చెలరేగిన భారత బౌలర్లు.. 100 పరుగులకే ఆలౌట్‌.. ఘన విజయం | ICC U19 WC 2024 Sarfraz Brother Ton India Beat Ireland By 201 Runs | Sakshi
Sakshi News home page

U19 WC: దంచికొట్టిన సర్ఫరాజ్‌ తమ్ముడు.. చెలరేగిన తివారి.. ఐర్లాండ్‌ చిత్తు

Published Thu, Jan 25 2024 9:03 PM | Last Updated on Thu, Jan 25 2024 9:16 PM

ICC U19 WC 2024 Sarfraz Brother Ton India Beat Ireland By 201 Runs - Sakshi

యువ టీమిండియా ఘన విజయం (PC: ICC X)

ICC Under 19 World Cup 2024- India U19 won by 201 runs: ఐసీసీ అండర్‌ 19 ప్రపంచకప్‌-2024లో యువ టీమిండియా ఘన విజయం సాధించింది. ఐర్లాండ్‌ను ఏకంగా 201 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. సమిష్టి ప్రదర్శనతో ఈ మేరకు భారీ గెలుపు నమోదు చేసింది.

సౌతాఫ్రికాలోని బ్లూమ్‌ఫౌంటేన్‌ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లు ఆదర్శ్‌ సింగ్‌ 17, అర్షిన్‌ కులకర్ణి 32 పరుగులు చేయగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ముషీర్‌ ఖాన్‌ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు.

ఈ రైట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌ 106 బంతుల్లో 118 పరుగులు సాధించాడు. ఇక ముషీర్‌తో పాటు కెప్టెన్‌ ఉదయ్‌ సహారన్‌ 75 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లలో వికెట్‌ కీపర్‌ అరవెల్లి అవినాష్‌ రావు 22, సచిన్‌ ధ్యాస్‌ 21(నాటౌట్‌) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.

భారీ లక్ష్యం విధించి
ముషీర్‌, ఉదయ్‌ ఇన్నింగ్స్‌ కారణంగా యవ భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి ఏకంగా 301 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఐరిష్‌ జట్టును భారత బౌలర్లు ఓ ఆటాడుకున్నారు. ఓపెనర్లలో జోర్డాన్‌ నీల్‌(11)ను స్పిన్నర్‌ సౌమీ పాండే పెవిలియన్‌కు పంపి శుభారంభం అందించగా.. పేసర్‌ నమన్‌ తివారి ఐరిష్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.

నమన్‌ తివారి దెబ్బకు
ఓపెనర్‌ రియాన్‌ హంటర్‌(13)ను అవుట్‌ చేసిన నమన్‌.. మిడిలార్డర్‌ను కకావికలం చేశాడు. అతడి దెబ్బకు ఐర్లాండ్‌ స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోగా.. సౌమీ పాండే సైతం మరోసారి విజృంభించాడు. 

ఈ నేపథ్యంలో 29.4 ఓవర్లలోనే ఐర్లాండ్‌ కథ ముగిసింది. బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో వంద పరుగులకే ఆలౌట్‌ అయింది. దీంతో భారత్‌ ఏకంగా 201 రన్స్‌ తేడాతో జయభేరి మోగించింది.

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అతడే
భారత బౌలర్లలో నమన్‌ తివారికి అత్యధికంగా నాలుగు, సౌమీ పాండేకు మూడు వికెట్లు దక్కగా.. ధనుశ్‌ గౌడ, మురుగన్‌ అభిషేక్‌, ఉదయ్‌ సహారన్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు. ఇక భారత్‌ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన సెంచరీ వీరుడు ముషీర్‌ ఖాన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

కాగా ఈ ఐసీసీ ఈవెంట్‌ తాజా ఎడిషన్‌లో భారత్‌కు ఇది రెండో విజయం. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 84 పరుగుల తేడాతో సహారన్‌ సేన చిత్తు చేసింది.  ఇక తాజా విజయంతో గ్రూప్‌-ఏ టాపర్‌గా నిలిచింది యువ భారత జట్టు.

చదవండి: INDA& U19 WC: ఒకేరోజు అటు అన్న.. ఇటు తమ్ముడు సెంచరీలతో ఇరగదీశారు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement