ముందు ఇనుము వాడింది ఏపీలోనే!
సాక్షి, అమరావతి బ్యూరో: దేశంలో మొదటిసారిగా ఇనుము వాడింది సింధు నాగరికత ప్రజలని ఇన్నాళ్లూ అనుకున్నాం. కానీ వారి కంటే 500 ఏళ్ల ముందే.. అది కూడా ఏపీలో.. ముందుగా ఇనుమును వాడారని మీకు తెలుసా? గోదావరి నదీ తీరాన మెగాలిథిక్ నాగరికత కాలంలో ఇనుప పనిముట్లు వాడినట్లు ఏపీ పురావస్తు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా సింధు నాగరికత కాలం నాటి ప్రజల కంటే దక్షిణ భారతదేశంలో విలసిల్లిన మెగాలిథిక్ నాగరికత కాలం నాటి ప్రజలు ఆధునికంగా ముందున్నారని స్పష్టమైంది. పుణేకు చెందిన డెక్కన్ కాలేజీ సహకారంతో పురావస్తు శాఖ పోలవరం ముంపు గ్రామాల్లో జరుపుతున్న పరిశోధనలు ఈ విషయాన్ని నిర్ధారించడం విశేషం.
బయటపడ్డ మెగాలిథిక్ అవశేషాలు..
పోలవరం ముంపు గ్రామాల్లో పురావస్తు శాఖ 4 నెలలుగా పరిశోధనలు చేస్తోంది. డెక్కన్ కాలేజ్ భాగస్వామ్యంతో తవ్వకాలు చేపడుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాయునిపేట, పశ్చిమగోదావరి రుద్రమకోట వద్ద వందలాది తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో మెగాలిథిక్ యుగం నాటి అవశేషాలు బయటపడ్డాయి. ప్రధానంగా ఆ కాలం నాటి పెద్ద పెద్ద సమాధులను కనుగొన్నారు. వాటిని తవ్వగా మానవుల ఎముకలు, ఇనుప పరికరాలు, అలంకరణ రాళ్లు, మట్టిపాత్రలు బయటపడ్డాయి.
మెగాలిథిక్ నాగరికత అంటే..
ఆదిమానవ దశ నుంచి పరిపక్వతతో కూడిన కుటుంబ జీవనానికి మధ్య ఉన్న సంధి దశనే మెగాలిథిక్ నాగరికత అంటారు. క్రీ.పూ.3,000 నుంచి క్రీ.పూ.1,000 మధ్య ఈ నాగరికత దక్షిణ భారతదేశంలో విలసిల్లింది. సింధులోయ నాగరికతలో క్రీ.పూ.2,500 నుంచి క్రీ.పూ.1,750 మధ్య ఇనుము వాడినట్లు పరిశోధకులు నిర్ధారించారు. కానీ అంతకంటే దాదాపు 500 ఏళ్ల క్రితమే మెగాలిథిక్ నాగరికతలో ఇనుము వాడినట్లు పురావస్తు పరిశోధనల్లో వెల్లడైంది. దీంతో నాటి మానవుల జీవన శైలి మీద పరిశోధనలు చేస్తే మరింత సమాచారం లభిస్తుందని భావిస్తున్నారు. తవ్వకాల్లో బయల్పడిన ఎముకల ఆధారంగా అప్పటి మానవుల డీఎన్ఏ మ్యాపింగ్ చేయించాలని పురావస్తు శాఖ కమిషనర్ వాణీమోహన్ నిర్ణయించారు.