arepalli Mohan
-
కాంగ్రెస్ నుంచి ఆరుగురు నేతల బహిష్కరణ
సాక్షి, హైదరాబాద్: పార్టీ నియమాళికి వ్యతిరేకంగా పనిచేసిన ఆరుగురు తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఆపార్టీ క్రమశిక్షణా కమిటీ చర్యలు తీసుకుంది. పార్టీ అదేశాలను ఉల్లంఘించినందుకు ఆరేపల్లి మోహన్, రమ్యారావు, మన్నె కృష్ణ, సోయం బాపూరావు, నరేశ్ జాదవ్, పట్లోల్ల కార్తీక్ రెడ్డిలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఈమేరకు టీకాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ కోదండరెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే వరుసగా పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ ఖాళీ..? గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలకు కూడా షోకాజు నోటీసులు జారీచేయాలని భావిస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కోదండరెడ్డి తెలిపారు. టీఆర్ఎస్లో చేరిన శాసనసభ్యుల సంఖ్య ఇప్పటికే ఏడుకి చేరిన విషయం తెలిసిందే. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణపేట అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన శివకుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్‌లో... మిగిలింది ఒక్కరే! కాంగ్రెస్‌కు షాక్.. కారెక్కిన మాజీ ఎమ్మెల్యే -
కాంగ్రెస్‌కు షాక్.. కారెక్కిన మాజీ ఎమ్మెల్యే
సాక్షి, కరీంనగర్: లోక్‌సభ ఎన్నికల ముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టిషాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం కరీంనగర్లో పూరించనున్న విషయం తెలిసిందే. స్థానిక స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో సాయంత్రం 6 గంటలకు ఈ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో కీలక నేతలను ఆకర్షింకుచేందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను రంగంలోకి దింపారు. రెండు రోజుల కిందటే టీఆర్ఎస్ స్థానిక నేతలతో చర్చించిన మోహన్.. ఆదివారం కేటీఆర్‌తో సమావేశమై పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల ముందు సీనియర్ నేత పార్టీని వీడడం.. కాంగ్రెస్ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఎస్సీ రిజర్వ్ స్థానమైన మానకొండూర్ నుంచి 2009లో అసెంబ్లీకి ఎన్నికైన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన రెండుసార్లు ప్రత్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేతిలో ఓటమి చెందారు. -
పోలీస్‌స్టేషన్ పై గ్రామస్తుల దాడి
పండుగ రోజు జరిగిన గొడవకు సంబంధించి పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వేధింపులే అతడి మరణానికి కారణమని ఆరోపిస్తూ గ్రామస్తులు పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. గామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలానికి చెందిన కరవత్తుల శ్రావణ్(24) సహా మరికొందరిని కానిస్టేబుల్‌పై దాడికి సంబంధించి మంగళవారం సాయంత్రం స్టేషన్‌కు పిలిపించారు. ఈ సందర్భంగా పోలీసులు అతడిని వేధించారు. మళ్లీ బుధవారం స్టేషన్‌కు రావాల్సి ఉంటుందని చెప్పారు. గ్రామానికి వెళ్లిన శ్రావణ్ రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులతో కలిసి శ్రావణ్ మృతదేహంతో పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని బైఠాయించారు. వేధింపులే అతడిని బలి తీసుకున్నాయని ఆరోపించారు. తీవ్ర ఆగ్రహంతో పోలీస్‌స్టేషన్‌లోని సామగ్రిని ధ్వంసం చేశారు. ఎస్పీ సీరియస్.. కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లో యువకుడి ఆత్మహత్య, పోలీస్‌స్టేషన్‌పై గ్రామస్తుల దాడిని పోలీస్ బాస్ సీరియస్ గా తీసుకున్నారు. శ్రవణ్ మృత దేహంతో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌తోపాటు గ్రామస్తులు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇంటి ముందు ఆందోళన నిర్వహించారు. దీంతో ఎమ్మెల్యే పోలీసు అధికారులతో మాట్లాడారు. స్పందించిన ఎస్పీ కమలాసన్‌రెడ్డి వెంటనే మానకొండూర్ చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించిన ఆయన ఎస్సై వంశీకృష్ణతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మృతుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు రూ.10 లక్షల సాయం అందజేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. దీంతో గ్రామస్తులు శాంతించారు.