పోలీస్ స్టేషన్ ఎదుటే హిట్ అండ్ రన్: టీసీఎస్ ఉద్యోగిని మృతి
ముంబై: పోలీస్ స్టేషన్ ఎదుటే వాహనంతో ఓ యువతిని ఢీకొట్టి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ప్రమాద స్థలంలోనే పడిఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. 20 నిమిషాల తర్వాత పోలీసులకు సమాచారం రావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యం కావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. బుధవారం రాత్రి ముంబై గోర్గాన్ ప్రాంతం (తూర్పు)లోని వన్రాయ్ పోలీస్ స్టేషన్ ఎదుట జరిగిన ఈ హిట్ అండ్ రన్ ఘటనలో టాటా కన్సల్టెన్సీ ఉద్యోగిని అర్చనా పాండ్య (22) మరణించింది.
అందేరిలో నివసిస్తున్న అర్చన విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు ఆటో కోసం వేచి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆమెను ఢీకొట్టిన వాహనం వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసుల ఫోన్ చేసి ప్రమాద జరిగిన విషయాన్ని తనకు చెప్పారని అర్చన సోదరుడు సిద్ధార్థ పాండ్య చెప్పారు. తానుఏ ఆస్పత్రికి వెళ్లే సమయానికి అర్చన మరణించినట్టు వైద్యులు తెలిపారంటూ సిద్ధార్థ కన్నీటీపర్యంతమయ్యాడు.