
Photo Courtesy: BCCI/IPL
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో మరో ఆసక్తికరపోరుకు రంగం సిద్ధమైంది. మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్ (MI)- గుజరాత్ టైటాన్స్ (GT) శనివారం అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో ముంబై ప్రస్తుత, గుజరాత్ మాజీ సారథి హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడు.
అయితే, హార్దిక్ రాకతో ముంబై తుదిజట్టులో ఎవరిపై వేటు పడుతుందనే అంశంపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కెప్టెన్ ఆగమనం వల్ల ముంబై మరింత పటిష్టంగా మారుతుందని.. అయితే, రియాన్ రికెల్టన్ లేదంటే.. విల్ జాక్స్ సేవలను జట్టు కోల్పోతుందని పేర్కొన్నాడు.
జాక్స్‌కే ఓటు వేస్తా
ఈ ఇద్దరిలో ఎవరిని కొనసాగించాలంటే తాను మాత్రం జాక్స్‌కే ఓటు వేస్తానని ఆకాశ్ చోప్రా స్పష్టం చేశాడు. ఈ మేరకు.. ‘‘హార్దిక్ పాండ్యా జట్టులోకి రావడం ముంబైకి భారీ ఉపశమనం. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అతడు లేని లోటు గత మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది.
హార్దిక్ రాక వల్ల మిడిలార్డర్‌లో స్థిరత్వం చేకూరుతుంది. అయితే, అతడు వచ్చాడు కాబట్టి రియాన్ రికెల్టన్ లేదంటే విల్ జాక్స్.. ఈ ఇద్దరిలో ఒకరు తప్పుకోక తప్పదు. నేనైతే విల్ జాక్స్‌ను కొనసాగించాలని చెబుతా.
రికెల్టన్‌ను తప్పించండి
ఎందుకంటే గతంలో అతడు ఈ వేదికపై విధ్వసంకర శతకం బాదాడు. మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సిక్సర్లు బాదాడు. అప్పుడు అతడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడేవాడు.
ఏదేమైనా.. రికెల్టన్‌ను తప్పించి.. విల్ జాక్స్‌ను కొనసాగిస్తూ.. రికెల్టన్ స్థానంలో రాబిన్ మింజ్‌ను వికెట్ కీపర్‌గా వాడుకుంటే సరిపోతుంది’’ అని కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
ఇక బౌలింగ్ విభాగం గురించి ప్రస్తావిస్తూ.. ‘‘పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రాకతో బౌలింగ్ యూనిట్ కూడా బలపడుతుంది. ట్రెంట్ బౌల్ట్, మిచెల్ సాంట్నర్‌లతో పాటు రీస్ టాప్లీను ఆడించవచ్చు. హార్దిక్ రాకతో ముంబై తుదిజట్టులో భారీ మార్పులు ఖాయం’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
అందుకే తొలి మ్యాచ్‌కు దూరం
ఇదిలా ఉంటే.. విల్ జాక్స్ గతేడాది ఆర్సీబీకి ఆడుతూ.. గుజరాత్‌తో మ్యాచ్‌లో 41 బంతుల్లోనే అజేయ శతకంతో మెరిశాడు. మరోవైపు.. గతేడాది ఆఖరి లీగ్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా.. హార్దిక్ పాండ్యాపై నిషేధం పడింది.
అందుకే ఐపీఎల్-2025లో ముంబై ఆరంభ మ్యాచ్‌కు అతడు దూరమయ్యాడు. కాగా ఈ ఏడాది తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడ్డ ముంబై.. నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది.
ఐపీఎల్-2025లో తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తుదిజట్టు
రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, రాబిన్ మింజ్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు.
బెంచ్: విఘ్నేశ్ పుతూర్, అశ్వనీ కుమార్, రాజ్ బవా, కార్బిన్ బాష్, కర్ణ్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, రీస్ టాప్లీ, ముజీబ్ ఉర్ రెహమాన్, హార్దిక్ పాండ్యా, క్రిష్ణన్ శ్రీజిత్, అర్జున్ టెండుల్కర్, బెవాన్ జేకబ్స్.
చదవండి: ఇంత త్వరగా వస్తాడనుకోలేదు: ధోనిపై సెహ్వాగ్ ఘాటు విమర్శలు