నిన్న మామ.. నేడు అల్లుడు
► ఒకరికొకరు అంబులతో దాడి
► 24 గంటల్లో మామ, అల్లుడి మృతి
► అర్ధవీడు ఇందిరా నగర్లో ఘటన..
అర్ధవీడు :
మామ, అల్లుడు పరస్పర అంబుల దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన అల్లుడు రిమ్స్‌లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందాడు. వీరిద్దరూ బుధవారం రాత్రి అంబులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో మామ అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. వివరాలు.. దోర్నాల మండలం కొర్రప్రోలు గిరిజన తండాకు చెందిన ఉడతల గురన్న (30)కు ఇద్దరు బార్యలు. మొదటి భార్య దుర్గమ్మకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇందిరా నగర్‌కు చెందిన పులసల వెంకటేశ్వర్లు కుమార్తె గురమ్మను గురన్న (30) రెండో వివాహం చేసుకున్నాడు.
గురమ్మ ఈ నెల 5వ తేదీన కుమారుడికి జన్మనిచ్చింది. బిడ్డ పుట్టినప్పటి నుంచి తన భార్యను కాపురానికి పంపాలంటూ గురన్న అత్తాగారింట్లోనే ఉంటున్నాడు. కుమార్తెను మూడో నెల తర్వాత కాపురానికి పంపుతానని మామ వెంకటేశ్వర్లు అల్లుడితో తెగేసి చెప్పాడు. ఇద్దరూ మద్యం తాగి గొడవకు దిగారు. ఎదురెదురుగా అంబులు వేసుకున్నారు. వెంకటేశ్వర్లు గొంతులో అల్లుడు వేసిన అంబు దిగడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మామ అంబు వేయడంతో అల్లుడు గురన్న పొట్టలో దిగబడింది. ఆయన్ను చికిత్స కోసం తొలుత మార్కాపురం, ఆ తర్వాతో రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ గురన్న కూడా మృతి చెందాడు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
సంఘటన స్థలాన్ని మార్కాపురం డీఎస్పీ శ్రీహరిబాబు, సీఐ శ్రీనివాసరావులు గురువారం పరిశీలించారు. వెంకటేశ్వర్లు బంధువుల నుంచి వివరాలు సేకరించారు. అర్ధవీడు ఎస్ఐ జి.కోటయ్య రిమ్స్‌కు వెళ్లి మృతదేహానికి పంచనామా చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.