ప్రముఖ బెంగాలీ దర్శకుడు కన్నుమూత
కోల్కత్తా: ప్రముఖ బెంగాలీ దర్శకుడు అరవిందో ముఖర్జీ (96) బుధవారం తన నివాసంలో కన్నుమూశారు. ఆయన ఎన్నో హాస్య చిత్రాలను తనదైన శైలితో విభిన్నంగా తెరకెక్కించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. అరవిందో ముఖర్జీ 1919 జూన్ 18న బిహార్‌లోని కాతిహార్లో జన్మించారు. వైద్య విద్య మధ్యలో వదలి, ఆయనకు ఆసక్తి కల్గిన సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఆయన మొదటి సినిమా ‘కిచూఖోన్’తో 1959లో రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యారు.
ముఖర్జీ నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 26 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అంతేకాకుండా మూడు టెలీ ఫిలింలు, అందరి అభిరుచులకు అనుగుణంగా ఉండే కుటుంబపరమైన కథతో అద్భుతమైన ఓ టీవీ సీరియల్‌ను నిర్మించారు. ఆయన భార్య గతంలోనే మృతి చెందగా, ఆయనకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు.