సృజనం: చీకటి కోయిల
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో రైలు బయల్దేరటానికి నాలుగైదు నిమిషాల ముందు ఎక్కిందా అమ్మాయి. చేతిలో పసివాడు, వెనుక నాలుగైదేళ్ల పాప. వాళ్లని దిగబెట్టడానికి వచ్చిన పెద్దమనిషి అన్ని జాగ్రత్తలు చెప్పాడు. ‘‘పిల్లలతో ఉంది కాస్త చూసుకోండమ్మా’’ అన్నాడు నా భార్య భారతితో. ఆమె మరేం ఫర్లేదన్నట్లు నవ్వుతూ తలాడించింది. దాదాపు ఆయన వయసువాళ్లం మేము ఇద్దరం అదే కూపేలో కనపడేసరికి ఆయనకి ధైర్యం కలిగినట్లుంది.
‘‘నేనింక దిగుతానమ్మా’’ అన్నాడాయన లేస్తూ.
‘‘సరే నాన్నా. దిగగానే ఫోన్ చేస్తాలే’’ అంది ఆ అమ్మాయి. వాళ్లిద్దరి మధ్య సంభాషణే కాకుండా మౌన విషాదమేదో సాగినట్లు నాకనిపించింది.
‘‘బాయ్... తాతయ్యా’’ చిన్నపిల్ల చెప్పింది. ఆయన వెళ్లబోతున్నవాడల్లా ఆగి వెనక్కి వచ్చి పిల్లని ముద్దుపెట్టుకొని ‘‘బాయ్ బంగారం’’ అన్నాడు. ఆ వెంటనే వడివడిగా కంపార్ట్మెంట్ దిగి వెళ్లిపోయాడు. ఆ అమ్మాయి ఆయనవైపు కూడా చూడకుండా తల దించుకొని ఉంది. అర్థం కానిదేదో మిగిలిపోయినట్లు అనిపించింది నాకు.
అయిదు నిమిషాల్లో ఆడవాళ్ల మధ్య మాటలు మొదలయ్యాయి. మా ఆవిడ సేకరించిన వివరాల ప్రకారం ఆ అమ్మాయి పేరు నిత్య. తల్లిదండ్రులు, అన్నయ్య హైదరాబాద్లో ఉంటున్నారు. పిల్లాడికి అయిదో నెల వచ్చిన తరువాత పురిటి మంచం ఒకసారి చూడాలని వచ్చి రెండు రోజులుండి వెళుతోంది. ఇవన్నీ మా ఆవిడ ప్రశ్నలకి జవాబులుగా వచ్చినవే తప్ప, ఆ పిల్ల తనంత తానుగా ఏ విషయమూ చెప్పలేదు.
‘‘మరి నిన్ను అత్తగారింటిలో దిగబెట్టడానికి మీవాళ్లు ఎవరూ రావట్లేదా?’’ అనే ప్రశ్నకు మాత్రం జవాబు రాలేదు.
‘‘నీకెందుకే అనవసరపు విషయాలు?’’ దాంతో మా ఆవిడ అప్పటిదాకా నిర్వహించిన పరిచయ కార్యక్రమం తాత్కాలికంగా ముగిసింది.
సాయంత్రం ఏడు దాటుతుండగా అనుకుంటాను ఆ పసిపిల్లవాడు ఏడవడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి ఎంత ప్రయత్నించినా ఆపలేదు. పాలిచ్చింది, ఆడించింది. అయినా ఫలితం లేదు. ఆమె కూతురు మాత్రం ఏమీ ఎరగనట్లు మా పక్కనే ఉన్న కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చుంది.
‘‘ఏమిటమ్మా అలా ఏడుస్తున్నాడు?’’ అంది నా భార్య సాయం చేసే ఉద్దేశంతో.
‘‘నిద్ర వచ్చినట్లుంది ఆంటీ’’ చెప్పిందామె.
‘‘కాస్త కాళ్ల మీదేసుకొని ఊపమ్మా’’ మరో సలహా ఇచ్చింది. ఆ అమ్మాయి కాళ్లు చాపుకొని పిల్లాణ్ని కాళ్లమీద వేసుకొని ఊపింది. అదీ ఫలించలేదు.
‘‘ఊరికే ఊపితే ఎలా? చక్కగా ఓ లాలి పాట పాడు’’ మళ్లీ మా ఆవిడ. ‘‘అసలు నీకెందుకే’’ అన్నాను నేను మళ్లీ.
ఆ అమ్మాయి తటపటాయించింది.
‘‘రైల్లో జనం ఉన్నారనా? పిల్లవాడికి పాడితే ఎవ్వరూ ఏమీ అనుకోరు. పాటలు పాడి నిద్రపుచ్చడం అలవాటు చేస్తే వాళ్ల తెలివితేటలు పెరుగుతాయని పెద్దవాళ్లు చెప్తారు.’’
‘‘ఊరుకోవే. పాపం ఆ పిల్లకి పాటలు వచ్చో రావో’’
ఆ పిల్ల చప్పున తలెత్తి నా వైపు చూసింది. ఆ కళ్లలో మళ్లీ ఏదో కథ కనపడింది కానీ అది తెలిసే లోపే తలదించుకుంది.
