దటీజ్ అర్జమ్మ
నిరుపేద గిరిజన కుటుంబం నుంచి ఎస్సైగా ఎదిగిన వైనం
చేయూతనందిస్తే దైన్నైనా సాధిస్తామని నిరూపిస్తున్నారు గిరిజనులు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి కుంజ దుర్గయ్య ఓ రికార్డు సృష్టించగా నిరుపేద కుటుంబంలో పుట్టి ప్రతికూల పరిస్థితుల్లో ఎస్సై పోస్టును సంపాదించుకుంది పుడిగి అర్జమ్మ. స్ఫూర్తిదాయకురాలైన ఆమెగురించి తెలుసుకుందామా..
గంగవరం : కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహాపురుషులవుతారూ అన్నాడు వేటూరి. అది అక్షర సత్యమని నిరూపించింది పుడిగి అర్జమ్మ. ఆమె పుట్టింది ఓ నిరుపేద గిరిజన కుటుంబంలో. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. కూలిపనులు చేసుకొనే తండ్రి, అన్నదమ్ముల ప్రోత్సాహంతో ఆమె కష్టించి బాగా చదువుకొంది. ఇప్పుడు సివిల్ ఎస్సైగా ఎంపికై పలువురికి ఆదర్శప్రాయంగా నిలుస్తోంది అర్జమ్మ. కృషి, పట్టుదల, సాధన ఉంటే దేనినైనా సాధించగలరనడానికి ఆమె నిదర్శనంగా నిలుస్తోంది. గంగవరం మండలం ఏటిపల్లి గిరిజన గ్రామానికి చెందిన అర్జమ్మ ఏటిపల్లి ఎంపీపీ పాఠశాలలో ప్రాథమిక విద్య, రాజవొమ్మంగి గురుకులం పాఠశాలలో ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ చదివింది. టెన్త్‌లో 511 మార్కులు సాధించి పాఠశాల తృతీయ స్థానం, ఇంటర్లో 854 మార్కులతో కళాశాల ద్వితీయ స్థానాన్ని సాధించింది. ఆమె ప్రతిభను, పేదరికాన్ని గుర్తించిన పెద్దాపురానికి చెందిన ‘సూర్య ఫౌండేషన్’ డైరెక్టర్ కె. దామోదర్ అర్జమ్మ ఉన్నత విద్యకు సహకారాన్ని అందించారు. ఆయన ప్రోత్సాహంతో ఆమె బీటెక్ పూర్తి చేసింది. రంపచోడవరం వైటీసీ, భద్రాచలం వైటీసీలో గ్రూప్ 2 కోచింగ్‌కు తీసుకుంటూ ఎస్సై పరీక్షకు హాజరై మంచి ర్యాంక్‌ను సాధించి సివిల్ ఎస్సైగా ఎంపికయ్యింది.
కుటుంబ నేపథ్యం
తండ్రి పుడిగి చంటబ్బాయి. ఇద్దరు అన్నలు బాలేష్, రమణ, తమ్ముళ్లు వీరబాబు, శ్రీనుబాబు వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. బాలేష్ గంగవరం, అడ్డతీగల వారపు సంతల్లో కూరగాయల వ్యాపారి వద్ద రోజు కూలీగా పని చేస్తున్నాడు.
పేదలకు న్యాయం చేస్తా
నా లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగం సాధించి పేదలకు సేవలు అందించడం. కష్టించి కృషి చేస్తే దేనినైనా సాధించగలమనే నమ్మకం కలిగింది. నాకు విద్యను అందించిన గురువులకు, ప్రోత్సాహం అందించిన వారందరికి రుణపడి ఉంటా. ఏజెన్సీలో మంచి ప్రతిభా వంతులున్నారు. చాలామంది పేదరికంతో ఉన్నత చదువులకు వెళ్లలేక పోతున్నారు. అటువంటి వారికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే విజయాలు సాధించýగలరు.
-అర్జమ్మ
చాలా గర్వంగా ఉంది
అర్జమ్మ చదువుకు ఎటువంటి అడ్డు చెప్పలేదు. ఎంతో కష్టపడి చదువుకొని నేడు ఈ ఉన్నత ఉద్యోగాన్ని పొందడం మా కుటుంబానికి ఎంతో గర్వంగా ఉంది. అర్జమ్మ ఉన్నత చదువుకు సహకారం అందించిన వారికి ఎంతో రుణపడి ఉంటాం.
-చంటబ్బాయి, అర్జమ్మ తండ్రి