ఎయిరిండియా స్పెషల్ ఆఫర్: 50శాతం ఆఫ్
సాక్షి, న్యూఢిల్లీ : నేషనల్ క్యారియర్ ఎయిరిండియా ఎంపికచేసిన కేటగిరీ ప్రయాణికులకు 50 శాతం డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. విద్యార్థులకు, సాయుధ దళ సిబ్బందికి, సీనియర్ సిటిజన్లకు ఈ డిస్కౌంట్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా ఎయిరిండియా ఈ విషయాన్ని తెలిపింది. ''ప్రస్తుతం విద్యార్థులు, సాయుధ దళ సిబ్బంది, సీనియర్ సిటజన్లు కేవలం ఎయిరిండియాలో ప్రయాణించవచ్చు. 50 శాతం తగ్గింపు ఇస్తున్నాం. సెప్టెంబర్1 నుంచి అమల్లోకి వస్తుంది'' అని ఈ విమానయాన సంస్థ ట్వీట్ చేసింది. అయితే ఈ ప్రమోషన్ స్కీమ్ ఎప్పుడు ముగుస్తుందో మాత్రం వెల్లడించలేదు.
ఎకానమీ క్లాస్‌లో ఎయిర్ ఇండియా దేశీయ విభాగాలపై ప్రాథమిక ఛార్జీల(ఎంపిక చేసిన ఛార్జీలు)కు ఇది అందుబాటులో ఉంటుందని ఎయిరిండియా పేర్కొంది. ప్రయాణం చేయడానికి ఏడు రోజుల ముందు దీని కింద టిక్కెట్లను కొనుగోలు చేసుకోవాలని సూచించింది. అంతేకానీ ఈ డిస్కౌంట్ స్కీమ్ కింద ఎన్ని సీట్లను అందుబాటులో ఉంచుతుందో కూడా తెలుపలేదు. ఎయిరిండియా బుకింగ్ ఆఫీసులు, కాల్ సెంటర్, ఎయిరిండియాడాట్ఇన్ వెబ్సైట్లలో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
విద్యార్థులకు.. ఎయిరిండియా బుకింగ్స్ పోర్టల్‌లో ఢిల్లీ నుంచి గోవాకు టిక్కెట్ ధర రూ.4,690గా ఉంది. సెప్టెంబర్ 11 వరకు ఈ విధమైన ధరలే ఉన్నాయి. డిస్కౌంట్ లేకుండా అయితే దీని టిక్కెట్ ధర రూ.8,614గా ఎయిరిండియా వెబ్సైట్ చూపిస్తోంది. ఈ ఆఫర్లో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. విద్యార్థులు భారత్‌లో చదువుతున్న వారై ఉండాలి. రాష్ట్ర లేదా కేంద్ర విద్యాసంస్థ/యూనివర్సిటీ తరుఫున గుర్తింపు పొందిన, దానికి అనుబంధ సంస్థలో అయిన కనీసం ఒక ఏడాది పాటు ఫుల్‌టైమ్ కోర్సులో ఎన్రోల్ చేసుకుని ఉండాలి. అలాగైతేనే ఎయిరిండియా ఈ ఆఫర్ అందిస్తోంది. 12 నుంచి 26 ఏళ్ల మధ్య వయసున విద్యార్థులకు మాత్రమే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. సాయుధ దళాలకు కూడా ఈ ఆఫర్‌ను ఎయిరిండియా అందిస్తోంది. వారి కుటుంబసభ్యులకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తోంది.
#AIUpdate: Effective #today avail 50% #discount on #Students along with #ArmedForces #SeniorCitizens Pl visit https://t.co/T1SVjRluZv #FlyAI pic.twitter.com/n29xNWsyB5
— Air India (@airindiain) September 1, 2017