‘‘ఆ? మీరు మరీనూ. మాకంతా వచ్చి పాడామా? పాట ఎట్లా ఉన్న తల్లిపాటే జోలపాట పిల్లాడికి. దానివల్ల వాళ్లకి సంగీతం సాహిత్యం లాంటి అభిరుచులు వస్తాయి. మా అమ్మ చెప్పేది’’ అంటూ మళ్లీ ఆ అమ్మాయి వైపు చూసింది. ఆ అమ్మాయి నవ్వి ఊరుకుంది. పిల్లాడు ఇంకా అలాగే ఏడుస్తున్నాడు.
‘‘ఏమిటోనమ్మా మీ జనరేషనే అంత! ఒక లాలిపాట రాదు, ఓ ముగ్గెయ్యడం రాదు, ఉగ్గు అంటే ఏమిటో తెలియదు’’ ఎదురుగా ఉన్న పిల్ల నొచ్చుకుంటుందేమో అన్న ధ్యాస కూడా లేకుండా అంటోంది నా శ్రీమతి.
అటు వైపు నుంచి విశాలమైన చిరునవ్వుతో మాత్రమే సమాధానం వస్తోంది. చిత్రంగా ఉందా నవ్వు. అంతకు ముందు వాళ్ల నాన్న కూడా అంతే. చూస్తుంటే ఈ కుటుంబంలో అందరూ ప్రత్యేకమైన వ్యక్తుల్లా పరిచయం అవుతున్నారు. మా పక్కన కూర్చొని ఉన్న ఆ అమ్మాయి కూతురూ అంతే. చడీ చప్పుడు లేకుండా కిటికీలోంచి చూస్తూనే ఉంది తప్ప మాతో ఎవ్వరితో మాట్లాడలేదు. ఆ వయసు పిల్లల్లా ఒకటి కావాలని కానీ వద్దని కానీ పేచీ లేదు. వీళ్లంతా గుండె నిండా ఏదో బరువు మోస్తున్నారని నాకనిపించసాగింది.
‘‘అమ్మాయి... నాకు మీ అమ్మ వయసుంటుంది. చాదస్తం అనుకోకుండా నా మాట విను. మీ అమ్మని అడిగి రెండు లాలిపాటలు, ఓ రెండు మంగళహారతి పాటలు నేర్చుకో’’
‘‘నాకు పాటలు నేర్పించారండీ మా వాళ్లు’’ ఆ పిల్ల అంది.
‘‘మరింకేం! పాడటానికి సిగ్గా? పాడటానికి, పాలివ్వడానికి సిగ్గుపడితే ఎట్లా?’’ హుకూం జారీ చేసింది.
ఇక తప్పదని ఆ అమ్మాయి సిద్ధం అయ్యింది. రెండు కాళ్లు పద్మాసనంలా వేసుకొని, పిల్లాణ్ని ఒడిలో పెట్టుకొని, గొంతు సవరించుకుంది. పెదాలను తడుపుకొని, ఒకసారి మావైపు చూసి కళ్లు మూసుకుంది.
‘‘డోలాయాంచల డోలాయాం హరే డోలాయాం...’’
మేమిద్దరం ముఖముఖాలు చూసుకున్నాం. లాలిపాట అంటే ఎవరైనా ‘జో అచ్యుతానంద’ పాడుతారు. లేకపోతే ‘రామాలాలీ’ అని పాడుతారు. ఈ అమ్మాయేంటి ఈ పాట పాడుతోందన్న ఆశ్చర్యం మా ఆవిడ కళ్లలో కనపడుతోంది.
‘‘మీన కూర్మ వరాహా.. మృగపతి అవతారా..’’
పాట మత్తుగా సాగుతోంది. పిల్లాడు క్షణాల్లో కిక్కురుమనడం ఆపేశాడు. మా పక్కన కూర్చున్న పాప దిగి వెళ్లి తల్లి పక్కన కూర్చొని ఆమెనే చూస్తూ ఉండిపోయింది.
‘‘దానవారే... గుణశౌరే... ధరణీధర మరుజనక’’
అప్పటిదాకా ఐ-ఫోన్లో పాటలు వింటున్న సైడు బెర్త్ కుర్రాడు ఇయర్ ఫోన్స్ తీసేసి పాట విన్నాడు. ఆ అమ్మాయి గొంతు బాగున్న విషయం ఇంతకుముందు మాట్లాడినప్పుడే అర్థం అయింది. కానీ ఇంత శాస్త్రీయంగా పాడుతుందని నేను ఊహించలేదు. వరాళి రాగం రైలు శబ్దాల మధ్యలో నుంచి మత్తు మందులా పరుచుకుంది. ఆ మత్తులో అందరం జోగాడుతుండగానే పాట అయిపోయింది. సైడు బెర్త్ అబ్బాయి చప్పట్లు కొట్టాడు.
‘‘ఇంత బాగా పాడగలిగినదానివి ఇందాక బెట్టు చేశావే? ఇంకొకటి పాడరాదు. నాకోసం...’’ అడిగింది నా భార్య. ఆ పిల్ల తలూపి మొదలుపెట్టింది.
