ఆరె కటికల సమస్యల పరిష్కారానికి కృషి
మంత్రి జోగు రామన్న హామీ
హైదరాబాద్: ఆరె కటికల సమస్యల పరిష్కారానికి తన శాయశక్తులా కృషి చేస్తానని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మాటలు చెప్పడం కన్నా చేతల ద్వారా చూపించాలన్న తపన ఉందని పేర్కొన్నారు. పరిష్కార హామీని ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే ఇప్పించేలా కృషి చేస్తానని చెప్పారు. సోమవారం ఇక్కడ జరిగిన ఆరె కటిక పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో 53 శాతంగా ఉన్న బీసీలకు మంచి చేయాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని పేర్కొన్నారు. ఇందుకుగాను తనను ఒక ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కోరినట్లు తెలిపారు. బీసీలు ఫెడరేషన్లు కావాలని కోరుతున్నారని, కానీ, వాటి వల్ల ప్రయోజనం ఏమీ లేదని మంత్రి స్పష్టం చేశారు.
సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గోగికర్ సుధాకర్ మాట్లాడుతూ ఆరె కటికలకు ప్రభుత్వపరమైన నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని కోరారు. అరెకటికల సమస్యల పరిష్కారానికి డిసెంబర్ 7, 8 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సంఘం 31 జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, ఉపాధ్యక్షులను ఎన్నుకుని మంత్రి సమక్షంలో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, ప్రశాంత్, ఈశ్వర్‌చౌదరి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.