ఐసీసీ ఈవెంట్ తాజా ఎడిషన్‌లో భారత్‌కు ఇది రెండో విజయం. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 84 పరుగుల తేడాతో సహారన్ సేన చిత్తు చేసింది. ఇక తాజా విజయంతో గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచింది యువ భారత జట్టు. చదవండి: INDA& U19 WC: ఒకేరోజు అటు అన్న.. ఇటు తమ్ముడు సెంచరీలతో ఇరగదీశారు! Another huge win, this time by 201 runs, has consolidated India’s position at the top of the Group A table 👏 Match Highlights 🎥 #U19WorldCup pic.twitter.com/U1LucpWNcI — ICC (@ICC) January 25, 2024 -
IPL 2024: ముస్తాబాద్ నుంచి ఐపీఎల్ దాకా.. సీఎస్కేకు ఆడే ఛాన్స్!
ముస్తాబాద్(సిరిసిల్ల): క్రికెట్ అండర్–19 ప్రపంచ కప్ టోర్నీకి ఎంపికై , సంచలనం సృష్టించాడు 18 ఏళ్ల ఎరవెల్లి అవనీష్‌రావు. అంతేకాదు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుకు ఆడబోతున్నాడు కూడా! రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన అవనీష్రావును.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.20 లక్షలకు దక్కించుకుంది. దుబాయ్‌లో గత మంగళవారం జరిగిన ఐపీఎల్-2024 వేలంలో అతడిని సొంతం చేసుకుంది. తొమ్మిదేళ్ల వయసులో ఆట ప్రారంభం వికెట్ కీపర్‌గా, లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్‌గా రాణిస్తున్న అవనీష్‌రావు.. నెల రోజుల వ్యవధిలో ఆసియా కప్, ఇండియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ట్రై సీరిస్‌తోపాటు.. జనవరి 19 నుంచి జరగనున్న అండర్–19 వరల్డ్ కప్ టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ఇప్పుడు ఐపీఎల్లో పెద్ద జట్టుగా పేరుగాంచిన చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని తీసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ కుమారుడు పోతుగల్‌కు చెందిన ఎరవెల్లి బాలకిషన్‌రావు సబ్‌రిజిస్ట్రార్‌గా రిటైరయ్యారు. ఆయన కుమారుడు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ లక్ష్మణ్‌రావు–సుష్మ దంపతుల కుమారుడు అవనీష్‌రావు బాల్యం హైదరాబాద్‌లోనే గడిచింది. ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తన తొమ్మిదేళ్ల వయసులోనే క్రికెట్ ఆడటం ప్రారంభించగా తండ్రి ప్రోత్సహించారు. నిత్యం జింఖానా మైదానంలో 10 గంటలకు పైగా ప్రాక్టీస్ చేసేవాడు. పాఠశాల చదువు సమయంలోనే అవనీష్‌రావు హైదరాబాద్ అండర్–14, 16కు ఎంపికయ్యాడు. హెచ్‌సీఏ సైతం అతని ప్రతిభ చూసి, చాలెంజర్స్ ట్రోఫీకి ఎంపిక చేసింది. బీసీసీఐ దృష్టిలో పడగా, అండర్–19 భారత జట్టుకు ఎంపిక చేసింది. తక్కువ వయసులో క్రికెట్లో రాణిస్తున్న అవనీష్‌రావు రాష్ట్ర యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆడమ్ గిల్‌క్రిస్ట్ స్ఫూర్తి.. చిన్నప్పటి నుంచి తనకు ఆడమ్ గిల్‌క్రిస్ట్ అంటే ఇష్టమని అవనీష్‌రావు తెలిపాడు. ఎడమ చేతివాటంతో ఆయన ఎంత ఫేమస్ అయ్యారో.. తాను కూడా అలా కావాలనుకున్నానని తెలిపాడు. తాను మొదట హైదరాబాద్‌లోని హిందూ మహావిద్యాలయలో చేరి, కోచ్ చందు ఆధ్వర్యంలో ఆటపై పట్టు సాధించానని, అనంతరం ఇండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ అకాడమీలో చేరి, మరింత రాటుదేలినట్లు తెలిపాడు. పలు టోర్నీల్లో అవకాశాలు వచ్చాయని, అండర్–19 వరల్డ్ కప్‌కు ఎంపికవ్వాలనే లక్ష్యంతో నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రాక్టీస్ చేశానన్నాడు. తన లక్ష్యం భారత సీనియర్ జట్టుకు ఎంపిక కావడమేనని పేర్కొన్నాడు. చదవండి: ముంబై ఇండియన్స్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్!.. కెప్టెన్ దూరం!