పౌరసరఫరాలను పటిష్టం చేస్తాం
=గ్రామ స్థాయికి సంక్షేమ పథకాలు తీసుకెళ్తాం
= విద్య, వైద్య ఆరోగ్యశాఖల పటిష్టతకు చర్యలు
= సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత
= ఆధ్యాత్మిక జిల్లాకు రావడం పూర్వజన్మ సుకృతం
= ‘సాక్షి’తో జాయింట్ కలెక్టర్ బసంత్‌కుమార్
సాక్షి, చిత్తూరు: పేదలకు ఆహారం అందించే పౌరసరఫరాల విభాగం పారదర్శకతతో పనిచేసేందుకు ప్రాధాన్యం ఇస్తానని నూతన జాయింట్ కలెక్టర్ పి.బసంత్‌కుమార్ అన్నారు. పేదలకు అన్ని ర కాల పౌరసరఫరాలు సకాలంలో అందేలా చూస్తామని, జాప్యం నివారించేందుకు చర్యలు చేపడతామన్నారు. అక్టోబరు 11న జిల్లా జేసీగా బాధ్యతలు చేపట్టిన ఆ యన సమ్మె అనంతరం శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులను శాఖల వారీగా పిలిపించి మాట్లాడుతూ పాలన వ్యవహారాలపై పట్టుబిగించే దిశగా చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు రాష్ర్ట గవర్నర్ నర్సింహన్ వద్ద జాయింట్ సెక్రటరీగా, అంతకుముందు వివిధ శాఖల్లో ఉన్నత అధికారిగా పని చేసిన బసంత్‌కుమార్ జాయింట్ కలెక్టర్‌గా చిత్తూరు జిల్లాలో తొలిసారి బాధ్యతలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషిచేస్తామని ఁసాక్షిరూ.కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
చిత్తూరులో పోస్టింగ్ ఎలా భావిస్తున్నారు?
అధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి ఉన్న చిత్తూరు జిల్లాకు జాయింట్కలెక్టర్గా ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. గవర్నర్ వద్ద పని చేసిన అనుభవంతో సీఎం సొంత జిల్లాలో క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. నా పీయూసీ చదువు రెండేళ్లపాటు పలమనేరులో సాగింది. ఆ రకంగా చిత్తూరు జిల్లాతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది.
పాలనపరంగా మీ ప్రాధాన్యతలు?
ప్రభుత్వ విద్యావ్యవస్థ పటిష్టంగా ఉంటే అన్ని రంగాలు అభివృద్ధిలో ముందుకెళ్తాయి. ఈ క్రమంలో జిల్లాలో ప్రభుత్వ విద్యావస్థను ఇంకా బలోపేతం చేసి పేద విద్యార్థులకు గ్రామస్థాయి నుంచి నాణ్యమైన విద్య అందేలా దృష్టిపెడతాం. ఆ తరువాత కీలకమైనది ఆరోగ్యశాఖ. జిల్లాలోని పీహెచ్‌సీలు, ఏరియా ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు మెరుగుపరిచేందుకు, వీలైనన్ని ఎక్కువ వైద్యసదుపాయలు ప్రజలు అందుబాటులోకి తెచ్చేలా పనిచేస్తాం.
పౌరసరఫరాల వ్యవస్థను ఎలా సంస్కరిస్తారు?
అవినీతి ఆరోపణలు లేకుండా, నిజాయితీగా పారదర్శకతతో పౌరసరఫరాలు జరిగే విధంగా అధికారుల పనితీరును మెరుగుపరుస్తాం. పౌరసరఫరాలు అందజేయటంలో జరుగుతున్న జాప్యం నివారించటం, అవి సక్రమంగా ప్రజలకు అందేలా చూడ్డమే ప్రథమ ప్రాధాన్యం. త్వరలో జిల్లావ్యాప్తంగా పౌరసఫరాల గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తాం.
సంక్షేమపథకాల అమలు ఎలా?
ఆహారభద్రతతో పాటు, ఇప్పటికే అమలులో ఉన్న పింఛన్, రాజీవ్‌ఆరోగ్యశ్రీ, ఒక్క రూపాయికే కిలోబియ్యం వంటి సంక్షేమ పథకాలు గ్రామస్థాయిలో ప్రజలకు సరిగ్గా చేరేందుకు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తాం. లోపాలు, అవినీతి ఆరోపణలు ఉన్నట్లు తేలితే తక్షణం చర్యలు చేపడతాం. అభివృద్ధిపథకాల అమలులో రాష్ట్రంలో ఇతర జిల్లాలకు ఒక నమూనాగా ఉండేట్లు పనిచేస్తాం.
రెవెన్యూ పనితీరు మారుస్తారా?
మండల స్థాయిలో రెవెన్యూ వ్యవహారాల్లో చోటు చేసుకుంటున్న తీవ్ర జాప్యాన్ని నివారించేందుకు చర్యలు చేపడతాం. సమ్మెకారణంగా తహశీల్దారు కార్యాలయాల్లో 28వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని మీసేవల ద్వారా దరఖాస్తుదారులకు అందించేందుకు 15 రోజులు గడువు నిర్ణయించాం. ఇతర వ్యవహారాల్లోనూ రెవెన్యూ సిబ్బంది జాప్యం లేకుండా ప్రజా సమస్యలు పరిష్కరించేలా చూస్తాం. గ్రీవెన్స్‌సెల్, ప్రజావాణి కార్యక్రమాలను పటిష్టం చేస్తాం. ఒకసారి అర్జీ ఇచ్చిన ప్రజలు తిరిగి తిరిగి అదే అర్జీ ఇవ్వకుండా వారి సమస్య ఏ దశలో ఉంది, ఎప్పుడు పరిష్కారం అవుతుంది లేదంటే పరిష్కారం కాదా అన్న విషయం తెలిపే దిశగా దృష్టిపెడతాం.