‘‘లాలనుచు నూచేరు లలన లిరుగడలా... బాలగండవీర బాలగోపాల’’
పాడే విధానం చూస్తే ఆ అమ్మాయికి కచ్చితంగా సంగీత జ్ఞానం ఉందని అర్థమౌతోంది. లాలి పాడుతూ పిల్లాణ్ని జో కొడుతోంది అనుకున్నాను కానీ, జాగ్రత్తగా గమనిస్తే, తాళం వేసుకుంటోందని అర్థం అయ్యింది. ఈసారి పాటలో సంగతులు కూడా ఎక్కువయ్యాయి. ‘‘లాలీ లాలి లాలీ లాలి’’ అంటూ ఆ పాట కూడా ముగిసింది. ఈ రెండో పాట సగానికి వచ్చేసరికే పసిపిల్లాడు గాఢంగా నిద్రపోయాడు. పక్క కూపేలో ఉన్న మరో ఇద్దరు కూడా వచ్చి కూర్చున్నారు. కంపార్ట్మెంట్లో చిన్న కచేరియే జరిగింది. ఈసారి ఇంకో పాట పాడమని ఎవరూ అడగలేదు. ఆ అమ్మాయి తనంతట తానే మొదలుపెట్టింది. ఈసారి తిల్లాన..!
‘‘నాదిర్దిత్తోం నాదిర్దిత్తోం’’ ఒక ప్రవాహంలాగ దూకుతూ, ఉరుకుతూ. ఆ అమ్మాయి కళ్లు మూసుకొని ఏదో అలౌకికమైన ఆనందాన్ని పొందుతూ పాడింది. మా శ్రీమతి చాలా ఇబ్బంది పడిపోయింది. సాక్షాత్తూ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు ముందు నిలబడితే, మంగళహారతి పాడమని పాపం చేసినంత బాధపడిపోయింది. సంగీతంలో తెలియని లోతులేవో స్పృశించినంత ఆనందంగా ఆ అమ్మాయి కన్నీళ్లు కార్చేసి పాట పూర్తి చేసింది. అక్కడే నిలబడిపోయిన టీసీ, హాకర్స్తో సహా అందరూ చప్పట్లు కొట్టారు. ఆ అమ్మాయి కూతురైతే మా అందరి చప్పట్లు చూసి ఇంకా ఆనందంగా కేరింతలు కొట్టింది. సాక్షాత్తూ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు ముందు నిలబడితే, మంగళహారతి పాడమని పాపం చేసినంత
బాధపడిపోయింది.
ఆ అమ్మాయి ఏదో ట్రాన్స్ నుండి మేలుకొన్నట్లు కళ్లు తెరిచి, తడబడి, ‘‘బాబు నిద్రపోయాడు. ఇంక నేను కూడా పడుకుంటానండీ’’ అంది. మా సమాధానం వినకుండా చకచక లేచి బెర్తు మీద గుడ్డ పరిచి సర్దటం మొదలుపెట్టింది. పాటలు ఇంకా వినాలని ఉన్నా నేను అడగలేదు. ఆ అమ్మాయి పిల్లలిద్దర్నీ బెర్త్ మీద పడుకోబెట్టి తాను మాత్రం కిటికీకి ఆనుకొని కళ్లు మూసుకొంది. మాతో తెచ్చుకున్నవి తిని మేము కూడా నిద్రకి ఉపక్రమించాం. లైట్లు ఆర్పేశాం. ఎప్పుడో ఒక రాత్రిపూట ఆ అమ్మాయి, కూతురు మాట్లాడుకుంటుంటే వినపడి మెలకువ వచ్చింది.
‘‘నువ్వు బాగా పాడావు మమ్మీ.’’
‘‘ఊ!’’
‘‘మరి నువ్వు ఎప్పుడూ పాడవెందుకు?’’
‘‘ఎందుకంటే నేను ఇలా ఎవరి ముందూ పాడనని డాడీకి ప్రామిస్ చేశాను కాబట్టి.’’
‘‘ఎందుకు?’’
‘‘డాడీకి పాటలంటే ఇష్టం లేదు.’’
‘‘ఎందుకు ఇష్టం లేదు?’’
‘‘ఎందుకంటే... లేదు అంతే. నీకు వంకాయ కూర ఇష్టం లేదంటావు కదా. అలాగే డాడీకి పాటలంటే ఇష్టం లేదు. నేను ఈ రోజు పాటలు పాడానని డాడీకి చెప్పకూడదు. సరేనా?’’
‘‘ఎందుకు చెప్పకూడదూ?’’
‘‘చెప్తే ప్రామిస్ తప్పానని డాడీకి కోపం వస్తుంది. కోపం వస్తే డాడీ ఏం చేస్తాడో తెలుసు కదా?’’
‘‘ఊ!’’
అంతే. ఆ తరువాత ఆ అమ్మాయి ఎప్పుడు దిగిపోయిందో, ఏ స్టేషన్లో దిగిపోయిందో నేను చూడలేదు.
- అరిపిరాల సత్యప్రసాద్