నిశ్చితార్థం రోజునే విషాదం
సాక్షి, ఖమ్మం: పోలీసు శాఖలోని ఓ ఏఆర్(ఆర్మ్డ్ రిజర్వ్) కానిస్టేబుల్ ఖమ్మం జిల్లా కేంద్రంలోని లాడ్జీలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం వెలుగు చూసింది. అయితే, ఇదేరోజు ఆయన నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం యజ్ఞనారాయణపురానికి చెందిన కంచెపోగు వెంకటేశ్వర్లు– సుజాత కుమారుడు అశోక్‌కుమార్(28) 2020లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు.
ములుగు జిల్లాలో స్పెషల్ పార్టీ కానిస్టేబుల్‌గా పనిచేస్తుండగా ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం బదిలీ అయ్యారు. ఇంకా రిలీవ్ చేయకపోవడంతో ములుగు జిల్లాలోనే అటాచ్మెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా, అశోక్‌కుమార్‌కు తన స్వగ్రామం పక్కనే ఉన్న చిన్నకోరుకొండికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఈ మేరకు ఈ నెల 10న నిశితార్థం ఉండగా, 8న సెలవు పెట్టి కల్లూరుకు బయలుదేరాడు.
ములుగు నుంచి ఖమ్మం వచ్చి స్థానిక గాంధీచౌక్‌లోని బడ్జెట్ లాడ్జీలో అర్ధరాత్రి దాటాక గదిని అద్దెకు తీసుకున్నాడు. కాగా, 9వ తేదీ సాయంత్రం హోటల్ రూమ్‌బాయ్ గది కాలింగ్ బెల్ కొట్టినా స్పందించలేదు. సోమవారం ఉదయం కూడా స్పందించకపోవడంతో హోటల్ మేనేజర్ ఇచ్చిన సమాచారం మేరకు ఖమ్మం త్రీటౌన్ పోలీసులు వచ్చి పరిశీలించగా అశోక్‌కుమార్ ఉరేసుకుని కనిపించాడు.
జేబులో ఐడీకార్డును చూసి ఆయన ఏఆర్ కానిస్టేబుల్‌గా గుర్తించారు. నైలాన్ తాడుతో ఫ్యాన్‌కు ఉరేసుకోవడం, ఫ్యాన్ నుంచి మంచానికి తక్కువ దూరం ఉండటంతో ఉరిపడ్డాక తాడు సాగే అవకాశముందని, అందుకే ఆయన మంచంపై కూర్చున్న రీతిలో ఉన్నారని, తాడు పెద్దగా లేకపోవడంతో ఆయన పడిపోకుండా అలాగే ఉండి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
నిశ్చయ తాంబూలాల రోజునే...
అశోక్‌కుమార్ నిశ్చయతాంబూలం సోమవారం జరగాల్సి ఉండగా, ఇదేరోజు విగతజీవిగా మారడంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాగా పెళ్లి ఇష్టం లేకే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇటీవల ములుగు జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం బదిలీ అయిన అశోక్‌కుమార్‌ను మరికొంతకాలంపాటు అక్కడే విధులు నిర్వర్తించాలని అధికారులు సూచించారని, అయితే, బదిలీ ఇష్టం లేకపోవడంతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.